*భారత రాజ్యాంగం కల్పించిన శక్తివంతమైన వజ్రాయుధం ఓటుహక్కు :: అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్*

*భారత రాజ్యాంగం కల్పించిన శక్తివంతమైన వజ్రాయుధం ఓటుహక్కు :: అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్*

*ప్రచురణార్థం-1*

రాజన్న సిరిసిల్ల, జనవరి 25: భారత రాజ్యాంగం దేశంలోని 18 సంవత్సరాలు నిండిన వారందరికీ కల్పించిన శక్తివంతమైన వజ్రాయుధం ఓటు హక్కు అని, ప్రతి ఓటరూ నిష్పక్షపాతంగా తన ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ పేర్కొన్నారు. మంగళవారం జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఆవరణలో అదనపు కలెక్టర్ అధికారులు, సిబ్బందితో ఓటు హక్కు వినియోగం, ప్రాధాన్యతపై ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతీ ఓటరు ఎన్నికల్లో తన ఓటుహక్కును వినియోగించుకునేటప్పుడు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా, ఒత్తిడులకు ప్రభావితం కాకుండా, నిష్పక్షపాతంగా ఓటుహక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడం అంటే బలమైన ప్రజాస్వామ్యానికి పునాది వేయడమే అన్నారు. ఓటు హక్కు ప్రాధాన్యత గురించి ప్రతి ఒక్కరికి తెలియచేయాలన్నదే ఈ కార్యక్రమ ఉద్దేశమన్నారు. ఓటు వజ్రాయుధం లాంటిదని, దానిని అమ్ముకోవద్దని, తమ జీవితాలను బాగుపరిచే నాయకుడిని ఎన్నుకునేందుకు ఓటును సక్రమంగా వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఓటు అర్హత పొంది ఓటర్ గా పేరు నమోదు చేసుకున్న నూతన ఓటర్ లకు ఓటర్ ఐడి కార్డులను ఆయన అందజేశారు. అనంతరం ఓటు హక్కు ప్రాముఖ్యత, వినియోగం, తదితర అంశాలపై జాతీయ ప్రధాన ఎన్నికల కమీషనర్ సుశీల్ చంద్ర అందించిన వీడియో సందేశంను ఆయన వీక్షించారు.

ఈ ప్రతిజ్ఞలో డీఈఓ రాధాకిషన్, డీసీఓ బుద్ధనాయుడు, ఎస్సీ సంక్షేమ అధికారి భాస్కర్ రెడ్డి, సీపీఓ శ్రీనివాస చారి, పౌర సరఫరాల మేనేజర్ హరికృష్ణ, మైనార్టీ శాఖ ఓఎస్డీ సర్వర్ మియా, ఎన్నికల విభాగం ఉప తహశీల్దార్ రెహమాన్, కార్యాలయ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Share This Post