బన్సీలాల్ పేట లోని వక్ఫ్ బోర్డ్ స్థలంలోని నిరుపేద ముస్లీం ల కోసం త్వరలోనే డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ పనులు చేపడతామని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ ల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

గురువారం బన్సీలాల్ పేట లోని GYR కాంపౌండ్ లో గల వక్ఫ్ బోర్డ్ స్థలాన్ని మంత్రి శ్రీనివాస్ యాదవ్ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ సలీం, ఇతర అధికారుల తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ వక్ఫ్ బోర్డ్ కు చెందిన స్థలంలో సుమారు 12 కుటుంబాలు ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడే నివసిస్తున్నారని వివరించారు. సరైన సౌకర్యాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్న వారికి అన్ని వసతులతో కూడిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. వక్ఫ్ బోర్డ్ నుండి అవసరమైన అనుమతులు వచ్చిన వెంటనే పనులు చేపడతామని మంత్రి తెలపగా, ఈ నెల 30 వ తేదీన జరిగే వక్ఫ్ బోర్డ్ సమావేశంలో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని వక్ఫ్ బోర్డ్ చైర్మన్ సలీం మంత్రికి వివరించారు. అదేవిధంగా బన్సీలాల్ పేట లోని పొట్టి శ్రీరాములు నగర్, GYR కాంపౌండ్ లలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను సందర్శించి స్థానిక ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. Gyr కాంపౌండ్ లో ఆలయ నిర్మాణానికి విద్యుత్ తీగలు అడ్డుగా ఉన్నాయని స్థానికులు మంత్రి దృష్టికి తీసుకు రాగా, వాటి తొలగింపుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ DE శ్రీధర్ ను మంత్రి ఆదేశించారు. అనంతరం బండ మైసమ్మ నగర్ లో చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలించి పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. దీపావళి నాటికి పనులు పూర్తవుతాయని అధికారులు మంత్రికి వివరించారు. తమకు మంచినీరు సక్రమంగా సరఫరా కావడం లేదని, వర్షం వచ్చినప్పుడు నీరు ఎక్కడికక్కడే నిలిచి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానిక మహిళలు మంత్రికి విన్నవించారు. స్పందించిన మంత్రి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నూతన సీవారేజ్, మంచినీటి పైప్ లైన్ ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని వాటర్ వర్క్ GM రమణా రెడ్డి ని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, కార్పొరేటర్ హేమలత, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, RDO వసంత కుమారి, హోసింగ్ EE వెంకట దాసు రెడ్డి, టౌన్ ప్లానింగ్ ACP మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post