బాధితులకు అండగా సఖి కేంద్రం- అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్

బాధితులకు అండగా సఖి కేంద్రం- అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్

తప్పిపోయి షెల్టర్ కోసం సఖి కేంద్రానికి వచ్చిన ఆంధ్ర రాష్ట్రానికి చెందిన బాధితురాలు కేదారమ్మను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ సోమవారం మెదక్ పట్టణంలోని సఖి కేంద్రంలో ప్రత్యేక వాహనంలో చిత్తూరు జిల్లాకు పంపుటకు జండా ఊపి ప్రారంభించారు. గత అక్టోబర్ 7 న తప్పిపోయి రామాయంపేట పోలీసులు కేదారమ్మను సఖి కేంద్రానికి అప్పగించగా ఆమె వివరాలు సేకరించడం జరిగిందని అన్నారు. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూర్ జిల్లా కుప్పం మండలం ఉరిణయం పల్లె కు చెందిన కేదారమ్మకు తల్లిదండ్రులు వృద్ధ్యాపంలో ఉన్నందున ఇక్కడికి రాలేని పరిస్థితులలో పోలీస్ ఎస్కార్ట్, సఖి సిబ్బంది సహాయంతో ఆమె స్వగ్రామానికి పంపుతున్నామని ప్రతిమ సింగ్ తెలిపారు. అనంతరం సఖి సిబ్బందితో, విజన్ సంస్థ సపోర్ట్ ఏజెన్సీ డైరెక్టర్ కైలాష్ లతో కేంద్రం అందిస్తున్న సేవలు తెలుసుకొని అభినందిస్తూ తగు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ సఖి కేంద్రం ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు 481 కేసులు రాగా 382 కేసులు పరిష్కరించామని, ఇందులో ఎక్కువగా గృహ హింస కేసులున్నాయని అన్నారు. సఖి ద్వారా జిల్లాలో 162 అవగాహన సదస్సులు నిర్వహించామని అన్నారు. ప్రధానంగా ఈ కేంద్రం గృహహింస, వరకట్న వేధింపులు, పనిచేసే చోట లైంగిక వేధింపులు, ఆడపిల్లల విక్రయం, రవాణా అరికట్టడం, ఇతరత్రా దాడులపై స్పందిస్తూ వారిని ఎల్లవేళలా రక్షించడానికి 24 గంటల పనిచేస్తున్నదని అన్నారు. ఈ కేంద్రము ద్వారా బాధితులకు అవసరమయిన న్యాయ,పొలిసు,వైద్య సహాయం అందించడంతో పాటు కౌన్సిలింగ్ ఇస్తూ తాత్కాలిక వసతి సదుపాయాలు కల్పిస్తూ అండగా నిలుస్తున్నది అన్నారు. ఏ ఆపద వచ్చిన 08452-295181 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 181, 9346146580 ఫోన్ నెంబర్లకు సంప్రదించవచ్చని ఆడబిడ్డలకు సూచించారు.
ఈ కార్యక్రమంలో సపోర్ట్ ఏజెన్సీ డైరెక్టర్ కైలాష్, కేంద్రం నిర్వాహకురాలు శాంతమ్మ, లీగల్ కౌన్సిలర్ రాజీమున్నీసా బేగం, సోషల్ కౌన్సిలర్ భాగ్యలక్ష్మి, భార్గవి తదితరులు పాల్గొన్నారు.

Share This Post