భారత వైమానిక దళంలో ఎయిర్ మెన్ గా చేరుటకు యువత ముందుకు రావాలి – అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్

భారత వైమానిక దళంలో ఎయిర్ మెన్ గా చేరుటకు యువత ముందుకు రావాలి – అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్

భారత వైమానిక దళంలో ఎయిర్ మెన్ గా చేరుటకు మెదక్ పట్టణంలో నవంబర్ లో నిర్వహించే ర్యాలీలో జిల్లా నుండి అధిక సంఖ్యలో యువత పాల్గొని ఎంపికయ్యేలా చూడాలని అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ అధికారులకు సూచించారు. నేడు ఏ ఉద్యోగానికైనా కనీస విద్యార్హత డిగ్రీ ఉంటుందని, కానీ ఎయిర్ మెన్ ఉద్యోగానికి ఇంటర్మీడియట్ సరిపోతుందని, కొద్దిగా కష్టపడితే ఉద్యోగం సాధించవచ్చని యువతలో అవగాహన కలిగించాలన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, మోడల్, రెసిడెన్షియల్ , ఎయిడెడ్ కళాశాలల ప్రధానాచార్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఎయిర్ మెన్ లో రెండు క్యాటగిరీలు ఉన్నాయని, మొదటి క్యాటగిరిలో ఇంటర్మీడియట్ ఉతీర్ణులై 17 నుండి 21 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలని, రెండవ క్యాటగిరిలో డిగ్రీ ఉతీర్ణులై 22 నుండి 25 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలని అన్నారు.
కాబట్టి మీ కళాశాలల నుండి ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేసి వెళ్లిన, డిగ్రీ చదువుచున్న యువతకు అవగాహన కలిగించి ఎక్కువ సంఖ్యలో వైమానిక దళంలో ఎంపికయ్యే విధంగా ప్రోత్సహించాలని అన్నారు. మూడు, నాలుగు మండలాలను ఒక క్లస్టర్ గా ఏర్పాటుచేసి యువతకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. శారీరక ధారుడ్య పరీక్ష లో ఎంపికైన వారికి ఆబ్జెక్టివ్ టైప్ లో వ్రాత పరీక్ష ఉంటుందని అందులో ఎంపికైతే శిక్షణ ఇచ్చి, ఉద్యోగంలో నియామకం చేస్తారని అన్నారు. శిక్షణా కాలంలో నెలకు 14,600 స్టైఫండ్ చెల్లించబడుతుందని, అనంతరం 26,500 బేసిక్ పే తో పాటు ఇతర అలవెన్సులతో జీతం ఉంటుందని అన్నారు. శారీరక దారుడ్య పరీక్షలో అభ్యర్థి ఆరున్నర నిముషాలలో 1. 6 కిలో మీటర్లు పరుగెత్తవలసి ఉంటుందని అన్నారు. జిల్లా నుండి యువత అధిక సంఖ్యలో ఎంపికయ్యేలా చూడాలని, కనీసం 3 వేల మందికి పైగా యువత ముందుకు వస్తే వారికి సరైన శిక్షణ ఇచ్చుటకు కార్యాచరణ రూపొందిస్తామని అన్నారు. ప్రస్తుతం విద్యార్థులకు ఆన్ లైన్ లో తరగతులు నిర్వహిస్తున్నందున వాట్స్ అప్ ద్వారా, పత్రికా ముఖంగా విస్తృత ప్రచారం కల్పించాలని ఆమె కోరారు.. ఎంపిక, పరీక్షా విధానం తదితర వివరాలకు కు MY IAF యాప్ ను ప్లే స్టోర్ నుండి డౌన్ లోడ్ చేసుకోవాలని లేదా www.airmenselection.cdac.in వెబ్ సైట్ నందు వివరాలు తెలుసుకోవచ్చని ఆమె సూచించారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రధానాచార్యులను సలహాలు, సూచనలు కోరగా శారీరక దృఢ పరీక్షలకు కోచ్ ఏర్పాటు చేయవలసి ఉంటుందని, అలాగే ఆంగ్లం , హిందీ లో మాత్రమే ఉండే పరీక్షకు తగు శిక్షణ ఇవ్వవలసి ఉంటుందని, రవాణా, వసతి సౌకర్యం వంటివి కల్పిస్తే యువత ముందుకొచ్చే అవకాశముంటుందని అన్నారు.
ఈ సమావేశంలో జిల్లా యువజన సంక్షేమాధికారి నాగరాజ్, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి సత్యనారాయణ, జిల్లా విద్యా శాఖాధికారి రమేష్ కుమార్, వివిధ కళాశాలల ప్రధానాచార్యులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post