బాపూజీ ఆత్మకథను చదవండి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

మహాత్మా గాంధీజీ ఆశయసాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలనీ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మహాత్మా గాంధీజీ జయంతి ని పురస్కరించుకొని అధికారికంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం రోజున జయంతి వేడుకను నిర్వహించారు. మొదట గాంధీజీ చిత్రపటానికి కలెక్టర్ పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, మహాత్మా గాంధీజీ జన్మదినం సందర్బంగా జిల్లా లోని ప్రజలందరికి శుభాకాంక్షలు తెలిపారు. గాంధీజీ కలలు గన్నస్వరాజ్యాన్ని సాధించుకున్నామని, ఆయన పోరాటఫలితమే మనం ఆస్వాదిస్తున్నామని, ఆయనను ఫాదర్ అఫ్ నేషన్ అని పిలుచుకుంటున్నామని, ఆయన జన్మదినాన్ని జాతీయ పండుగగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు. బాపూజీ జీవితంలో జరిగిన సంఘటనలపై ఎన్నో పుస్తకాలు రచింపబడ్డాయని, బాపూజీ ఆత్మకథ పుస్తకాన్ని ప్రతి ఒక్కరు చదవాలని కోరారు. అహింస మార్గాన్ని ఎన్నుకొని నిత్యజీవితంలో సత్యం పలకాలని అన్నారు. వ్యక్తిగత జీవితంలో, అధికారిక విధులలో గాంధీజీ సూత్రాలు పాటించాలని సూచించారు. గాంధీజీ నేతృత్వంలో స్వాతంత్య్రం సంపాదించుకొని 75 సంవత్సరాల వేడుకలను దేశ వ్యాప్తంగా నిర్వహించుకుంటున్నామని, పేద ప్రజలకోసం ఉద్యోగులు సహకారం అందించాలని కోరారు. అదనపు కలెక్టర్ ఎన్.నటరాజ్ మాట్లాడుతూ, పేదరికం, సామజిక రుగ్మతలను రూపుమాపడం జరిగిందని, ప్రపంచ దేశాల్లో బాపూజీకి సముచిత స్థానం ఉందని అన్నారు. సత్యం పలకాలని అహింస మార్గాన్ని ఎంచుకోవాలని, గాంధీజీ చెప్పేవారని అన్నారు. ఆయన స్వాతంత్య్ర పోరాట కృషి ఫలితమే మనం ఈనాడు స్వేచ్ఛఫలాలు అనుభవిస్తున్నామని అన్నారు. జిల్లా పౌర సరఫరాల అధికారి సుదర్శన్ మాట్లాడుతూ, గాంధీజీ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడవాలని, ఆయన ఆశయసాధనకు కృషి చేయాలనీ అన్నారు. కలెక్టరేట్ పరిపాలనాధికారి అరవింద్ కుమార్ మాట్లాడుతూ, సమాజానికి, ప్రపంచానికి బాపూజీ ఆదర్శమని, స్వయం సిద్ది, కష్టపడే తత్త్వం, ప్రతి ఒక్కరికి కలిగి ఉండాలని, సత్యమే పలకాలని గాంధీజీ చెప్పేవారని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా పౌర సంబంధాల అధికారి ఎన్.భీమ్ కుమార్, తహసీల్దార్ భోజన్న, కలెక్టరేట్ పర్యవేక్షకులు రాజేశ్వర్, వర్ణ, స్వాతి, కలెక్టరేట్ రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు శ్రీధర్, సహకార, రెవెన్యూ, ట్రెజరీ, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Share This Post