బృహత్ పల్లె ప్రకృతి వనాలకు భూములను గుర్తించండి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

ఆగష్టు 16, 2021ఆదిలాబాదు:-

అవకాశమున్న ఖాళీ స్థలాల్లో ఎవెన్యూ ప్లాంటేషన్ చేపట్టాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంపీడీఓ లు, తహశీల్దార్లతో హరితహారం, బృహత్ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు భూముల గుర్తింపు అంశాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఖాళీ స్థలాలు, రోడ్లకు ఇరువైపులా ఎవెన్యూ ప్లాంటేషన్, మల్టి లేయర్ పద్దతిలో మొక్కలు నాటాలని అన్నారు. నాటిన మొక్కలకు సంబంధించిన వివరాలను ఈ-పంచాయితీలో అప్ లోడ్ చేయాలనీ అన్నారు. హోమ్ స్టెడ్ మొక్కలను ఇంటింటికి పంపిణి చేయాలనీ, అట్టి వివరాలను కూడా అప్ లోడ్ చేయాలనీ అన్నారు. ప్రతి మండలం లో పది ఎకరాలకు తక్కువ కాకుండా బృహత్ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు ప్రభుత్వ, అసైన్డ్, ఇతర భూములను గుర్తించి వివరాలను సమర్పించాలని తహసీల్దార్లను ఆదేశించారు. ఆయా మండల పరిధిలోని గ్రామాలలో జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి భూములను సేకరించాలని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు ఎన్.నటరాజ్, ఎం.డేవిడ్, ఆర్డీఓ జాడి రాజేశ్వర్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, ఎంపీడీఓ లు, తహసీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.

…………………………………………………………….  జిల్లా పౌర సంబంధాల అధికారి, ఆదిలాబాదు గారిచే జారీ చేయనైనది.

Share This Post