భారత ఆహార సంస్థ (ఎఫ్ సిఐ) యాసంగిలో ధాన్యం కొనుగోళ్లు నిలిపివేసినందున రైతులు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టు విధంగా వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు.

సోమవారం కలెక్టరేట్ సమావేశపు హాలులో వ్యవసాయ, ఉద్యాన, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు, పౌర సరఫరాలు, పౌర సరఫరాల సంస్థ, విత్తనాభివృద్ధి సంస్థ, మిల్లర్స్, విత్తన డీలర్లలతో యాసంగిలో వరికి ప్రత్యామ్నాయ పంటల సాగుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మూడు సీజన్లు సరిపోను ధాన్యపు నిల్వలు పేరుకుపోయినందున భారత ఆహార సంస్థ యాసంగిలో ఒక్క గింజ ధాన్యాన్ని కూడా రైతుల నుండి కొనుగోలు చేయలేకపోతున్నామని ఖరాఖండిగా చెప్పినందున యాసింగిలో రైతులు ఎట్టిపరిస్థితుల్లో వరిసాగును చేపట్టొదని ఆయన సూచించారు. వారికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై క్లస్టర్లు వారిగా సాగు ప్రణాళికపై కార్యాచరణ ప్రణాళికలు తయారు చేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో అన్ని రైతువేదికల్లో పెద్దఎత్తున రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. వరి కంటే ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసిన రైతులతో అవగాహన కల్పించాలని చెప్పారు. యాసింగిలో సాగు చేసిన వరిపంటను ప్రభుత్వం కొనుగోలు చేయదని, వరిసాగు చేస్తే అందుకు వ్యవసాయ అధికారులే భాద్యులని చెప్పారు. వరికి ప్రత్యామ్నాయంగా సాగుచేయు పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు. వాతావరణ పరిస్థితులు, భూ సారాన్ని బట్టి ఎటువంటి పంటలు సాగు చేయాలో వ్యవసాయ అధికారులకు రైతులకు సూచించాలన్నారు. యాసంగిలో ధాన్యం ప్రభుత్వం ఎటువంటి కొనుగోలు కేంద్రాలు కానీ, గన్నీ సంచులు సరఫరా కానీ చేయదని, ఇట్టి విషయాను వ్యవసాయ అధికారులు దృష్టిలో ఉంచుకుని వారిని జీరో సాగు చేయు విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. విత్తనాలు కొరకు, తినడానికి ఉపయోగపడతాయని కొందరు రైతులు వరి సాగు చేసే అవకాశం ఉన్నందున అటువంటి రైతులకు వరి ఎట్టి పరిస్థితుల్లో సాగుచేయొద్దని నియంత్రణ చేయాలని చెప్పారు. వరికి బదులుగా సాగుచేయనున్న ప్రత్యామ్నయ పంటల విత్తనాలు కొరత లేదని ప్రభుత్వం సరఫరా చేస్తుందని చెప్పారు. వ్యాపారులు విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వ్యవసాయ అధికారులు విత్తనాల దుకాణాలను తనిఖీ చేయాలని, వరి విత్తనాలుంటే తక్షణం సీజ్ చేయడంతో పాటు లైసెన్సులు కూడా రద్దు చేయాలని చెప్పారు. జిల్లాలో ప్రస్తుతం విత్తన  డీలర్ల వద్ద అందుబాటులో ఉన్న దాన్యపు విత్తనాల స్టాకును తక్షణం సీజ్ చేయాలని చెప్పారు. విత్తన వ్యాపారులు లాభాపేక్షతో కాకుండా ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలని చెప్పారు. కొనుగోలు ప్రక్రియ లేనపుడు విత్తనాలు, విక్రయాలు నిర్వహణ చేయడానికి వీల్లేదని ఆయన స్పష్టం చేశారు. జిల్లాలో దాదాపు 70 వేల ఎకరాల్లో వరి సాగు చేయడం జరుగుతుందని, వారి కొనుగోలు చేసే పరిస్థితి లేనందున ఒక్క ఎకరంలో కూడా యాసింగిలో వరి సాగు: జరగడానికి వీల్లేదని చెప్పారు. గ్రామ పంచాయతీల్లోను, రైతులు వేదికల్లోను యాసంగిలో వరిసాగు చేపట్టొద్దనే సమాచారం ప్రజలు తెలుసుకునే విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లాలో 420 మంది విత్తన డీలర్లుతో సమావేశాలు నిర్వహించి వరి విత్తనాల విక్రయాలు లేకుండా చూడాలని చెప్పారు. పారాబాయిల్డ్ బియ్యం పట్టడం రద్దు చేసినందున రా బియ్యం పట్టు విధంగా మిల్లర్లు చర్యలు తీసుకోవాలని చెప్పారు. యువత గంజాయికి అలవాటు పడి బావి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని గమనించిన ప్రభుత్వం మత్తుగంజాయి సాగు చేసినా, సరఫరా చేసినా పిడి యాక్టు నమోదు చేస్తామని చెప్పారు. యువతను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నందున గంజాయి సాగుతో పాటు సరఫరా చేసే వ్యక్తులకు రైతుబంధు, రైతుభీమా, పించను, విద్యుత్, ఆహారపత్రాకార్డు వంటి అన్ని పథకాలను విచక్షణంగా రద్దు చేయడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, వ్యవసాయ అధికారి అభిమన్యుడు, ఉద్యాన అధికారి మరియన్న, కృసి విజ్ఞాన శాస్త్రవేత్త లక్ష్మీనారాయణమ్మ, డిఎస్ఇ చంద్రప్రకాశ్, పౌర సరఫరాల సంస్థ డియం ప్రసాద్, విత్తనాభివృద్ధి సంస్థ అధికారి అక్షిత, రైస్ మిల్లర్స్ అధ్యక్షులు జుగలి కిషోర్, విత్తనాల డీలర్ల సంఘ అధ్యక్షులు సోమసుందర్ తదితరులు పాల్గొన్నారు.

 

Share This Post