భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా గాంధీ సినిమాను జిల్లాలోని అన్ని సినిమా హాళ్ళల్లో పాఠశాలల విద్యార్థుల కొరకు ప్రదర్శించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు.

ప్రచురణార్థం

ఖమ్మం, ఆగస్టు 6:

భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా గాంధీ సినిమాను జిల్లాలోని అన్ని సినిమా హాళ్ళల్లో పాఠశాలల విద్యార్థుల కొరకు ప్రదర్శించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. శనివారం కలెక్టరేట్ లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్. వారియర్ తో కలిసి విద్యాశాఖ అధికారులు, సినిమాహాళ్ల యాజమాన్యం, ప్రయివేటు పాఠశాలల యాజమాన్యంతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత దేశానికి స్వాతంత్య్రం సిద్దించి 75 సంవత్సరాలు అయిన నేపథ్యంలో స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని అన్నారు. ఇట్టి సందర్భం ప్రతి భారతీయునికి గర్వ కారణమని ఆయన తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా, ఘనంగా 14 రోజులపాటు, ఈ నెల 8 నుండి 22 వరకు వేడుకలను నిర్వహిస్తున్నట్లు ఆయన అన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 9 నుండి 11 వరకు , తిరిగి 16 నుండి 21 వరకు ప్రతి సినిమాహాల్లో ఉ. 10.00 గంటల నుంచి మ. 1.15 వరకు గాంధీ సినిమా ప్రదర్శించాలన్నారు. జిల్లాలో సుమారు 92 వేల మంది 6 నుండి 10వ తరగతి చదివే విద్యార్థులున్నట్లు, ప్రతి రోజు 10 వేల మంది విద్యార్థులకు ప్రదర్శన చూపించనున్నట్లు ఆయన అన్నారు. ఏ పాఠశాల ఏ సినిమాహాల్ కి ట్యాగ్ చేస్తారో జాబితా తయారుచేసి ఇవ్వాలని ఆయన తెలిపారు. సినిమాహాల్ యాజమాన్యం సినిమాని డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. ప్రతి సినిమా హాల్లో పోలీస్ బందోబస్తు ఉంటుందని, విద్యా, రెవిన్యూ శాఖల సహకారం ఉంటుందని ఆయన తెలిపారు. మొదటి వారంలో ప్రభుత్వ, రెండో వారంలో ప్రయివేటు పాఠశాలల విద్యార్థులను పంపాలని, ప్రదర్శన కు ప్రభుత్వ పాఠశాలలకు వాహనాలు సమకూర్చాలని అన్నారు. ఇబ్బందులు కలగకుండా పాఠశాలల సమయం ను చూసుకోవాలని ఆయన తెలిపారు.

సమావేశంలో పాల్గొన్న నగర పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ, సామాజిక బాధ్యతలో భాగంగా సినిమా హాళ్ల యాజమాన్యం ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వాలని, ఇది ఒక మంచి అవకాశంగా భావించాలని అన్నారు. సినిమా హాల్లో టాయిలెట్లు శుభ్రంగా ఉంచాలని, బాల్కనీలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు చేపట్టాలని అన్నారు. పార్కింగ్ కు ఇబ్బందులు లేకుండా చూడాలని, పిల్లలు సినిమా చూసి బయటకు వెళ్లే సమయంలో మధ్యాహ్న సినిమాకు వచ్చే ప్రేక్షకులు క్లాష్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. పిల్లలు లోపలికి వెళ్లే, బయటకు వచ్చే సమయాల్లో మంచి వెలుతురు ఉండేలా చూడాలన్నారు. సమస్యలు ఉంటే దృష్టికి తేవాలని పోలీస్ కమీషనర్ అన్నారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, అదనపు డిసిపి షబరీష్, డిఇఓ యాదయ్య, డిటిఓ కిషన్ రావు, ఎంఇఓలు, సినిమాహాళ్ల యాజమాన్య ప్రతినిధులు, ప్రయివేటు పాఠశాలల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

 

Share This Post