ప్రాజెక్టుల భూ సేకరణ, నిర్మాణ పనుల పురోగతి సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్

రాజన్న సిరిసిల్ల, నవంబర్ 10: జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న ప్యాకేజీల పనులకు సంబంధించి భూ సేకరణ, తదితర నిర్మాణ పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సమీక్ష నిర్వహించారు.
బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించి, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన ప్యాకేజీ 9,10,11,12 పనులు, భూసేకరణ అంశాలపై చర్చించారు. రైల్వే భూసేకరణ, తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ ప్రాజెక్టు కోసం అవసరమైన భూసేకరణ, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన రంగనాయక సాగర్ లో అదనపు టీఎంసీ లింక్ -4 భూ సేకరణ, పెద్దూర్ – బోనాల పరిశ్రమల పార్కు మొదలైన వాటికి సంబంధించిన భూ సేకరణ నిర్దేశించిన గడువు లోగా పూర్తి చేయాలని రెవెన్యూ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యంగా మల్కపేట ప్యాకేజీ -9 కు సంబంధించి అవసరమైన భూసేకరణ వేగవంతంగా చేయాలని అన్నారు. శాఖలు సమన్వయంతో పనిచేయాలని, అవసరమైన చోట జాయింట్ సర్వే చేపట్టి, సమస్యలు పరిష్కరించుకోవాలని కలెక్టర్ తెలిపారు.
ఈ సమీక్షలో ఇంఛార్జి రెవెన్యూ అధికారి టి. శ్రీనివాస రావు, వేములవాడ ఆర్డీఓ వి. లీల, ఏడీ సర్వే & ల్యాండ్ రికార్డ్స్ శ్రీనివాస్, ఆర్ & బి ఈఈ కిషన్ రావు, మిషన్ భగీరథ ఇంట్రా ఈఈ జానకి, కలెక్టరేట్ పర్యవేక్షకులు రమేష్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post