ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దుటలో అందరు భాగస్వాములు కావాలి..కలెక్టర్ హరిష్

ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దుటలో అందరు భాగస్వాములు కావాలి..కలెక్టర్ హరిష్

ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దుటలో ప్రజలందరు భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ ఎస్. హరీష్ పిలుపునిచ్చారు. పర్యావరణాన్ని కాపాడడంతో పాటు నేటి భావితరానికి ప్రకృతి ప్రసాదించిన స్వచ్ఛమైన వనరులను అందజేయవలసిన బాధ్యత మనపై ఉందని అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలి ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత సమాజం నిర్మాణమే ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని ప్రజలు భాగస్వాములై ప్రభుత్వానికి సహకరించనాడే లక్ష్యాన్ని సాధిస్తామని అన్నారు. ఈ డిసెంబర్ నాటికి ప్లాస్టిక్ ను పూర్తిగా నిర్మూలించుటలో భాగంగా అక్టోబర్ ఒకటి నుండి 75 మైక్రాన్ ల మందం లోపు గల ప్లాస్టిక్ ను ప్రభుత్వం బ్యాన్ చేస్తున్నదని, ఈ ప్లాస్టిక్ వాడకం నివారణ పట్ల ప్రజలలో అవగాహన, చైతన్యం తీసుకురావలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ప్రస్తుతం గ్రామాలలో, మునిసిపల్ ప్రాంతాలలోని దుకాణాలలో 50 మైక్రాన్ల మందం కన్నా తక్కువ గల ప్లాస్టిక్ బ్యాగులను వెంటనే గుర్తించి తొలగించాలని డి.పి.ఓ, మునిసిపాల్ కమీషనర్లకు సూచించారు. ప్లాస్టిక్ బ్యాగుల స్థానంలో ప్రత్యామ్నాయంగా జ్యుట్ , కాటన్, నాన్ ఓవెన్ ఫ్యాబ్రిక్ బ్యాగులు వాడాలని వాటి పట్ల ప్రజలలో అవగాహన కలిగించాలని అన్నారు. జిల్లాలో స్వయం సహాయక మహిళా సంఘాలు ఇటువంటి బ్యాగులు తయారు చేస్తున్నాయని, వారికి టోకుగా ఆర్డర్ ఇస్తే తక్కువ ధరకు సకాలంలో అందజేయడంతో పాటు వారికి జీవోనోపాధి కల్పించి ఆర్థికంగా సహాయపడిన వారవుతామని అన్నారు. ఒక్క సారి ఉపయోగించే బ్యాగులతో పాటు ఉతికి నిరంతరాయంగా ఉపయోగించే బ్యాగులు తయారు చేస్తున్నారని, అట్టి బ్యాగులపై తమ దుకాణ లోగోలను కూడా వేస్తారని అన్నారు. దుకాణదారులు తమ వద్దకు వచ్చే ప్రజలకు ప్లాస్టిక్ పై అవగాహన కలిగించి తమ వెంట బ్యాగులు తెచ్చుకునేలా ప్రోత్సహించాలని లేదా జ్యుట్ ,కాటన్ బ్యాగులో సరుకులు అందించాలని అన్నారు. జిల్లాలో ప్లాస్టిక్ నిర్మూలన పట్ల అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని, ఉల్లంఘించిన వారిపై నోటీసులు, జరిమానాలు విధించాలని అన్నారు.
అదేవిధంగా పర్యావరణానికి విఘాతం కలిగించే పారిశ్రామిక వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలని జిల్లా పరిశ్రమల కేంద్రం జిల్లా మేనేజర్ కృష్ణ మూర్తికి సూచించారు. జిల్లాలో 117 ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్ లు ఉన్నాయని, వాటి ద్వారా వచ్చే బయో మెడికల్ వేస్ట్ ను బయట పడవేయకుండా దూరంగా తరలించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకటేశ్వర్ రావు కు సూచించారు. గ్రామాలలో, పట్టణాలలో భవన నిర్మాణ, కూల్చివేత వ్యర్థాలను దూరంగా తరలించాలన్నారు. జిల్లాలో ఉన్న 5 పొల్యూషన్ కంట్రోల్ వాహనాల ద్వారా కాలుష్యాన్ని వెదజల్లే వాహనాలను గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని ఆర్.టి.ఓ. కు సూచించారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్, డి.ఆర్.డి.ఓ. శ్రీనివాస్, డి.పి ఓ. తరుణ్ కుమార్, కాలుష్య నియంత్రణ మండలి ఈ.ఈ. రవి కుమార్, ఏ.డి. మైన్స్ జయ రాజ్, ఆర్.డి.ఓ. సాయి రామ్, జిల్లా యువజన సంక్షేమాధికారి నాగరాజ్, మునిసిపల్ కమీషనర్లు తదితరులు పాల్గొన్నారు

Share This Post