ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించాలి – అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్

ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించాలి – అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్

ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరు కంకణబద్దులు కావాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ మంగళవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ఒకసారి ఉపయోగించి పారవేసే తక్కువమందం గల సింగల్ యూస్ ప్లాస్టిక్ ను నిరోధించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని ప్రజలు భాగస్వాములై ప్రభుత్వానికి సహకరించనాడే లక్ష్యాన్ని సాధిస్తామని అన్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం 2016లో ప్లాస్టిక్ వేస్ట్ మేనేజిమెంట్ నిబందనలకు కొన్ని మార్పులు తీసుకువచ్చి దశలవారిగా ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిరోదించాలని సూచించిందని అన్నారు. ఇందుకోసం జిల్లాలో టాస్క్ ఫోర్సు కమిటీలను ఏర్పాటు చేసుకొని పకడ్బందీ కార్యాచరణ ప్రణాళికతో ముందుకెళ్ళి ప్రజలలో ప్లాస్టిక్ వాడకం వలన పర్యావరణానికి కలిగే విఘాతం గురించి అవగాహన కలిగించాలని కేంద్ర పర్యావరణ శాఖ సూచించిందని ఆమె తెలిపారు. మిషన్ మోడ్ లో ఒక నిర్ణీత కాలవ్యవధిలో సింగల్ యూస్ ప్లాస్టిక్ వాడకాన్ని నిరోదించేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు. పట్టణాలలో మున్సిపాలిటీలు, గ్రామాలలో పంచాయతి రాజ్, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థలు నోడల్ శాఖలుగా వ్యవహరిస్తూ సింగల్ యూస్ ప్లాస్టిక్ నిరోధానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇందుకోసం తరచూ సంబంధిత శాఖలతో సమన్వయ చేసుకుంటూ సమావేశాలు ఏర్పాటు చేసుకొని ప్లాస్టిక్ నిరోధానికి చర్యలు తీసుకోవాలన్నారు. 2016 చట్టంలో పేర్కొన్నట్లు ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ, నియమాలు ఖచ్చితంగా అమలు చేయాలన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తిని అంచనా వేసుకొని అందుకనుగుణంగా వాటిని సేకరించి రీ -సైక్లింగ్ చేయడం వంటి పనులు చేపట్టాలన్నారు. చట్టాన్ని మరింత పటిష్టంగా అమలు పరచుటకు సంస్థాగత మెకానిజం ఏర్పాటు చేసుకోవాలని, ఇందుకోసం స్వచ్చ భారత్ మిషన్ నుండి నిధులు వినియోగించవచ్చని ఆమె సూచించారు.
గత సెప్టెంబర్ నాటికి రీ-సైకిల్డ్ చేయబడిన 75 మైక్రాన్ల కన్నా తక్కువమందం గల ప్లాస్టిక్ ను ప్రభుత్వం నిషేదించిందని, 2022 డిసెంబెర్ 31 నాటకీ 120 మైక్రాన్ల మందం లోపు గల ప్లాస్టిక్ ను నిషేదిస్తున్నదని ఆమె తెలిపారు. అదేవిధంగా 60 గ్రామ్ పర్ స్క్వేర్ మందం గల నాన్ వోవెన్ ప్లాస్టిక్ సంచుల వాడకాన్ని గత సెప్టెంబర్ ౩౦ నాటికి నిషేదించిందని ఆమె తెలిపారు.
ప్లాస్టిక్ ఉపయోగిస్తూ ఉత్పత్తి చేసే కప్పులు, గ్లాసులు, పార్కులు, చెంచాలు, చాకులు, ట్రేలు, ఇయర్ బడ్స్ , బెలూన్స్, జండాలు, ధర్మకోల్ డెకరేషన్ వంటి సింగల్ యూస్ ప్లాస్టిక్ ఉత్పత్తి, ఎగుమతి, స్టాక్ నిలువ, పంపిణి, విక్రయాలపై 2022 జూలై 1 నాటికి ప్రభుత్వంపూర్తిగా నిషేధం విధించిందని, ఎవరైనా ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.
గ్రామ పంచాయతీలలో, మునిసిపాలిటీలలో ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరణ, నిలువ,రవాణా, నిర్వహణ, తొలగించడం లో సమర్థవంతమైన పర్యవేక్షణ ఉండాలని అధికారులకు సూచించారు. ప్లాస్టిక్ వాడకం నివారణ పట్ల ప్రజలలో ఉవ్వెత్తున ఉద్యమం వచ్చేలా సంపూర్ణ అవగాహన, చైతన్యం తీసుకురావడానికి సమగ్ర కార్యాచారనతో ముందుకు సాగాలని ఇందుకోసం పాటశాల, కళాశాల, ఎన్.సి.సి., ఎన్.ఎస్.ఎస్., స్కౌట్స్, యువజన సంఘాలు, ఎకో క్లబ్లు, స్వచ్చంద సంస్థలు, అభిప్రాయాలను వ్యక్తపరిచే వివిధ వర్గాల వారిని భాగస్వాములను చేయాలని అన్నారు.
ప్రస్తుతం గ్రామాలలో, మునిసిపల్ ప్రాంతాలలోని దుకాణాలలో 75 మైక్రాన్ల మందం కన్నా తక్కువ గల ప్లాస్టిక్ బ్యాగులను వెంటనే గుర్తించి తొలగించాలని డి.పి.ఓ, మునిసిపాల్ కమీషనర్లకు సూచించారు. ప్లాస్టిక్ బ్యాగుల స్థానంలో ప్రత్యామ్నాయంగా జ్యుట్ , కాటన్, నాన్ ఓవెన్ ఫ్యాబ్రిక్ బ్యాగులు వాడాలని వాటి పట్ల ప్రజలలో అవగాహన కలిగించాలని అన్నారు. జిల్లాలో స్వయం సహాయక మహిళా సంఘాలు ఇటువంటి బ్యాగులు తయారు చేస్తున్నాయని, వారికి టోకుగా ఆర్డర్ ఇస్తే తక్కువ ధరకు సకాలంలో అందజేయడంతో పాటు వారికి జీవోనోపాధి కల్పించి ఆర్థికంగా సహాయపడిన వారవుతామని అన్నారు. ఒక్క సారి ఉపయోగించే బ్యాగులతో పాటు ఉతికి నిరంతరాయంగా ఉపయోగించే బ్యాగులు తయారు చేస్తున్నారని, అట్టి బ్యాగులపై తమ దుకాణ లోగోలను కూడా వేస్తారని అన్నారు. దుకాణదారులు తమ వద్దకు వచ్చే ప్రజలకు ప్లాస్టిక్ పై అవగాహన కలిగించి తమ వెంట బ్యాగులు తెచ్చుకునేలా ప్రోత్సహించాలని లేదా జ్యుట్ ,కాటన్ బ్యాగులో సరుకులు అందించాలని అన్నారు. జిల్లాలో ప్లాస్టిక్ నిర్మూలన పట్ల అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని, ఉల్లంఘించిన వారిపై నోటీసులు, జరిమానాలు విధించాలని ఆమె తెలిపారు.

Share This Post