భవిష్యత్ అవసరాలకు ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు :: జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి

జనగామ, అక్టోబర్ 7: భవిష్యత్ ఆక్సిజన్ అవసరాలకు కొరత లేకుండా చర్యలు చేపడుతున్నట్లు జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి అన్నారు. జిల్లా ప్రధాన ఆసుపత్రిలో 500 లీటర్ల సామర్థ్యం గల పిఎస్ఎ ఆక్సిజన్ ప్లాంట్ గురువారం నుండి అందుబాటులోకి వచ్చినట్లు ఆయన తెలిపారు. కరోనా దృష్ట్యా ప్రపంచం అంతటా ఆక్సిజన్ కొరతతో ఇబ్బందులు పడ్డ గత అనుభవాలను దృష్టిలో వుంచుకొని, పిఎం కేర్స్ నిధులతో దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన పిఎస్ఎ ఆక్సిజన్ ప్లాంట్లలో 35 ప్లాంట్లను గురువారం భారత ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తరాఖండ్ లోని రిషికేశ్ ఎయిమ్స్ నుండి డిజిటల్ వర్చువల్ ద్వారా జాతికి అంకితం చేసారు. అట్టి వానిలో జనగామ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి వద్ద ఏర్పాటుచేసిన ఆక్సిజన్ ప్లాంట్ ను జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్, అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, జనగామ మునిసిపల్ చైర్ పర్సన్ పోకల జమున లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వంద పడకల సామర్థ్యం వున్న ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా సమయంలో ఆక్సిజన్ సిలెండర్లు, కాన్సంట్రేటర్లు అందుబాటులో వుంచి, ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. క్రొత్తగా ఏర్పాటుచేసిన ప్లాంట్ ద్వారా నిమిషానికి 500 లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి చేయవచ్చని, దీంతో భవిష్యత్తులో ప్రధాన ఆసుపత్రి ఆక్సిజన్ అవసరాలకు ఏమాత్రం ఇబ్బందులు కలగకుండా బలోపేతం అయినట్లు ఆయన అన్నారు. ప్రయివేటు ఆసుపత్రులకు వెళ్లి ఆర్థికంగా ఇబ్బందులు పడవద్దని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అనుభవజ్ఞులైన డాక్టర్లు, ఆక్సిజన్ ప్లాంట్, సిలండర్లు, మందులు, అంబులెన్స్ లు, అన్ని వసతి సౌకర్యాలు, అందుబాటులో వున్నట్లు, మెరుగైన సేవలు పొందవచ్చని అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని, ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కరోనా వస్తే ప్రాణాపాయం ఏమాత్రం ఉండదని, శరీరం రోగనిరోధక శక్తి కలిగి త్వరగా కోలుకుంటారని ఆయన అన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న గాని మాస్క్ ధరించాలని, భౌతిక దూరం, కరోనా నియంత్రణా చర్యల్ని పాటించాలని చైర్మన్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్ పర్సన్ బాల్దే విజయ, జిల్లా ప్రధాన ఆసుపత్రి పర్యవేక్షకులు సుగుణాకర్ రాజు, కౌన్సిలర్ వంగాల కళ్యాణి, వైద్యాధికారులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి, జనగామచే జారిచేయనైనది.

Share This Post