బాలల హక్కుల పరిరక్షణకు బాల అదాలత్ లు నిర్వహిస్తున్నాం………………. కమిషన్ చైర్మన్ జె.శ్రీనివాస రావు.

పత్రిక ప్రకటన

జులై 15, 2021ఆదిలాబాదు:-

రాజ్యాంగ పరంగా సంక్రమించిన బాలల హక్కుల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ జె.శ్రీనివాస రావు  అన్నారు. గురువారం రోజున ఉట్నూర్ కొమురం భీం కాంప్లెక్స్ లోని సమావేశ మందిరంలో బాల అదాలత్ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ, పిల్లల హక్కులను కాపాడటానికి, వారికీ భరోసా, నమ్మకం కల్పించే విధంగా బాల అదాలత్ ను నిర్వహిస్తున్నామని అన్నారు. వ్యవస్థలకు పరిపాలనకు మధ్య ఉన్న దూరాన్ని అధిగమించడానికి ఈ బాల అదాలత్ దోహద పడుతుందని అన్నారు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని, శాఖల సమన్వయంతో సమస్యను పరిష్కరించవచ్చని అన్నారు. కరోనా నేపథ్యంలో మార్చ్ లో నిర్వహించవలసిన బాల అదాలత్ ను ఇప్పుడు నిర్వహిస్తున్నామని అన్నారు. ముంగిట్లో న్యాయం అనే పద్దతిలో బాలల వద్దకే వెళ్లి వారికీ న్యాయం కల్పించేందుకు అన్ని జిల్లాల్లో బాల అదాలత్ ను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పిల్లలపై జరుగుచున్న అత్యాచారాలు, బాల్య వివాహాలు వంటి వాటిని నిర్ములించడానికి కమిషన్ సహకరిస్తుందని అన్నారు. చట్టంలో ఉన్నటువంటి లోటుపాట్లను గుర్తించి, ప్రజలకు బాలలకు అవసరమైన చట్ట పరమైన సేవలు అందించడానికి ప్రభుత్వానికి సమర్పించడం జరుగుతుందని అన్నారు. ఈ అదాలత్ కు రాని వారు ఈ నెల 31 వరకు సంబంధిత శాఖల అధికారులకు అర్జీలు సమర్పించవచ్చని, అట్టి అర్జీలను జిల్లా కలెక్టర్ ద్వారా కమిషన్ కు పంపడం జరిగి వాటిని పరిశీలించడం జరుగుతుందని తెలిపారు. ఈ బాల అదాలత్ కు సుమారు 120 అర్జీలు రావడం జరిగిందని, సదరం సర్టిఫికెట్ లు, పాఠశాలల్లో అడ్మిషన్ లు, వైద్య చికిత్సలు, దివ్యంగుల పెన్షన్లు, ఆర్థిక సహకారం, కుల ధ్రువీకరణ పత్రాలు, తదితర సమస్యలపై అర్జీలు అందాయని తెలిపారు. ముఖ్యంగా మారుమూల గిరిజన ప్రాంతాల్లోని బాలలకు స్వాంతన చేకూర్చడానికి బాల అదాలత్ దోహద పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ, బాల అదాలత్ కు అందిన ప్రతి అర్జీని పరిశీలించి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. జిల్లా అధికారులు కమిషన్ కు సహకారం అందించాలని అన్నారు. కమిషన్ సభ్యురాలు ఏ.శోభారాణి మాట్లాడుతూ, పిల్లల సమస్యలు పూర్తీ స్థాయిలో పరిష్కరించేందుకు కమిషన్ సహకరిస్తుందని అన్నారు. సభ్యురాలు బి.అపర్ణ మాట్లాడుతూ, మారుమూల ప్రాంతాల బాల బాలికలకు న్యాయం చేకూర్చేందుకు కమిషన్ రావడం జరిగిందని అన్నారు. సభ్యులు పి.అంజన్ రావు మాట్లాడుతూ, చట్టాలు, సంక్షేమం ఉన్నప్పటికీ అవగాహన, సమన్వయ లోపం ఉందని అన్నారు. కమిషన్ బాధ్యతగా వ్యవహరించి రాష్ట్రంలోని బాలల హక్కులకు భంగం కలుగకుండా చూడడం జరుగుతుందని అన్నారు. సభ్యులు ఏ.దేవయ్య మాట్లాడుతూ, సంక్షేమ పథకాలు మారుమూల ప్రాంతాల ప్రజలకు అందడం లేదని, పౌష్ఠిక ఆహార లోపం ఉందని, విద్య, వైద్య రంగాలను మెరుగుపరచవలసిన అవసరం ఉందని ఇట్టి విషయాలను రాష్ట్ర స్థాయి అధికారులకు తెలియజేయడం జరుగుతుందని అన్నారు. జిల్లాకు నెలకు ఒకసారి పర్యటించి సమీక్షించడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. అనంతరం వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్బంగా ఇంద్రవెల్లి మండలం డోంగర్ గావ్ గ్రామానికి చెందిన కినక మహేశ్వరి గత సంవత్సర కాలం నుండి కాళ్ళు పడిపోయి నడవలేని స్థితిలో ఉన్నందున సహాయం కోసం కమిషన్ ముందుకు ఆటో లో రావడంతో నడవలేని స్థితిలో ఉన్న ఆమెవద్దకు కమిషన్ సభ్యులు వచ్చి సమస్యలు తెలుసుకొని వెంటనే వీల్ చైర్ అందించారు. ప్రభుత్వ పరంగా సహకారం అందించేందుకు సహకరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ITDA PO భవేష్ మిశ్రా, ఉట్నూర్ DSP ఎన్.ఉదయ్ రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, CWC, సఖి, చైల్డ్ లైన్ సంస్థలు, ఉమ్మడి జిల్లాల అధికారులు, ITDA  అధికారులు, తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముందు కమిషన్ సభ్యులు, జిల్లా కలెక్టర్ లను గిరిజన సాంప్రదాయ గుస్సాడీ నృత్యం ద్వారా స్వాగతం పలికారు. వైద్య శాఖ, సఖి కేంద్రం, చైల్డ్ లైన్ ఏర్పాటు చేసిన స్టాల్ లను పరిశీలించారు. తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు బాలలపై తెలుగు, గోండి బాషలలో పడిన పాటలకు అధికారులు హర్షద్వానాలు తెలిపారు.

…………………………………………………………….  జిల్లా పౌర సంబంధాల అధికారి, ఆదిలాబాదు గారిచే జారీ చేయనైనది.

Share This Post