బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్ తుఫాన్ వల్ల నిజామాబాద్,కామారెడ్డి జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు మూడు రోజులపాటు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు జిల్లా అధికారులు అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొని ప్రజలను అప్రమత్తం చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డిని,కామారెడ్డి కలెక్టర్ జితేష్ వి పాటిల్ ను రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశించారు.
సోమవారం అసెంబ్లీ విరామ సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు నిజామాబాద్, కామారెడ్డి జిల్లా అధికారులతో మంత్రి ఫోన్లో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.తుఫాన్ వల్ల ఒరిస్సా,ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులలోని ఇతర జిల్లాలలో కూడా భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించిందని ఈ దిశగా జిల్లా అధికారులు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గత కొన్ని రోజులుగా జిల్లాలో పలు మార్లు భారీ వర్షాలు కురిసినప్పటికీ జిల్లా యంత్రాంగం అధికారులు తీసుకున్న ముందస్తు చర్యల వల్ల ఎటువంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా విధులు నిర్వహించారని ఆ అనుభవంతో ఇప్పుడు కూడా అటువంటి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పారు.ముఖ్యంగా ఇరిగేషన్, రోడ్లు-భవనాలు, పంచాయతీ రాజ్,రెవెన్యూ, మున్సిపాలిటీ, వ్యవసాయ,ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారులు మరింత అప్రమత్తంగా ఉండి ఎక్కడ కూడా ప్రజలకు కానీ మూగజీవాలకు కానీ ఆస్తులకు కానీ ప్రమాదాలు నష్టం జరగకుండా ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేయాలని అన్నారు. క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండి అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలన్నారు.ఎస్సారెస్పీ పరివాహక ప్రాంత ప్రజలను,నది పరివాహక లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండవలసిందిగా ముందస్తుగా హెచ్చరికలు జారీ చేయాలని ఈ దిశగా అధికారులు మిగతా ఏర్పాట్లు కూడా చేసుకోవాలని తెలిపారు.
ఈ భారీ వర్షాల నేపథ్యంలో ఎప్పటికప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్,పునరావాస శాఖ సిబ్బంది పూర్తి అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
కల్వర్టులు,రోడ్లు,చెరువు కట్టలు క్షేత్ర స్థాయిలో అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని అన్నారు.అత్యవసర వైద్య విభాగం 24 గంటలు అందుబాటులో ఉండాలని,జిల్లా అధికారులు ఎవరూ సెలవు పై వెళ్లరాదని మంత్రి ఆదేశించారు.