ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సేవలు జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి కాన్పులు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరిగేలా చూడాలి ఐసీడీఎస్ అధికారులతో సమీక్ష

ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకున్నామని, ఇకపై నూటికి నూరు శాతం ప్రసవాలన్నీ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరిగేలా చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని ప్రగతి భవన్ లో ఐసీడీఎస్ అధికారులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులతో కలెక్టర్ సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ పకడ్బందీగా లేకపోవడం వల్ల ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎక్కువగా కాన్పులు జరుగుతున్నాయని అన్నారు. దీనివల్ల సీజీరియన్ ఆపరేషన్లు విపరీతంగా జరుగుతున్నాయని, ఇది తీవ్ర ఆందోళన కలిగించే పరిణామంగా మారిందన్నారు. రాష్ట్రంలో సగటున 66 శాతం సీజీరియన్ లు అవుతుండగా, అంతకు మించి జిల్లాలో 77 శాతం జరుగుతున్నాయని అన్నారు. అందులోను ప్రైవేట్ ఆసుపత్రుల్లో జరిగే కాన్పులకు సంబంధించి ఏకంగా 92 శాతం సీజీరియన్ లు చేస్తున్నారని కలెక్టర్ ఆందోళన వెలిబుచ్చారు. మహిళల ఆరోగ్యానికి, భావి సమాజానికి కూడా ఇది ఎంతమాత్రం శ్రేయస్కరం కాదని అన్నారు. సీజీరియన్ ఆపరేషన్ల వల్ల మహిళలు ఆరోగ్యపరంగా అనేక సమస్యలకు లోనవ్వాల్సి వస్తుందనే విషయం తెలిసినప్పటికీ, కొన్ని ఆసుపత్రుల్లో అవసరం లేకపోయినా సీజీరియన్ లు చేస్తున్నారనే ఫిర్యాదులు తరుచూ అందుతున్నాయని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లోనే సీజీరియన్ లు చేయాలని, అలా కాకుండా ఇతరాత్రా ప్రయోజనాల కోసం మహిళల ఆరోగ్యాలను పణంగా పెడితే జిల్లా యంత్రాంగం కఠిన చర్యలు చేపడుతుందని కలెక్టర్ హెచ్చరించారు.
పరిస్థితి తీవ్రతను గుర్తెరిగి అంగన్వాడీ కార్యకర్తలు క్షేత్ర స్థాయిలో అంకితభావం తో విధులు నిర్వర్తిస్తూ, ప్రసవాలన్నీ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరిగేలా చూడాలన్నారు. ఆశా వర్కర్లు, ఏ ఎన్ ఎం లతో కలిసి గర్భిణీ మహిళల ఆరోగ్య స్థితిగతులను పర్యవేక్షిస్తూ, వారు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించుకునే చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఈ ఒక్కరికి కూడా రక్త హీనత సమస్య ఏర్పడకూడదని అన్నారు. ప్రతి గర్భిణీ మహిళకు సంబంధించిన వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలని, ఈ విషయంలో ఎవరైనా నిర్లక్షయానికి తావిస్తే వారి వేతనాల్లో వేయి రూపాయల చొప్పున కొత్త విధిస్తామని స్పష్టం చేశారు. అదే సమయంలో అంకిత భావంతో సమర్ధవంతంగా పని చేసే వారికి ప్రభుత్వ పరంగా ప్రోత్సాహకాలు అందిస్తామని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిష్ణాతులైన స్త్రీ వైద్య నిపుణులు అందుబాటులో ఉన్నారని, కేసీఆర్ కిట్ పథకం కింద ప్రభుత్వ ప్రోత్సాహకం అందజేబడుతోందనే విషయాన్ని వివరిస్తూ గర్భిణీలు ప్రభుత్వ దవాఖానల్లోనే కాన్పులు చేయించుకునేలా చూడాలన్నారు. అలాగే వంద శాతం ఇమ్యూనైజేషన్ లక్ష్యాన్ని సాధించాలని, మాత శిశు ఆరోగ్యాల పరిరక్షణ పై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని కలెక్టర్ సూచించారు. గ్రామాల వారీగా సర్వే చేపట్టి అనాధ బాలలు, దివ్యంగులను గుర్తించి వారికి వసతి సౌకర్యం కల్పించాలన్నారు. స్త్రీ, శిశు సంక్షేమ, పంచాయతీరాజ్, విద్య, వైద్య శాఖల అధికారులు, సిబ్బంది పరస్పరం సమన్వయాన్ని పెంపొందించుకుని సమిష్టిగా కృషి చేసినప్పుడే పూర్తి స్థాయిలో లక్ష్యాలను సాధించగల్గుతారని అన్నారు. ఆరోగ్యలక్ష్మి, పోషణ అభియాన్, వన్ స్టాప్ సెంటర్, బాలసదన్ ల నిర్వహణ తీరుతెన్నులను కలెక్టర్ సమీక్షిస్తూ, అధికారులకు సూచనలు చేశారు.
అనాధ బాలలు, వృద్దులు, అత్యాచార బాధితులు తదితర వర్గాల వారికి సేవలందిస్తున్న స్వచ్చంద సంస్థల నిర్వాహకులను కలెక్టర్ అభినందించారు. జిల్లా యంత్రాంగం తరపున పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. వృద్దాశ్రమాల్లో ఉంటున్న వారికి పెన్షన్, రేషన్ బియ్యం అందించడంతో పాటు, క్రమం తప్పకుండా డాక్టర్, ఏ ఎన్ ఎం లచే వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని ఝాన్సీ, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ సుదర్శనం, డీపిఓ డాక్టర్ జయసుధ, డీ ఈ ఓ దుర్గాప్రసాద్, మాతా శిశు ఆరోగ్య విభాగం జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ అంజన తదితరులు పాల్గొన్నారు.
———————-

Share This Post