భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

ఆగష్టు 30, 2021ఆదిలాబాదు:-

రానున్న 48 గంటల్లో జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు జిల్లాలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అధికార యంత్రాంగం అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం సాయంత్రం తన క్యాంపు కార్యాలయం నుండి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, వాతావరణ శాఖ సూచనల మేరకు 48 గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయని, రెడ్ అలెర్ట్ ప్రకటించిన మేరకు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు చర్యలలో భాగంగా వర్షాల వలన లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే ఆస్కారం ఉన్నందున ఆయా లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేరవేసేందుకు సిద్ధంగా ఉండాలని అందుకు అన్ని శాఖల అధికారులు పోలీస్ యంత్రాంగం సిద్ధంగా ఉండాలని అన్నారు. ప్రభుత్వ యంత్రాగానికి మంజూరు చేసిన సెలవులను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. మంగళవారం రోజున ప్రభుత్వ సెలవు అయినప్పటికిని ఉద్యోగులు, అధికారులు అందుబాటులో ఉండాలని అన్నారు. వర్షాల వలన ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగకుండా ప్రజలను సమాయత్త పరుస్తూ ముందస్తు చర్యలు చేపట్టాలని అన్నారు. వర్షాల వలన విద్యుత్ లైన్ లు తెగి పోయినప్పుడు వెంటనే చర్యలు చేపట్టాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. గ్రామ, మండల అధికారులు, మండల ప్రత్యేక అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. కలెక్టరేట్ లోని కంట్రోల్ రూమ్ లో సిబ్బందిని నియమించి ఎప్పటికప్పుడు వివరాలు సేకరించాలని ఆర్డీఓ ను ఆదేశించారు. ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ, గతంలో భారీ వర్షాల నేపథ్యంలో ఎక్కువ నష్టం జరుగకుండా ముందస్తు చర్యలు చేపట్టామని అదేవిధంగా ఈ సరి కూడా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని అన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలను, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను వరదల సమయంలో మనోధైర్యాన్ని కల్పిస్తూ అప్రమత్తం చేయాలనీ అన్నారు. జిల్లాలో పర్యాటక ప్రదేశాలైన కుంటాల, పొచ్చెర జలపాతాలు ఎవరిని వెళ్లకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. మండలాల్లోని పోలీస్ అధికారులు గ్రామాలను పర్యటించి రోడ్లు, వంతెనలపైనుండి ప్రవహించే నీటినుండి ఎవరినికూడా వెళ్లకుండా చూడాలని, తెగిపోయిన రోడ్లు వంతెనల వివరాలను జిల్లా హెడ్ క్వార్ట్రర్ కు తెలియపరచాలని అన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ, మండల ప్రత్యేక అధికారులు గ్రామాలలో పర్యటించి వరద పరిస్థితులు, ప్రజలకు అందించాల్సిన సేవలు, సహకారం వంటివి చేపట్టాలని సూచించారు. ప్రభుత్వం ఆదేశించిన మేరకు జిల్లా యంత్రాంగం జిల్లాలోని ప్రజలను సురక్షితంగా ఉంచే విధంగా ముందస్తు చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ టెలి కాన్ఫరెన్స్ లో ఆర్డీఓ జాడి రాజేశ్వర్, ట్రాన్స్కో ఎస్ఈ ఉత్తమ్, జిల్లా, మండల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

…………………………………………………………….. జిల్లా పౌర సంబంధాల అధికారి, ఆదిలాబాదు గారిచే జారీ చేయనైనది.

Share This Post