*భూ సమస్య పరిష్కారానికి చర్యలు:: జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

*భూ సమస్య పరిష్కారానికి చర్యలు:: జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

జనగామ, సెప్టెంబర్ 14: జఫర్ గడ్ మండల 9 గ్రామాల రైతుల భూ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య అన్నారు. మంగళవారం మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆధ్వర్యంలో జఫర్ గడ్ మండల ప్రజాప్రతినిధులు, రైతులు కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ ని కలిసి భూ సమస్య పరిష్కారానికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మండల భూ సమస్యను కలెక్టర్ కు వివరించారు. జఫర్ గడ్ మండలంలోని 9 గ్రామాల్లో 900 సర్వే నెంబర్లలోని 2 వేల 500 మంది రైతులకు చెందిన 5 వేల 106 ఎకరాల భూమిని 2007 సంవత్సరంలో అప్పటి తహసీల్దార్ సబ్ రిజిస్ట్రార్ ఘనపూర్ స్టేషన్ కు ప్రభుత్వ భూమి అని వ్రాయడం వల్ల నిషేధిత భూ జాబితాలోకి వచ్చిందన్నారు. ధరణికి రాక పూర్వం తహసీల్దార్ ఎన్ఓసి ఇస్తే, రిజిస్ట్రేషన్లు జరిగేవని, ధరణి వచ్చాక రిజిస్ట్రేషన్లు జరగటం లేదని అన్నారు. రెవిన్యూ రికార్డులో పట్టా భూమిగా ఉన్న రిజిస్ట్రేషన్ రికార్డుల్లో ప్రభుత్వ భూమిగా నమోదై ఉందని ఆయన కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ప్రభుత్వ పరంగా రైతుబంధు, రైతు భీమా సౌకర్యాలు రైతులు పొందుతున్నట్లు, రికార్డుల్లో ప్రభుత్వ భూమిగా నమోదుతో అమ్మడం, కొనడం చేయలేక, బ్యాంకుల నుండి ఋణాలు పొందలేక రైతులు ఇబ్బందులు పడుతున్నట్లు ఆయన అన్నారు. మండలంలో పర్యటించిన ప్రతీసారి ఇట్టి సమస్య పరిష్కారానికి రైతుల నుండి ఒత్తిడి వస్తున్నట్లు ఆయన కలెక్టర్ కు తెలిపారు. భూ సమాస్యల పరిష్కారానికి సిసిఎల్ఏ కు వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు కలెక్టర్ కు ప్రభుత్వం పరిష్కార బాధ్యతలు అప్పగించినందున, ప్రత్యేక టీములు ఏర్పాటు చేసి, సర్వే నిర్వహించి, అట్టి భూములను నిషేధిత భూముల జాబితా నుండి తొలగించుటకు చర్యలకై కలెక్టర్ ను కోరారు.
సమస్యపై సానుకూలంగా స్పందించిన కలెక్టర్, జిల్లాకు రాగానే ఇట్టి విషయమై చర్చించడం జరిగిందని, అదనపు కలెక్టర్ కు భూ సమస్య పై పూర్తి అవగాహన ఉందని అన్నారు. మండలంలో ఇప్పటికే 700 మంది ఆన్లైన్ లో దరఖాస్తులు చేసినట్లు, ఏం జరిగింది, ఏలా జరిగింది సమగ్రంగా పరిశీలించి చర్యలు తీసుకుంటామని అన్నారు. 9 గ్రామాలకు గాను, గ్రామాల వారీగా తీసుకొని పరిష్కరిస్తామన్నారు. రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దని కలెక్టర్ తెలిపారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ఏ. భాస్కర్ రావు, జఫర్ గడ్ మండల ప్రజాప్రతినిధులు, రైతులు వున్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి, జనగామచే జారిచేయనైనది.

Share This Post