భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీష్ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.

జిల్లా, రెవిన్యూ , ఇరిగేషన్ , మునిసిపల్ కమిషనర్లు , మండల అధికారులతో అత్యవసర టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ,రానున్న 48 గంటల్లో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హై అలర్ట్ ప్రకటించిన సమాచారం మేరకు జిల్లా లోని అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. వర్షాల వలన వాగులు, చెరువులు, నదులు పొంగే ఆస్కారం వుంటున్నందున మారుమూల ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలలోని ప్రజలను నీటివద్దకు వెళ్లకుండా గ్రామాల్లో టామ్ టామ్ చేయించాలని, గ్రామస్థాయి అధికారులను ఆయా ప్రాంతాలలో ఉండి ప్రజలు ఎవరు నీటి ప్రవాహం వైపు వెళ్లకుండా చూడాలని తెలిపారు. తక్కువ ఎత్తుగల కల్వర్ట్ లు, బ్రిడ్జి ల సమీపంలోకి ఎవరుకూడా వెళ్లకుండా స్థానిక సర్పంచులు, ప్రజాప్రతినిధుల సహకారంతో ప్రజలకు తెలియ జేయలని అన్నారు. ప్రతి రెండు, మూడు గంటలకు ఒకసారి రిపోర్టులు కలెక్టరేట్ కు పంపి చాలని అన్నారు. ఏమైనా సహాయం కోరేవారు కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నెంబర్ 94924-09781…08418297820..కు కాల్ చేయవచ్చని, వెంటనే సహాయ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. కంట్రోల్ రూమ్ నెంబర్ ప్రజలకు తెలిసే విధంగా గ్రామాలు, పట్టణాల్లో ప్రచారం చేయాలని, అన్ని వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేయాలని సూచించారు. అధికారులు వారి వారి హెడ్ క్వార్టర్ లలో ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. గతంలోభారీ వర్షాలను దృష్టిలో ఉంచుకొని ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా, మండల అధికారులను ఆదేశించారు. వర్షాల కారణంగా గ్రామాల్లో గుర్తించిన సమస్యాత్మక ప్రాంతాలు, తీసుకోవలసిన చర్యల పై మండలాల వారీగా ఆయా సంబంధిత శాఖా వారు పోలీస్ సిబ్బంది తో సమన్వయము చేసుకోవాలి అని జిల్లా కలెక్టర్ తెలిపినారు .

Share This Post