ఫిట్ ఇండియా ఫ్రీడం రన్ ప్రారంభించిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి

ఫిట్ ఇండియా ఫ్రీడం రన్ ప్రారంభించిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి

మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అనే అంశాలతో పాటు ప్రతి ఒక్కరూ దేశభక్తి కూడా పెంపొందించుకోవాలని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు . శనివారం ఆజాది కా అమ్రిత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా నెహ్రు యువక కేంద్రం, జిల్లా యువజన క్రీడల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో మెదక్ పట్టణంలోని జూనియర్ కళాశాల నుండి రాందాస్ చౌరస్తా వరకు ఏర్పాటు చేసిన ఫిట్ ఇండియా రన్ 2.0 కార్యక్రమాన్ని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీలో యెన్.సి.సి., యెన్.ఎస్.ఎస్. వివిధ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని భారతమాతాకు జై అంటూ నినదిస్తూ 75 మీటర్ల జాతీయ పతాకం చేతబూని, 75 మంది స్వాతంత్య్ర సమరయోధుల చిత్రపటాలను ప్లా కార్డులను ప్రదర్శిస్తూ సాగిన రన్ పట్టణ ప్రజలను విశేషంగా ఆకర్షించింది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడుతూ పరాయి పాలన నుండి స్వేచ్ఛా వాయువులు పీల్చుకొని 75 వసంతాలు అవుచున్న సందర్భంగా ఆనాటి మహానుభావుల త్యాగాలను మననం చేసుకుంటూ ముందు తరాలకు దేశ సంస్కృతి, ఔన్నత్యం తెలుపుటకు కేంద్ర ప్రభుత్వం ఆజాది కా అమ్రిత్ మాహోత్సవములో భాగంగా వివిధ కారక్రమాలు చేపట్టిందని అన్నారు.
మన భారతదేశం అన్ని మతాల సామరస్యం, అన్ని రాష్ట్రాల కలయిక అని ప్రపంచానికి మార్గదర్శకమని అన్నారు. దేశం మనకేమిచ్చింది అనేదానికంటే మనం దేశానికి ఏమి ఇవ్వబోతున్నామనేది ఇది ప్రతి ఒక్కరు ఆలోచించాలన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ దేశభక్తిని పెంపొందించుకొని దేశ, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటు అందిస్తూ ముందుకు వెళ్లాలన్నారు. ఆహంసా మార్గంలో దండి, ఉప్పు సత్యాగ్రహం చేసి దేశానికి స్వాతంత్రం తెచ్చుకున్న మాదిరి గానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నమని ఎమ్మెల్యే అన్నారు. ప్రపంచంలోని చాలా దేశాల్లో రోగనిరోధక శక్తి లేకపోవడం వలన చాలామంది తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు కానీ మన మట్టిలో, మన సాంప్రదాయం లో, ఔన్నత్యం లో శక్తి ఉంది కాబట్టే దేశం నుండి కరోనాను తరిమికొట్టామన్నారు. భారతదేశ ఆచార సంప్రదాయాలను అనుకరిస్తూ వాటిని కాపాడుతూ ప్రతి ఒక్కరు ముందుకు వెళ్లాలని సూచించారు.
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ మాట్లాడుతూ మన శరీరం, మనస్సు స్వాధీనంలో ఉండాలన్నా, ఆరోగ్యంగా ఫిట్ గా ఉండాలన్నా తప్పనిసరిగా ప్రతి రోజు అరగంట వ్యాయామానికి కేటాయిస్తూ నడవడం, రన్నింగ్, యోగ, మెడిటేషన్ వంటివి చేయాలని అన్నారు. అక్టోబర్ 2 వరకు కొనసాగే ఫ్రీడమ్ రన్ లో భాగంగా జిల్లాలోని 75 గ్రామాలలో కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు. ఈ ఉత్సవాలలో భాగంగా జిల్లాలో మరుగున పడిన చరిత్ర కెక్కని స్వాతంత్య్ర సమరయోధులు, సంఘటన వివరాలు ఏమైనా మీ దృష్టికి వస్తే జిల్లా యంత్రాన్గానికి తెలుపవలసినదిగా ఆమె కోరారు.
అంతకు ముందు కళాకారుల బృందం ప్రదర్శించిన దేశభక్తి గీతాలు ప్రజలను ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో సహాయ ట్రైనీ కలెక్టర్ అశ్విని తానాజీ వాఖడే, మునిసిపల్ చైర్మన్ చంద్రపాల్, నెహ్రు యువక కేంద్ర జిల్లా యువజన అధికారి బెన్సీ , జిల్లా యువజన క్రీడల అధికారి నాగరాజ్, జిల్లా విద్యా శాఖాధికారి రమేష్, డి.పి.ఓ.తరుణ్ కుమార్, జిల్లా వ్యవసాయాధికారి పరశురామ్ నాయక్, బి.సి. అభివృద్ధి అధికారి జగదీశ్, పంచాయత్ రాజ్ డీ.ఈ.ఈ. మునిసిపల్ కమీషనర్ శ్రీహరి, డిగ్రీ కళాశాల ప్రధానాచార్యులు చంద్రశేఖర్, వ్యాయామ ఉపాధ్యాయులు, వార్డు కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు , నెహ్రు యువజన సంఘాల కో ఆర్డినేటర్లు, యెన్.ఎస్.ఎస్., యెన్.సి.స వివిధ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post