ప్రాంతీయ ఆసుపత్రిలో అభివృద్ధి పనుల ప్రగతిని పరిశీలించిన జిల్లా కలెక్టర్

ప్రచురణార్థం-1
రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 14: వేములవాడ తిప్పాపూర్ లో గల ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రిలో చేపడుతున్న పలు అభివృద్ధి పనుల పురోగతిని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మంగళవారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఆసుపత్రి భవనం మొత్తం కలియ తిరిగి ఆక్సిజన్ జనరేషన్ ట్యాంకు, క్యాంటీన్, డార్మెట్రీ, పాలియేటివ్ కేర్ యూనిట్ ఏర్పాటు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. సిమెంటు రోడ్డు నిర్మాణ పనులపై ఆరా తీశారు. ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ సేవలు ప్రారంభమైన సందర్భంగా ఆసుపత్రికి వచ్చే రోగులు ఆరోగ్యశ్రీ సేవలు వినియోగించుకునేలా తెలియజేయాలని సూచించారు. ఆసుపత్రి ఆవరణలో ప్లాంటేషన్ చేయించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.

వైకుంఠధామం నిర్మాణ పనుల పురోగతి తనిఖీ
వేములవాడ మున్సిపల్ పరిధిలో నిర్మిస్తున్న వైకుంఠధామం నిర్మాణ పనుల పురోగతిని కలెక్టర్ మున్సిపల్ అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో తనిఖీ చేశారు. జనవరి మొదటి వారంలోగా వైకుంఠధామం పూర్తి స్థాయిలో నిర్మించాలని ఆయన ఆదేశించారు.

వ్యాక్సినేషన్ ప్రక్రియ తనిఖీ
వేములవాడ మున్సిపల్ పరిధిలోని తిప్పాపూర్, అంజనీనగర్, వేములవాడ గ్రామీణ మండలం మర్రిపెల్లి, అర్బన్ మండలం మారుపాక గ్రామాల్లో ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ తిరిగి వ్యాక్సినేషన్ వేస్తున్న ప్రక్రియను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. మొదటి డోస్ వేసుకొనని వారిని గుర్తించి వ్యాక్సిన్ వేయాలని, రెండవ డోస్ కు అర్హులై కూడా ఇంకా వ్యాక్సిన్ వేసుకొనని వారు వ్యాక్సిన్ తీసుకునేలా ఆరోగ్య సిబ్బంది అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. వేములవాడ పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో, సుభాష్ నగర్ లోని అర్బన్ హెల్త్ సెంటర్ లో ఈ శుక్రవారం మెగా వ్యాక్సినేషన్ క్యాంపులు ఏర్పాటు చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు.

ఈ సందర్శనలో కలెక్టర్ వెంట జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డా. సుమన్ మోహన్ రావు, మున్సిపల్ కమీషనర్ శ్యామ్ సుందర్ రావు, ప్రాంతీయ ఆసుపత్రి పర్యవేక్షకులు డా. మహేష్ రావు, తదితరులు ఉన్నారు.

Share This Post