జిల్లాలోని తుమ్మిడిహెట్టిలో గల ప్రాణహిత నది పరివాహక ప్రాంతంలో ఏప్రిల్ 18 నుండి 24వ తేదీ వరకు నిర్వహించ తలపెట్టిన ప్రాణహిత పుష్కరాలలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లతో సిద్దంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ రాజేశం, ఎస్.పి. (అడ్మిన్) సుధీంద్రతో కలిసి జిల్లా శాఖల అధికారులతో ప్రాణహిత పుష్కర ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈసారి నిర్వహించనున్న పుష్కరాలకు గతంలో కంటే అధికంగా భక్తులు అవకాశం ఉందని, ఈ మేరకు జిల్లాలోని ప్రభుత్వ శాఖలకు కేటాయించిన పనుల లక్ష్యాలను నిర్ధేశిత గడువులోగా పూర్తి చేసి సిద్దంగా ఉండాలని తెలిపారు. పుష్కరఘాట్లు, రహదారులు, అంతర్గత రహదారులతో పాటు ఘాట్లకు అనుసంధానమయ్యే రోడ్ల మరమ్మత్తులు, నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని, భక్తులకు త్రాగునీరు, మూత్రశాలలు, మరుగుదొడ్లు, మహిళలు దుస్తులు మార్చుకునేందుకు తాత్కాలిక గదులు, నీడ కోసం చలువ పందిళ్ళు, పిండ ప్రధానం కోసం ప్రత్యేక షెడ్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. వీధి దీపాలు, విద్యుత్ సరఫరా సౌకర్యం, వాహనాల నిలుపుదల కోసం పార్కింగ్తో పాటు పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేయాలని, పారిశుద్ధ్య నిర్వహణ పకదృంధీగా చేపట్టాలని, పుష్కర ఘాట్లకు
భక్తులకు దారి తెలిసే విధంగా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఆర్.టి.సి. అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని, వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలని, కొవిడ్ నియంత్రణ దిశగా మాస్క్ ధరింపు, సామాజిక దూరం పాటింపు, వ్యక్తిగత పరిశుభ్రత, కొవిడ్ నిబంధనలు పాటించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చోసుకోకుండా ప్రతి ఘాట్ నందు గజ ఈతగాళ్ళను అందుబాటులో ఉంచాలని తెలిపారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కలిసి పని చేయాలని, పుష్కర ఏర్పాట్లకు సంబంధించి అంచనా వ్యయం నివేదిక తయారు చేసి అందించాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సురేష్ మండల తహశిల్దార్లు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పార సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.