భారీవర్షాల దృష్ట్యా అందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, సంబంధిత అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

పత్రికా ప్రకటన తేది.08/09/2021. వనపర్తి.

అకాలవర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశించారు.

బుధవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగునీటి కాల్వలు నిండుగా ప్రవహిస్తున్న నేపథ్యంలో వర్షాలు కురిసినప్పుడు వంతెనలు, కాలువలు తెగిపోయే సమస్య రాకుండా బలహీన కాల్వలను గుర్తించి మరమ్మతులు చేసేలా నీటిపారుదల శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు సమావేశం నిర్వహించి చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

గ్రామాలలో కూలిపోయే దశలో ఉన్న ఇండ్లను గుర్తించి అప్రమత్తం చేయాలని, హరితహారం కింద మిగిలిపోయిన చోట్ల (గ్యాప్ ఫిల్లింగ్) వెంటనే మొక్కలు నాటాలని, అక్టోబరు నెలతో చలికాలం మొదలయితే మొక్కలు ఎదగవు. వర్షాలు కురుస్తున్నాయి నేపథ్యంలోనే లక్ష్యానికి చేరువగా మొక్కలు నాటాలని మంత్రి తెలిపారు.

వనపర్తి, నాగర్ కర్నూలు జిల్లాలలో నూతనంగా మెడికల్ కళాశాలలు మంజూరయ్యాయని, గద్వాలలో నర్సింగ్ కళాశాల కూడా మంజూరయిందని, వీటి నిర్మాణం కోసం కేటాయించిన స్థలాల విషయంలో కొందరు గిట్టని వారు సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని, ఆ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆయన వివరించారు.

వనపర్తి , నాగర్ కర్నూలు జిల్లాలలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, గద్వాల నర్సింగ్ కళాశాలకు కేటీఆర్ గారు త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి సూచించారు.

గ్రామాలు, పట్టణాలలో పారిశుద్ధ్య పనులను తరచుగా చేపడుతూ ఉండాలని, కొత్తగా పాఠశాలలను తెరుస్తున్న నేపథ్యంలో బలహీనంగా ఉన్న పాఠశాలల భవనాలను గుర్తించి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ నిధులను పాఠశాలల్లో మౌళిక సదుపాయాల కల్పనకే వినియోగించాలని ఆయన అన్నారు.

జిల్లా కలెక్టర్లు వీలైనన్ని ఎక్కువ పాఠశాలలను సందర్శించి చర్యలు తీసుకోవాలని, గ్రామాలలో జ్వరాలు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని, భారీ వర్షాలకు తెగిన, దెబ్బతిన్న రోడ్లు, చెరువుల మరమ్మతుకు చర్యలు తీసుకోవాలని మంత్రి తెలిపారు.
వనపర్తి, నాగర్ కర్నూలు, జోగుళాంబ గద్వాల జిల్లాల కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, కమిషనర్లు పాల్గొన్నారు.
ఈ టెలీ కాన్ఫరెన్స్ లో వనపర్తి జిల్లా నుండి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష, జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
………..
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post