బలహీన వర్గాల బతుకులను మార్చడానికి తన జీవితాన్ని త్యాగం చేసిన వీర వనిత చాకలి ఐలమ్మ ప్రతి ఒక్కరికి స్పూర్తి దాయకమని జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి అన్నారు.

బలహీన వర్గాల బతుకులను మార్చడానికి తన జీవితాన్ని త్యాగం చేసిన వీర వనిత చాకలి ఐలమ్మ ప్రతి ఒక్కరికి స్పూర్తి దాయకమని జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి అన్నారు.
వీరనారి చాకలి ఐలమ్మ 126వ జయంతి సందర్భంగా ఆదివారం సంగారెడ్డి కలెక్టరేట్ పక్కన ఏర్పాటుచేసిన వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహానికి జెడ్పి చైర్ పర్సన్ మంజుశ్రీ, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, మున్సిపల్ చైర్ పర్సన్, ఇతర ప్రజాప్రతినిధులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐలమ్మ జయంతోత్సవం కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు.

చాకలి ఐలమ్మ సాదాసీదా వ్యక్తి అయినా ఆర్థిక, అంగబలం లేకున్నా ధైర్యంగా నిజాం ప్రభుత్వానికి ఎదురొడ్డి పోరాడిన దీర వనిత అని అన్నారు. పోరాటం చేస్తూనే అణగారిన వర్గాల కోసం అండగా నిలిచిందన్నారు.

నేటి యువత, మహిళలు చాకలి ఐలమ్మ స్ఫూర్తితో దౌర్జన్యాలను, అక్రమాలను అడ్డుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ ఆమె చరిత్రను తెలుసుకునే విధంగా పాఠ్య పుస్తకాలలోఒక పాఠ్యాంశంగా చేరిస్తే బాగుంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. భయం పోయి ధైర్యంగా ఎదుర్కొన్న ప్పుడే సమాజానికి మంచి చేయగలమని పేర్కొన్నారు.

జిల్లా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ చాకలి ఐలమ్మ జయంతి ని మొట్ట మొదటిసారిగా అధికారికంగా జరుపుకుంటున్నామన్నారు. వారి ఆశయాలను అనుసరించడం, రాబోవు తరాలకు తెలియజేసే విధంగా జయంతి జరుపు కుంటూన్నామని ఆయన అన్నారు.

వీరనారి చాకలి ఐలమ్మ నిజాం కాలంలో గెరిల్లా పద్ధతిలో సాయుధ పోరాటం చేసిందన్నారు. తాను నమ్ముకున్న భూమిపై తనకే హక్కు ఉందని తెలియజెప్పిన ధీరవనిత అని కొనియాడారు.

అధునాతన పోకడలకు అనుగుణంగా టెక్నాలజీని అందిపుచ్చుకొని కులవృత్తులు అభివృద్ధి చేసుకోవాలనీ సూచించారు. ప్రభుత్వం కుల వృత్తుల కనుగుణంగా వారి అభిరుచికి తగ్గట్టుగా అభివృద్ధి దిశగా ముందుకు వెళుతుందన్నారు.
రజక సంఘం భవన నిర్మాణానికి స్థలం కేటాయించి నిధులు ఇవ్వాలని కుల సంఘం ప్రతినిధులు కోరగా, జిల్లా మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లి సహకరిస్తామన్నారు.

తెలంగాణ సమాజం కోసం స్వాతంత్రం కోసం పోరాడిన వారి గురించి తెలిసే విధంగా
వీరనారి ఐలమ్మ జీవిత చరిత్రను అదేవిధంగా ప్రముఖుల చరిత్రను ఆసక్తికరంగా ఉండే విధంగా ముఖ్య ఘట్టాలను తీసుకొని బుక్ లెట్ / పాంప్లెంట్ రూపంలో రానున్న ఆరునెలల్లో ముద్రించి యువతకు విద్యార్థులకు అందుబాటులోకి తేవాలని వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి కి సూచించారు. ముద్రణకు సీఎస్ఆర్ నిధుల నుండి డబ్బులు ఇవ్వడానికి కలెక్టర్ సంసిద్ధతను తెలిపారు.

జిల్లా ఎస్పీ రమణకుమార్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణకు చెందిన అనేక మంది పోరాట యోధులను గుర్తించి జయంతులను నిర్వహిస్తోందన్నారు.
చాకలి ఐలమ్మ ఒక వర్గానికి, కులానికి చెందినది కాదని, ఆమెకు జరుగుతున్న అన్యాయం తో పాటు సమాజానికి జరుగుతున్న అన్యాయాలను ఎదిరించిందన్నారు. ఆనాటి సామాజిక పరిస్థితుల్లో ధైర్యంగా పోరాటం సాగించిందని ఆయన పేర్కొన్నారు. ఆమె స్ఫూర్తితో అన్యాయాలను ఎదిరించాలన్నారు.

మాజీ శాసనసభ్యులు చింతా ప్రభాకర్ మాట్లాడుతూ బానిస బతుకులు విముక్తి చేయాలని సాయుధ పోరాటం చేసిన నారీమని ఐలమ్మ అన్నారు. చేతివృత్తులు, కులవృత్తులకు సమన్యాయం చేస్తు
తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. అన్ని కులాలకు సముచిత గౌరవం దక్కాలని, అన్ని వర్గాలకు చేయూతనివ్వాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి ముందుకు వెళ్తున్నారన్నారు.
రజక భవనం కోసం కలెక్టర్ ద్వారా మంత్రి, ప్రభుత్వము దృష్టికి తీసుకువెళతామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ బొంగుల విజయలక్ష్మి, జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, ఎంపీపీ లావణ్య, డిఎస్పి బాలాజీ, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి కేశురాం, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, వివిధ కుల సంఘాల ప్రతినిధులు మహేష్ జీతయ్య, మాణిక్యం ,గణేష్, రమేష్ కూన వేణుగోపాల్, నామ మహేష్,బీరా యాదవ్, గోలి యాదగిరి, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post