జిల్లా కలెక్టర్ సోమవారం నాడు టెలీ కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా స్థానిక సంస్థల కలెక్టర్ దీపక్ తివారీ, జిల్లా రెవెన్యూ ఆదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, డి సి పి నారాయణరెడ్డి, ఆర్డీవోలు, మండల స్పెషల్ ఆఫీసర్లు, తహసీల్దార్లు, ఎంపిడిఓలు, ఎంపీఓలు, మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీరాజ్, నీటిపారుదల, ఆర్ అండ్ బి, విద్యుత్ ఇంజనీర్లు, జిల్లా అధికారులతో వర్షాలు, వరదల కారణంగా తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై సమీక్షిస్తూ, రెండు రోజులపాటు వర్షాలు ఉన్నందున అన్ని స్థాయిల మండల అధికారులు హెడ్‌క్వార్టర్స్ విడిచి వెళ్లరాదని, వారి ప్రధాన కేంద్రాల లోనే ఉండి, క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ రిపోర్టులు పంపాలని, ఏ విధమైన సంఘటనకైనా వెంటనే స్పందించేలా పూర్తి అప్రమత్తతతో ఉండాలని ఆదేశించారు. పోలీసు, రెవెన్యూ సిబ్బంది పూర్తి సమన్వయంతో ప్రమాద ప్రాంతాలలో తాత్కాలికంగా బారికేడింగ్ ఏర్పాటు చేయాలని, ప్రమాద సూచికలు ఫ్లెక్సీలు ప్రదర్శించాలని, చెరువులు, కుంటలు, లోతట్టు ప్రాంతాలు, రోడ్లపై నీరు పొంగి ప్రవహించే ఈ ప్రాంతాల వద్ద గట్టి నిఘా ఏర్పాటుకు పంచాయతీ సెక్రటరీ, వి ఆర్ ఏ, వీఆర్వో లతో 24 గంటల పర్యవేక్షణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామాలలో పల్లె ప్రగతిలో నియమించిన వార్డ్ కమిటీలు, అలాగే యూత్ కమిటీలను పర్యవేక్షణ సహాయక చర్యలకు సిద్ధం చేయాలని, రోడ్లపై నీరు ప్రవహించే పాయింట్లను గుర్తించి జెసిబి లతో నీటిని మళ్లించే ప్రయత్నాలు చేపట్టాలని, ప్రమాదకరమైన రోడ్లు మూసివేసి నీరు వెళ్ళిపోయేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. గ్రామాలలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పట్టణాలు, గ్రామాలలో క్షేత్ర స్థాయిలో విద్యుత్ సమస్యలు ఏర్పడకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని, దెబ్బతిన్న స్తంభాలను, వైర్లను గమనించాలని, ఎలాంటి ప్రమాద పరిస్థితులు తలెత్తకుండా పర్యవేక్షణలో చేపట్టాలని తెలిపారు. ఆర్టీసీ ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, అవసరం లేని చోట ప్రయాణాలు మానుకోవాలని, రోడ్లు, బ్రిడ్జిల వద్ద అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గత రాత్రి నుండి వర్షం కురుస్తున్నందున లోతట్టు ఇళ్లలోకి నీరు వచ్చే అవకాశం ఉందని, పంచాయతీ సెక్రటరీ, సిబ్బంది అప్రమత్తంగా ఉండి చర్యలు తీసుకోవాలని, దెబ్బతిన్న పూరిళ్ళు, పెంకుటిండ్లలో ఉన్న వారిని గమనించాలని, వారిని అక్కడి నుండి కమ్యూనిటీ హాల్స్, పాఠశాల భవనాలలోనికి మార్చాలని, వారికి భోజన వసతి, అవసరమైన వారికి సరుకులు పంపిణీ చేపట్టాలని తెలిపారు. పునాదిగాని కాల్వ, పిల్లాయిపల్లి కాలువల వద్ద 24 గంటల పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. రోడ్ల పరిస్థితిని గమనించాలని, అవసరమైన చోట మరమ్మతులు చేపట్టాలని ఆర్ అండ్ బీ, పంచాయతీ అధికారులకు సూచించారు. గతంలో ప్రమాదాలు జరిగిన ప్రాంతాలలో గట్టి భద్రతా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కలగకుండా అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
