బ్యాంకర్ల సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా ఎన్నికల అధికారి , కలెక్టర్ ఆర్ .వి కర్ణన్

 

లక్షకు పైగా బ్యాంకు ఖాతాల లావాదేవీల వివరాలు సమర్పించాలి

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్.వి. కర్ణన్

-000-
హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గం పరిధిలోని వివిధ బ్యాంకులలో లక్షకు పైగా లావాదేవీలు జరిగిన బ్యాంకు ఖాతా వివరాలను సమర్పించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అన్ని బ్యాంకుల అధికారులతో హుజురాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా బ్యాంకు లావాదేవీల పై ఎన్నికల వ్యయ పరిశీలకులు ఎస్.హెచ్. ఎలమురుగు జి తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ హుజురాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా ఓటర్లను ప్రభావితం చేయుటకు బ్యాంకుల నుండి అధిక మొత్తంలో డబ్బులు డ్రా చేసే అవకాశం ఉందని అన్నారు. డబ్బుల పంపిణీ నిరోధించుటకు హుజురాబాద్ నియోజకవర్గంలోని అన్ని బ్యాంకు బ్రాంచులలో కొన్ని నెలలుగా ఎలాంటి లావాదేవీలు నిర్వహించక ఒకే సారి ఎన్నికల సమయంలో లక్షకు పైగా డబ్బులు జమ చేసిన డ్రా చేసిన అనుమానిత ఖాతాల వివరాలను ప్రతి రోజు పంపించాలని కలెక్టర్ ఆదేశించారు. అట్టి ఖాతాల లావాదేవీలను పరిశీలించి డబ్బుల వినియోగం గురించి ఎన్నికల అధికారులు తగిన చర్యలు తీసుకుంటారని తెలిపారు. అలాగే ఓటర్లను ప్రలోబాలకు గురి చేయుటకు గాను ఒకే అక్కౌంట్ తో వివిధ అక్కౌంట్లకు యు.పి.ఐ. ద్వారా గూగుల్ పే, ఫోన్ పే ఇతర యాప్ ల ద్వారా డబ్బులు జమ చేసినచో వాటి వివరాలను కూడా పంపించాలని బ్యాంకర్లను ఆదేశించారు.

ఈ సమావేశంలో ఎన్నికల ఎక్స్ పెండిచర్ అబ్జర్వర్ ఎస్.హెచ్. ఎలమురుగు జి, ఎస్.బి.ఐ., తెలంగాణ గ్రామీణ బ్యాంకు, యూనియన్ బ్యాంకు, ఇండియన్ బ్యాంకు, ఇతర బ్యాంకు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post