గత రాత్రి నుండి మూడు రోజుల వరకు రాష్టంలో భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉంటూ ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్.హరీష్ సూచించారు. ఇప్పటికే వర్షాల కారణంగా చెరువులు, కుంటలు నిండడంతో పాటు మత్తడులు అలుగుపారుతున్నందున జిల్లాలోని లోతట్టు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయవలసినదిగా ఈ మేరకు జిల్లా రెవిన్యూ , పంచాయత్ రాజ్, నీటిపారుదల , మునిసిపల్ కమిషనర్లు , మండల అధికారులకు ఆదేశాలిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రమాదకరంగా పొంగిపొర్లుతున్న వంతెనలు, కాజ్‌వేల ను గుర్తించి ఆ మార్గంలో ఎవరుకూడా వెళ్లకుండా చూడాలన్నారు. గాలులకు, వర్షాలకు పడిపోయేందుకు ఆస్కారం ఉన్న చెట్లు, విద్యుత్ స్తంభాల ను గుర్తించి సరిచేయాలన్నారు. గతంలో వచ్చిన భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకొని ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో అయినా తక్షణమే స్పందించేందుకు అధికారులు హెడ్ క్వార్టర్ లోనే ఉండాలన్నారు. వర్షాల కారణంగా గ్రామాల్లో గుర్తించిన సమస్యాత్మక ప్రాంతాలు, తీసుకోవలసిన చర్యల పై మండలాల వారీగా ఆయా సంబంధిత శాఖా వారు పోలీస్ సిబ్బంది తో సమన్వయము చేసుకోవాలని సూచించారు. ఇందుకోసం కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశామని, ఇందులో రెండు షిఫ్టులలో 24 గంటల పని చేసే విధంగా రెవిన్యూ సిబ్బంది ఉంటారని వారు ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు, తిరిగి రాత్రి 8 నుంచి మరుసటి ఉదయం 8 గంటల వరకు పనిచేస్తారని తెలిపారు. ఇక్కడకు వచ్చిన ఫోన్ కాల్స్ సమాచారాన్ని సిబ్బంది తక్షణమే సంబంధిత ఆర్.డి.ఓ.లు, తహసీల్ధార్లకు తెలియజేసి అప్రమత్తం చేస్తారని వెంటనే సహాయ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. సమాచారాన్ని కంట్రోల్ రూమ్ లోని 08542-223360 ఫోనుకు లేదా 7995088720 నెంబరుకు తెలపాలని ఆయన సూచించారు.
భారీ వర్షాల కారణంగా జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి – కలెక్టర్ హరీష్
