ఆదివారం జరుగనున్న గణేష్ నిమజ్జన కార్యక్రమంపై శనివారం రెవిన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, విద్యుత్ అధికారులతో టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గణష్ నిమజ్జన ప్రాంతం వరకు ఎట్టి పరిస్థితుల్లోను భక్తులను అనుమతించొద్దని చెప్పారు. భక్తులు నిమజ్జన కార్యక్రమం వరకు రావడం వల్ల నియంత్రణ సాధ్యం కాదని, రద్దీ పెరిగి అవాంచనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉందని చెప్పారు. నిమజ్జన కార్యక్రమాలు నిర్వహణకు ప్రత్యేక సిబ్బందిని నియమించామని చెప్పారు. నిమజ్జన కార్యక్రమాలకు మధ్యం సేవించి వచ్చే వ్యక్తులపై పోలీసు కేసులు నమోదు చేయాలని చెప్పారు. గణేష్ విగ్రహాలు ఊరేగింపులో బాణసంచాలు, డిజె సౌండ్ సిస్టం నిషేదమని, అతిక్రమించి ఎవరైనా బాణసంచాలు కాల్చినా, డిజే సౌండ్ వినియోగించినా పోలీసు కేసులు నమోదు చేయాలని చెప్పారు. నిమజ్జన ప్రాంతాల్లో నాటుపడవలు, గజ ఈతగాళ్లు సిద్ధంగా ఉంచాలని చెప్పారు. అగ్నిమాపక వాహనాలు నిమజ్జన ప్రాంతాల్లో సిద్ధంగా ఉంచాలని చెప్పారు. ఎటువంటి విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని, అత్యవసర పరిస్థితి లో వినియోగానికి జనరేటర్లు అందుబాటులో ఉంచాలని విద్యుత్ అధికారులకు సూచించారు. కార్యదర్శులు, తహసిల్దారులు నిరంతర పర్యవేక్షణ చేయాలని చెప్పారు. మన జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుండి నిమజ్జనం కొరకు విగ్రహాలు భద్రాచలం వచ్చే అవకాశం ఉన్నదని నిమజ్జన కార్యక్రమం పూర్తయ్యే వరకు సిబ్బంది అత్యంత అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. గోదావరి వంతెనపై విద్యుత్ ఏర్పాట్లు చేయాలని చెప్పారు. గోదావరి వంతెన పై నుండి విగ్రహాలను గోదావరిలో వేయకుండా పటిష్ట పోలీస్ పర్యవేక్షణ చేయాలని చెప్పారు. భక్తులు వంతెన, కరకట్ట వద్ద నిమజ్జన కార్యక్రమాలు వీక్షణ లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఉత్సవ కమిటి సభ్యులతో సమావేశం నిర్వహించి గణేష్ నిమజ్జనం కార్యక్రమం సజావుగా సక్రమంగా జరిగేందుకు చేయాల్సిన, చేయకూడని పనులపై తెలియచేయాలని చెప్పారు. గోదావరి వద్ద యన్ డిఆర్ఎఫ్ సిబ్బందిని అందుబాటులో ఉంచాలని చెప్పారు. గోదావరి పరివాహక ప్రాంతం, కిన్నెరసాని, ముర్రేడులతో పాటు స్థానికంగా ఉండే నీటి వనరుల్లో నిమజ్జనం చేసే అవకాశం ఉందని, యంపిఓ, యంపిడిఓలు, తహసిల్దార్లు నిమజ్జన ప్రాంతాలను పర్యవేక్షణ చేయాలని చెప్పారు. నాటు పడవలు అందుబాటులో ఉంచాలని చెప్పారు. విగ్రహాలు తరలింపులో విద్యుత్ తీగలకు తాకే ప్రమాదం ఉందని, భక్తులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. నిమజ్జన ప్రాంతాల్లో అత్యవసర చికిత్సీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. భద్రాచలం ఆసుపత్రి నందు అత్యవసర సేవలు నిర్వహణకు బెడ్లు ఏర్పాటుతో పాటు అంబులెన్సులు సిద్ధంగా ఉంచాలని చెప్పారు. భద్రాచలం వద్ద ఐదు పెద్ద క్రెయిన్లు ఏర్పాటు చేశామని, నేరుగా కాకుండా క్రెయిన్లు ద్వారా మాత్రమే నిమజ్జనం జరుగుతుందని భక్తులకు సహకరించాలని చెప్పారు. నిమజ్జనం నిర్వహించు ప్రాంతం వరకు భక్తులకు అనుమతి లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. విగ్రహాలు తరలింపులో రద్దీ నియంత్రణకు వాహనాల రాకపోలను నియంత్రణ చేయాలని చెప్పారు. కొత్తగూడెం మీదుగా తీసుకెళ్తున్న విగ్రహాలు ప్రకాశం స్టేడియంలోకి తీసుకురావాలని, అక్కడి నుండి మాత్రమే నిమజ్జనం నిర్వహణకు వెళ్లాలని చెప్పారు. భక్తులకు మంచినీరు సరఫరా చేయాలని చెప్పారు. నిమజ్జన ప్రాంతాల్లో నిరంతరాయంగా పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. పారిశుద్య కార్యక్రమాలు పర్యవేక్షణకు ప్రత్యేక సిబ్బందిని నియమించినట్లు చెప్పారు. నిమజ్జన కార్యక్రమాలకు సంబంధించి ఏదేని సహాయత, సలహాలు కొరకు ప్రజలు కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన 08744-241950 కంట్రోల్ రూముకు ఫోన్ చేయాలని ఆయన సూచించారు.
ఈ టెలి కాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, జడ్పీ సిఈఓ విద్యాలత, డిపిఓ రమాకాంత్, విద్యుత్ శాఖ ఎస్ఈ సురేందర్, వైద్యాధికారి శిరీష, మున్సిపల్ కమిషనర్లు, తహసిల్దారులు, యంపిడిఓలు, యంపిఓలు తదితరులు పాల్గొన్నారు.