శుక్రవారం నాడు హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ బీబీ నగర్ లోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కు ముఖ్య అతిథిగా హాజరై అకాడమిక్ సెక్షన్కు ప్రారంభోత్సవం చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, 2003 సంవత్సరంలో ఆనాటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు దూరదృష్టితో స్వస్థ సురక్ష యోజన కింద ఎయిమ్స్ వైద్య కళాశాలను ప్రకటించడం జరిగిందని తెలిపారు. అనంతరం గ్రామీణ ప్రాంతాల వారికి మంచి వైద్య సేవలు అందించేందుకు ప్రధానమంత్రి మోడీ గారు 200 ఎకరాలలో ఎయిమ్స్ వైద్యకళాశాల ను ఆధునిక వైద్య సదుపాయాలతో అభివృద్ధి చేయడం జరుగుతున్నదని, భవిష్యత్తులో ఎయిన్స్ ఒక ఆణిముత్యం లాగా నిలుస్తుందని అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో వైద్యం చాలా అవసరమని, గిరిజనులు, బడుగు బలహీన వర్గాల వారు డబ్బు చెల్లించలేక కోవిద్ సమయంలో చాలా ఇబ్బందులు పడ్డారని, ప్రధానమంత్రి ప్రతి ఒక్కరికీ వైద్యం అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ఎయిమ్స్ కళాశాలలు అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. గత ఏడు సంవత్సరాల ముందు ఉన్న 8 ఎయిమ్స్ కళాశాలలను 25 కళాశాలలకు పెంచారని అన్నారు. కోవిద్ సమయంలో ఎయిన్స్ డైరెక్టర్ వికాస్ భాటియా, వారి వైద్య సిబ్బంది అద్భుతమైన సేవలు అందించారని, వైద్య సేవలతో పాటు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా నిర్వహించారని అభినందించారు. ఆసుపత్రిలో ఫింగర్ ప్రింటింగ్ డయాగ్నొస్టిక్ ఎంఓయు చేయడం అభినందనీయమని అన్నారు. ప్రధానమంత్రి వైద్య రంగం ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని బడ్జెట్లో రెండు లక్షల 4 వేల కోట్లు కేటాయించడం జరిగిందని, ప్రతి జిల్లాకు ప్రభుత్వ వైద్య ఆసుపత్రి, వైద్య కళాశాల ఏర్పాటే ప్రధానమంత్రి లక్ష్యమని అన్నారు. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భవ క్రింద 50 కోట్ల ప్రజలకు వైద్య సేవలు అందించడం జరుగుతుందని, ఇప్పటివరకు రెండు కోట్ల 75 వేల మందికి లబ్ధి చేకూరుతుందని అన్నారు. ఆరోగ్యశ్రీ పథకంతో పాటు ఆయుష్మాన్ భవ పథకానికి తెలంగాణ ప్రభుత్వం సుముఖంగా ఉండడం పట్ల రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన అభినందించారు. కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఐడి కార్డు అందుబాటులోకి తెచ్చి దేశంలో ప్రైవేటే కాకుండా అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలలో కూడా హెల్త్ డిజిటల్ ఐడి కార్డుల ద్వారా వైద్య సేవలు అందించడానికి కృషి చేయడం జరుగుతుందని అన్నారు. రాబోయే రోజులలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల ప్రోత్సాహంతో ముందుకు వెళ్లడం జరుగుతుందని అన్నారు. వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్యం కార్మికులు, తదితర ఫ్రంట్ లైన్ వర్కర్స్ చేసిన కృషిని దేశం మొత్తం అభినందించిందని అన్నారు. కోవిద్ పట్ల మనం కూడా అప్రమత్తత పాటించాలని, మాస్కు, భౌతిక దూరం, పరిశుభ్రంగా ఉండటం చేయాలని అన్నారు. కోవిద్ పై విజయం సాధించడానికి మన శాస్త్రవేత్తలు ముందుకు వచ్చి వ్యాక్సిన్ కనుగొన్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. మనదేశంలో కోవిద్ వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా జరుగుతున్నదని, ఇప్పటికే దేశంలో ఎనభై తొమ్మిది కోట్ల మందికి మొదటి డోసు ఇవ్వడం జరిగిందని, దీనిలో 64% గ్రామీణ ప్రాంతాల వారికి ఇచ్చారని, ఇది అద్భుత విజయం అని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా రెండు కోట్ల మందికి పైగా వాక్సిన్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. బీబీనగర్ ఎయిమ్స్ రాబోయే కాలంలో అన్ని ఆధునిక హంగులతో వైద్యరంగంలో కేంద్రబిందువుగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మహిళలు , చిన్న పిల్లల ఆరోగ్యం పట్ల వైద్యులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వైద్య సహాయం పెంచుకోవాలని కోరారు. ఎయిమ్స్ అభివృద్ధిలో మాజీ పార్లమెంట్ సభ్యులు బూర నర్సయ్య గౌడ్ గారు చేసిన కృషిని ఆయన ఈ సందర్భంగా అభినందించారు. అభివృద్ధిలో రాజకీయాలు ఉండొద్దని, అభివృద్ధి పేదలకు రైతులకు, బడుగు బలహీనులకు సంబంధించినదని అన్నారు. వైద్య సౌకర్యాల పట్ల రాజకీయాలకు అతీతంగా సేవలందించాలని అన్నారు. పేద ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా అందరం పనిచేయాలని, భూసేకరణ, ప్రాజెక్టులు, ఇళ్ల నిర్మాణం, ఇతర అత్యవసర వసతి సౌకర్యాల పట్ల అంకిత భావంతో పనిచేయాలని అన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, ఎయిమ్స్ లో మూడవ వైద్య విద్యార్థుల బ్యాచ్ వస్తున్నందున కొత్త క్యాంపస్ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. నిమ్స్ ను ఎయిమ్స్ గా మార్చుకుని అన్ని వసతులు కల్పించుకుంటున్నామని, రాబోయే రోజులలో అదనపు బడ్జెట్ తో అదనపు హంగులు కల్పించడం జరుగుతుందని, ఉస్మానియా, నిమ్స్ ఆసుపత్రులపై పనిభారం తగ్గించేలా దీనిని అభివృద్ధి చేస్తామని అన్నారు. అలాగే భువనగిరి ఖిల్లాను టూరిజం ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని కేంద్ర టూరిజం శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు హామీ ఇచ్చారని తెలిపారు.
బీబీనగర్ నిమ్స్ డైరెక్టర్ వికాస్ భాటియా ఎయిమ్స్ ద్వారా అందించే వైద్య సేవలను, కోవిద్ సమయంలో నిర్వహించిన సేవలను, వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వివరించారు. వైద్య కళాశాలను ఏ విధంగా అభివృద్ధి చేసేది వివరిస్తూ ప్రజెంటేషన్ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, డీన్ డాక్టర్ రాహుల్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నీరజ్ అగర్వాల్, రాచకొండ ఏసిపి వెంకట్ రెడ్డి, ఎయిమ్స్ ప్రొఫెసర్లు, డాక్టర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
