ప్ర హన్మకొండలోని ప్రొఫెసర్ జయశంకర్ పార్కులో శుక్రవారం నాడు ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పుష్ప మాల వేసి మంత్రి శ్రద్ధాంజలి ఘటించారు.

ప్రెస్ రిలీజ్.
వరంగల్ అర్బన్ (బాల సముద్రం)
తేది.6.8.2021.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సిద్ధాంతకర్త గా, ప్రొఫెసర్ గా, యావత్ తెలంగాణ ప్రజానీకంలో చెరగని ముద్ర వేసిన మహోన్నతుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీ ణాభివృద్ధి & గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభిప్రాయపడ్డారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని పురస్కరించుకొని హన్మకొండలోని ప్రొఫెసర్ జయశంకర్ పార్కులో శుక్రవారం నాడు ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పుష్ప మాల వేసి మంత్రి శ్రద్ధాంజలి ఘటించారు. విద్యార్థి దశ నుంచే తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై, అసమానతల పట్ల తీవ్రంగా పోరాటం చేసిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ అని మంత్రి అన్నారు. అధ్యాపకునిగా, పరిశోధకుడిగా ఆయన ఏం చేసినా తెలంగాణ కోణంలోనే నిత్యం ఆలోచించే మహనీయుడుయని మంత్రి అన్నారు. తెలంగాణ డిమాండును 1969 నుంచే సున్నితంగా అధ్యయనం చేస్తూ, విశ్లేషిస్తూ, రచనలు చేశారని ఆయన అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర వాదనను, డిమాండ్ సాధనను, రాజకీయ ప్రక్రియనే మార్గమని నిర్దేశించిన మహనీయుడన్నాడు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఆవశ్యకతపై జయశంకర్ సార్ ఎంతోమందికి స్ఫూర్తినిచ్చారని ఆయన అన్నారు. జయశంకర్ సారు తన ఆస్తిని, జీవితాన్ని తెలంగాణ కోసం అంకితం చేసి ఆద్యంతం బ్రహ్మచారి గా జీవితం గడిపాడని, ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను గల్లీ నుండి ఢిల్లీ దాకా వ్యాప్తి చేయడంలో వారి పాత్ర మరువలేనిదని మంత్రి అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్ కు మార్గదర్శిగా తోడ్పాటు అందించి సిద్ధాంతకర్త గా చరిత్రలో నిలిచిపోయారని ఆయన అన్నారు.
తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ జయశంకర్ సార్ ఆకాంక్షను, ఆశయాలకు అనుగుణంగా పథకాలను అమలు చేస్తున్నారని మంత్రి అన్నారు. జయశంకర్ సార్ కు అత్యంత ప్రాధాన్యతనిస్తున రాష్ట్ర ప్రభుత్వం ఆయన జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. జయశంకర్ సార్ పేరును ఎల్లవేళలా గుర్తించుకునే విధంగా భూపాలపల్లి జిల్లాను, జయశంకర్ భూపాలపల్లి జిల్లా గా అగ్రికల్చర్ యూనివర్సిటీని జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం గా నామకరణం చేయడం జరిగిందని మంత్రి అన్నారు. వారితో తనకు, తన కుటుంబానికి విడదీయరాని అనుబంధం ఉందని ఆయన తెలిపారు.

వరంగల్ నగర పాలక సంస్థ మేయర్ గుండు సుధారాణి, వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ హరిత, శాసన మండలి సభ్యుడు బసవరాజు సారయ్య, కూడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రొఫెసర్ సీతా రామ్ నాయక్, వరంగల్ నగర పాలక సంస్థ మాజీ మేయర్ గుండా ప్రకాష్ రావు, రాష్ట్ర గిరిజన కార్పోరేషన్ మాజీ చైర్మన్ మోహన్ గాంధీ నాయక్ జయంతి దినోత్సవంలో పాల్గొని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేశారు

.

Share This Post