ప్లాస్టిక్ నుండి పర్యావరణాన్నీ కాపాడుకోడానికి వెదురు మంచి ప్రత్యామ్నాయం – జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్

ప్రపంచ వెదురు దినోత్సవం సందర్భంగా శనివారం జిల్లా మేదర సంఘం ఆధ్వర్యంలో సంఘ నాయకులు జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ ను కలిసి వెదురుతో చేసిన పేపర్ ట్రే ను బహుకరించారు.
వెదురు చేతి వృత్తిదారులకు వెదురు సరఫరా మరియు ఆర్థిక సహకారం అందించాలని కోరుతూ కలెక్టర్‌ ఉదయ్ కుమార్ కు వినతిపత్రం ఇచ్చారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వస్తువులు పర్యావరణానికి ముప్పుగా మారిందని దీనికి ప్రత్యామ్నాయముగా వెదురు బొంగులతో తయారుచేసే ఉత్పత్తులు వాడాలని అన్నారు. వెదురు తో తయారు చేసిన బాటిళ్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందన్నారు.
అసోంలోని వెదురు బొంగు ఉత్పత్తుల వ్యాపారం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు.
అసోం పరిశ్రమలో తయారయ్యే వెదురు సామాగ్రికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉందన్నారు.
అలాంటి వెదురు చేతి ఉత్పత్తులు తయారు చేసేందుకు జిల్లా నుండి 5 మంది సభ్యులు మంచి నైపుణ్యం పొందేలా శిక్షణ అందుకోవాలని అన్నారు. అందుకు జిల్లా కలెక్టర్ గా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
ప్లాస్టిక్‌ వినియోగం పెరగడంతో పర్యావరణం పూర్తిగా దెబ్బతింటుందన్నారు.
రకరకాల ఆకర్షణీయమైన వెదురుతో తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెట్లో మంచి ధర ఉంటుందని, ప్రతి ఒక్కరూ ఆ విధమైన ఉత్పత్తులను తయారుచేసేలా నైపుణ్యాలను కలిగి ఉండాలన్నారు.
వెదురుతో చేసిన ఉత్పత్తులను నేరుగా ఫ్లిప్కార్ట్ అమెజాన్ వంటి యాప్ ద్వారా మార్కెటింగ్ చేసుకునేందుకు మంచి అవకాశాలు ఉన్నాయన్నారు.
దేశ విదేశాల్లో వెదురు ఉత్పత్తులకు మంచి ఆదరణ ఉందని ఆ విధమైన లాభాలు పొందేలా సంఘం సభ్యులు ప్రయత్నం చేయాలన్నారు.
జిల్లా వెదురు సంఘం అధ్యక్షుడు రమాకాంత్ మాట్లాడుతూ …. కులవృత్తులతో జీవనం సాగిస్తున్న మేదరలకు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ నుండి సహాయ సహకారాలు అందించి, వెదురు అందించి ఆర్థిక పరమైన సహాయ సహకారాలు అందించేలా కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి అనిల్ ప్రకాష్, మేదర సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, సభ్యులు కొండలయ్య, వెంకటేశ్వర్ బాలేశ్వరయ్యా చంద్ర రాజ్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post