*ప్రేమానురాగాలతో బతుకుతూ, రక్తదానం చేసి ఆపదలో, అవసరంలో ఉన్నవారి ప్రాణాలను నిలబెట్టాలి …… *

*ప్రేమానురాగాలతో బతుకుతూ, రక్తదానం చేసి ఆపదలో, అవసరంలో ఉన్నవారి ప్రాణాలను నిలబెట్టాలి …… *

ప్రచురణార్థం

మహబూబాబాద్ ఆగస్ట్ -17:

ప్రేమానురాగాలతో బతుకుతూ, రక్తదానం చేసి ఆపదలో, అవసరంలో ఉన్న వారి ప్రాణాలు నిలబెట్టాలని, స్థానిక శాసనసభ్యులు శంకర్ నాయక్ అన్నారు.

స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా బుధవారం జిల్లా ప్రధాన ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో స్థానిక శాసనసభ్యులు శంకర్ నాయక్ జిల్లా కలెక్టర్ కె. శశాంక తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రక్తదానం చేశారు.

ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మేల్యే మాట్లాడుతూ, ఎంతోమంది మహానుభావులు వారి ప్రాణత్యాగాలు, కృషి ఫలితంగానే ఈ రోజు స్వాతంత్య్రం రావడం జరిగిందని, ఈ స్వాతంత్య్ర భారతంలో మనమందరం కలిసికట్టుగా మంచి ప్రేమానురాగాలతో బతకడం, చాలా మంది బలిదానాలపైన సాధించుకున్న ఈ స్వాతంత్య్రంలో అందరు సుఖ శాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, ఆ రోజు మహాత్మాగాంధీ స్వచ్చ భారత్ ఉండాలని, ఆకలి చావులు ఉండకూడదని, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు, ఉండడానికి ఇళ్లు ఉండాలని ఆలోచించిన మహాత్మాగాంధి, సుభాష్ చంద్రబోస్, ఎందరో మహనీయుల త్యాగాలపై వచ్చిన భారత దేశంలో వారి ఆశయ సాధనకై పాటు పడాలని, నీటి బుడగలాంటి జీవితం కోసం పాకులాటలు, నేరాలు, ఘోరాలు చేయకుండా ప్రతి ఒక్కరూ ప్రేమానురాగాలతో బతకాలని, అన్నింటికంటే రక్తదానం గొప్పదని, అందరూ రక్తదానం చేసి ఒక ప్రాణాన్ని కాపాడాలని కోరారు. అలాగే అవయదానం చేయాలని, మనకు సమాజం ఏమి ఇస్తుంది అనేది కాకుండా, సమాజానికి మనం ఏమి ఇస్తున్నామో ఆలోచించాలని, సమాజానికి మనం పనికి రావాలని తెలిపారు. గతంలో ఉన్న మానుకోటకు, ఇప్పటి మానుకోటకు తేడా ఉన్నదని, అన్ని విధాల అభివృద్ధి చేయాలనే ఒక ఆకాంక్షతో ముందుకు పోతున్నామని తెలిపారు.ఈ సందర్భంగా అభివృద్ధికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. భగవంతుడి తర్వాత డాక్టర్లే దేవుళ్లు అంటారని, అలాంటి సందర్భంలో ఆసుపత్రికి వచ్చిన పెషేంట్లతో మంచిగా, త్వరగా స్పందించి వైద్య సేవలు అందించాలని తెలిపారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా గొప్పగా నిర్వహిస్తున్న స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్వి సప్తాహంలో భాగంగా ఈ రోజు జిల్లాలో రెండు చోట్ల రక్తదాన శిభిరాలు ఏర్పాటు చేశామని, ఒకటి జిల్లా ఆసుపత్రిలో మరొకటి డోర్నకల్ పి.హెచ్.సి.లో నిర్వహిస్తున్నామని తెలిపారు. 75 సంవత్సరాల క్రితం మనకు స్వాతంత్య్రం సిద్ధించిందంటే ఎందరో గొప్పవారు వారి బలిదానాలు, త్యాగాలు, చాలా మంది రక్తం చిందించడం వలన ఈ రోజు మనం స్వాతంత్య్రం అనుభవిస్తున్నామని, మనం స్వయంగా రక్తం చిందించలేకపోయినా కూడా ఈ రోజు అన్నిటికంటే గొప్పదానం రక్తదానం అని చెప్పడం జరుగుతుందని, ఎంతోమందికి చాలా విపత్కర పరిస్థితుల్లో ఈ రక్తం అవసరం అవుతుంది కాబట్టి ఆరోగ్యంగా ఉన్న ఎవరైనా కాని ముందుకు వచ్చి రక్తదానాన్ని చేసి ఇతరులను, ఆపదలో వున్న వారిని, అవసరంలో ఉన్నవారి ప్రాణాలు నిలబెట్టే విధంగా ముందుకు రావాలనే ఉద్దేశ్యంతో, ఆ స్వాతంత్య్ర స్పూర్తి కూడా ఒకసారి మననం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. రక్తదాన కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన వాలంటీర్లందరికి అందరికి కృతజ్ఞతలు తెలిపారు.

మనం ఇచ్చే రక్తం, మనకు పరిచయం లేని వారికి, మనకు మొహం కూడా తెలియని వారికి ఎలాగైతే ఉపయోగపడుతుందో, మనకు ఏదైనా ఆపద ఉన్నప్పుడు, మనకు ఏదైన అవసరం వచ్చిన సందర్భంలో ఎవరో వేరేవారు గొప్ప హృదయంతోటి దానం చేసిందే మనకు కూడా ఉపయోగపడే అవకాశం ఉందని, అరుదైన బ్లడ్ గ్రూప్ ఉన్నవారు ఉంటారనీ, ప్రమాదాలు జరిగినప్పుడు అప్పటికప్పుడు ఐదే నిమిషాల్లో రక్తం అవసరం అయిన సందర్భాలు ఉంటాయి కాబట్టి, మనం చేసిన ఈ ఉపకారం ఖచ్చితంగా మనకు తిరిగి మేలు చేస్తుంది కాబట్టి, మనం ఇది అలవాటుగా చేసుకోవాలని, ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆరోగ్యంగా ఉన్నవారు ముందుకు వచ్చి ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో బ్లడ్ బ్యాంక్ కు సంబంధించి 30 నుండి 40 యూనిట్లు ప్రతి నెల కూడా అవసరం అవుతున్నదని, వైద్య కళాశాల ఏర్పాటు చేసుకున్న సందర్భంలో మరింత రక్తం ఇక్కడ అవసరం ఉంటుందని, అందరూ రక్తదానం చేయడం అలవాటుగా చేసుకోవాలని అన్నారు. ఆరోగ్యం వేరే వారికి అందించడంలో ఉన్న తృప్తిని మీరందరు పొందాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ పాల్వాయి రాం మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఫరీద్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజ్, సూపరింటెండెంట్ లు వెంకట్రాములు, డాక్టర్ శ్రీనివాస రెడ్డి, రెడ్ క్రాస్ నుండి వరప్రసాద్, డిప్యూటీ డి.ఎం.హెచ్. ఓ. అంబరీష, డాక్టర్ సుధీర్ రెడ్డి, ఆర్.ఎం. ఓ., డి.ఆర్.డి. ఓ. సన్యాసయ్య, ఎన్. జి.ఓ. ప్రతినిధులు, రక్తదాతలు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post