భారత సాయుధ దళాల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ చేయూతనందించాలి…….. అదనపు కలెక్టర్ రాజర్షి షా

భారత సాయుధ దళాల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ చేయూతనందించాలని అదనపు కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు.

మంగళవారం సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా ఆయన కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో తన వంతు విరాళం అందజేసి సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ రక్షణకు, భారత ప్రజల సుఖశాంతుల కొరకు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి పని చేస్తున్న భారత త్రివిధ దళాల సేవలు మరువలేనివన్నారు. కుటుంబాలకు దూరంగా ఎక్కడో దేశ సరిహద్దుల్లో నిరంతరం అప్రమత్తులై దేశ రక్షణకు పోరాడుతూ జీవితాలను త్యాగం చేస్తున్న సాయుధ దళాల సంక్షేమానికి తమవంతు చేయూత అందించి సహకరించాలన్నారు. దేశ భద్రత లో భాగంగా తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా శత్రువుల దాడుల్లో అమరులై ప్రజలకు రక్షణ కవచంగా నిలుస్తున్నారని వారి సేవలను కొనియాడారు.

ఈ సందర్భంగా రాజార్షి సైనికులకు, మాజీ సైనికులకు,మాజీ సైనిక వితంతువులకు కృతజ్ఞతలు తెలియజేశారు. జిల్లా ప్రజలు స్వచ్ఛందంగా తమ వంతు విరాళాలను సైనిక సంక్షేమానికి అందించాలని కోరారు. ప్రజల నుండి సేకరించిన విరాళాలను ప్రాణత్యాగం చేసిన సైనికుల కుటుంబాలకు అందజేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.

ఎన్ సి సి విద్యార్థులు సమీకృత కలెక్టరేట్ లోని అన్ని కార్యాలయాలలో అధికారులు ఉద్యోగుల నుండి విరాళాలు సేకరించారు.

ఈ కార్యక్రమంలో రీజనల్ సైనిక సంక్షేమ అధికారి కెప్టెన్ ఆర్. శ్రీనివాసులు, సిబ్బంది శ్రీమతి బి. సరస్వతి, సయిద్ సాయం, మాజీ సైనికులు జి .పోచయ్య, దశరథ్,ఎన్. లక్ష్మీనారాయణ,డి. నర్సింలు,డి. రాములు, ఏం. సత్తయ్య, రాజేందర్ రెడ్డి, ఎన్ సి సి విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post