భారీ వర్షాల నేపథ్యంలో మున్సిపల్‌ కమిషనర్లతో మున్సిపల్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌ కుమార్‌ వీడియో కాన్ఫరెన్స్

భారీ వర్షాల నేపథ్యంలో మున్సిపల్‌ కమిషనర్లందరు అప్రమత్తంగా ఉండి, ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూడాలని మున్సిపల్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌ కుమార్‌ అన్నారు. ఇప్పటికే కురిసిన వర్షాలతో చెరువులు, కుంటలు, వాగులు నిండినందున ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ఇంకా వరదలు పెరిగే అవకాశం ఉందని, రాత్రి పగలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. శనివారం మసాబ్‌ ట్యాంక్‌ సీడీఎంఏ కార్యాలయం నుంచి మున్సిపల్‌ కమిషనర్లు, ఇంజనీరింగ్‌ అధికారులు, శానిటరీ ఇన్సెస్పెక్టర్‌లు, మెప్మా పీడీలతో మున్సిపల్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌ కుమార్‌, సీడీఎంఏ ఎన్‌.సత్యనారాయణలు వీడియో కాన్ఫరెన్స్​‍ నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ వర్షాల నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ఆదేశాలకు అనుగుణంగా కమిషనర్లకు పలు ఆదేశాలు, సూచనలు జారీ చేశారు. మరో రెండు మూడు రోజులు భారీ వర్షాలున్నాయనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రస్తుతం వర్షాలు, వరదలతో కురిసిన వర్షంతో చెరువులు, కుంటలు పొంగే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. చెరువులు, కుంటలకు గండ్లు పడకుండా చూసుకోవాలని సూచించారు. నీటిపారుదల శాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. కాలనీలు, లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురికాకుండా చూసుకోవాలన్నారు. భారీ వర్షాలతో ముంపునకు గురైతే వారిని పునరావాస కేంద్రాలకు తరలించి వారిని సౌకర్యాలు కల్పించాలన్నారు. శిథిలావస్థలో ఉన్న ఇండ్లను గుర్తించి వాటిలో నివసిస్తున్న వారిని ఖాళీ చేయించాలని, ప్రమాదకరంగా ఉన్న వాటిని కూల్చివేయాలన్నారు. తాగునీరు కలుషితం కాకుండా చూడాలని, చెత్తను ఎప్పటికప్పుడు ఏరి వేయాలన్నారు. మురుగు కాలువల్లో నీరు సులువుగా ప్రవహించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. వరుసగా రెండు రోజులు సెలవులు వస్తున్నందున మున్సిపల్‌ సిబ్బంది పనిచేసే కేంద్రాన్ని విడిచి వెళ్లకూడదని సూచించారు. ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకొని ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా, ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చూసుకోవాలన్నారు.  ఈ వీడియో కాన్ఫరెన్స్​‍లో డీటీసీపీ విద్యాధర్‌, ప్రజారోగ్య విభాగం ఈఎన్‌సీ శ్రీధర్‌, ఇరిగేషన్‌ ఈఎన్‌సీ ధర్మానాయక్‌ , సీడీఎంఏ అధికారులు పాల్గొన్నారు.

Share This Post