మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు అధ్యక్షతన జరిగిన జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో విద్యాశాఖ, పంచాయితీరాజ్, రోడ్లు భవనాల ఇంజనీరింగ్ విభాగపు అజెండా అంశముల సమీక్షలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.

: ప్రచురణార్ధం

నవంబరు, 02, ఖమ్మం

జిల్లాలో విద్యా వ్యవస్థను పున: పటిష్టపరిచి విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందించడం. జరుగుచున్నదని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు అధ్యక్షతన జరిగిన జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో విద్యాశాఖ, పంచాయితీరాజ్, రోడ్లు భవనాల ఇంజనీరింగ్ విభాగపు అజెండా అంశముల సమీక్షలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కరోనా వ్యాప్తి నేపథ్యంలో గత ఏడాదిన్నర కాలంగా విద్యా రంగం పూర్తిగా స్తంభించిందని, విద్యార్థులకు ఇకపై మరింత జాప్యం జరుగరాదనే సంకల్పంతో దేశంలోనే మొట్టమొదటి సారిగా మన రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్థల పునః ప్రారంబానికి నిర్ణయం తీసుకొని సెప్టెంబరు 1వ తేదీ నుండి పునః ప్రారంభించుకోవడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో విద్యా రంగం పట్ల ప్రత్యేక దృష్టి సారించి, విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందించేందుకు విద్యార్థులకు మేలు జరిగేలా అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకొని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధనన జరుగుచున్నదని కలెక్టర్ అన్నారు. కరోనా కాలంలో ఆన్లైన్ క్లాస్ల నేపథ్యంలో ప్రైమరీ పాఠశాలల నుండి ఉన్నత పాఠశాలలకు పంపబడిన ఉపాధ్యాయులు తిరిగి ఆయా పాఠశాలలకు పంపడం జరిగిందని, విద్యార్థుల హాజరు నమోదు శాతాన్ని బట్టి ఉపాధ్యాయులను ఆయా పాఠశాలలకు కేటాయించడం జరిగిందన్నారు. గతంలో మాదిరిగా మండల పరిధిలోనే కాకుండా ప్రస్తుతం మండల పరిసర పాఠశాలలకు ఉపాధ్యాయులను తిరిగి కేటాయించడం జరిగిందని, జిల్లాలో ఉపాధ్యాయుల సమస్య లేదని కలెక్టర్ తెలిపారు. పాఠశాలల్లో మౌళిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం శాసనసభ్యుల సి.డి.పి నిధుల నుండి ప్రతి సంవత్సరం 2 కోట్లు. వినియోగించుకునే వెసులు బాటు కల్పించబడిందని జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు గాను ప్రతి సంవత్సరం 10 కోట్ల రూపాయలను సమకూర్చుకొని విద్యాసంస్థలను మరింత బలోపేతం చేసుకునే అవకాశం లభించిందని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. విద్యారంగానికి సంబంధించి మండల, గ్రామస్థాయి సమస్యలపై నిర్దిష్టంగా తెలియపర్చిన యెడల అట్టి సమస్య పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని సభ్యులకు కలెక్టర్ తెలియజేశారు. కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియ గురించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 8 లక్షల 67 వేల మంది మొదటి డోసు, 3 లక్షల 50 వేల మందికి రెండవ డోసు వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్నారని, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితో పాటు మండల, గ్రామ స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ఇది సాధ్యమైందని, ఇంకనూ లక్షా 50 వేల మంది టీకా తీసుకోవాల్సిన వారు ఉన్నారని, ఓటరు జాబితా ప్రకారం ఇంటింటి సర్వే జరిపి కేవలం ఒక నెల వ్యవధిలోనే 2 లక్షల మందికి పైగా టీకా వేయడం జరిగిందని, మొదటి డోసు తీసుకున్నవారికి కాలపరిమితి ప్రకారం రెండవ డోసు, అదేవిధంగా అసలు తీసుకోని వారిని అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు అవగాహన పర్చి జిల్లాలో వందశాతం టీకా ప్రక్రియ పూర్తి చేసేందుకు. ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని కలెక్టర్ కోరారు.

జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు మాట్లాడుతూ మండల పరిషత్ సమావేశాలకు మండలస్థాయి అధికారులు తప్పనిసరిగా హజరయ్యే విధంగా జిల్లా అధికారులు తగు ఆదేశాలు జారీచేయాలని, మండల స్థాయి అధికారులు మండల పరిషత్ సమావేశాలకు హాజరు కాకపోవడం వల్ల మండల స్థాయి సమస్యలను
సమస్యను జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో చర్చించాల్సి వస్తుందని, దీనిపై జిల్లా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. కరోనా ప్రభావం వల్ల మూతపడిన విద్యా సంస్థలను తిరిగి సెప్టెంబరు నుండి పునః ప్రారంభించుకుని ప్రత్యక్ష బోధన జరుగుచున్నదని, విద్యా సంస్థల పునః ప్రారంభం అనంతరం ప్రైమరీ పాఠశాలలో విద్యార్థుల నమోదు సంఖ్య పెరిగిందని గతంలో ప్రైమరీ పాఠశాల ఉపాధ్యాయులను ఉన్నత పాఠశాలలకు కేటాయించిన వారిని తిరిగి ఆయా పాఠశాలలకు నియమించాలని, జిల్లా, మండల విద్యా శాఖాధికారులు సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమీక్షించి జిల్లాలో ఎక్కడా కూడా ఉపాధ్యాయుల సమస్య లేకుండా తగు చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్ చైర్మన్ జిల్లా విద్యాశాఖాధికారికి సూచించారు. విద్యాశాఖ అజెండా సందర్భంగా జిల్లా విద్యాశాఖాధికారి విద్యాశాఖ నివేదికను సమర్పిస్తూ జిల్లాలో ప్రత్యక్ష తరగతుల బోధన జరుగుచున్నదని, జిల్లాలో బోధనేతర సిబ్బంది, ఉపాధ్యాయులు 11600 మందికి కోవిడ్ టీకా వేయించడం జరిగిందని, ప్రస్తుత విద్యా సంవత్సరానికి 80,974 మంది విద్యార్థులకు 5 లక్షల 73 వేల ఉచిత పాఠ్యపుస్తకాలను అందించడం జరిగిందని, 14 కె.జి.బి.విలలో 4300 మంది విద్యార్థినీలకు విద్యాబోధన జరుగుచున్నదని, ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఇప్పటివరకు 18,207 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరినారని జిల్లా విద్యాశాఖాధికారి వివరించారు. అదేవిధంగా రఘునాథపాలెం మండలం పువ్వాడ నగర్, వైయస్సార్ నగర్, ఖమ్మం అర్బన్ మండలం టేకుల పల్లి ఆవాస ప్రాంతాలలో పాఠశాలలు లేని కారణంగా నూతనంగా పాఠశాలలు ప్రారంభించడానికి ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు జిల్లా విద్యా శాఖాధికారి తెలిపారు. మధ్యాహ్న భోజన పథకం కింద విద్యార్థులకు మెన్యూ ప్రకారం పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని ఆయన తెలిపారు. పంచాయితీరాజ్ ఇంజనీరింగ్ విభాగపు అజెండా సమీక్ష సందర్భంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు జిల్లాలో చేపట్టిన పనుల పురోగతిని వివరిస్తూ ఉపాధి హామీ పథకం కింద 388 వైకుంఠధామాలు, 129 రైతువేధికలు, 586 సి.సి.రోడ్లు, పి.ఎం.జి. ఎస్.వై కింద 12 రహదారులు, జిల్లా పరిషత్ సాధారణ నియోజకవర్గ అభివృద్ధి నిధులతో 1081 అభివృద్ధి పనులు ఇతర పథకాల కింది 151 పనులు, రహదారుల పనుల్లో భాగంగా 982 పనులు చేపట్టినట్లు తెలిపారు. దీనితోపాటు రెండు పడకగదుల నిర్మాణం, జాతీయ ఆరోగ్యమిషన్, డి.ఎం.ఎఫ్ నిధులు స్పెషల్ డెవలప్మెంట్ పథకాల కింద జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను పంచాయితీరాజ్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు వివరించారు. అదేవిధంగా రోడ్లు భవనాల శాఖ ద్వారా జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిని ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు వివరించారు. వైరా, కల్లూరు, తల్లాడ, పెనుబల్లి, రఘునాథపాలెం, బోనకల్, కొణిజర్ల, ముదిగొండ, తిర్మలాయపాలెం జడ్పీటిసి సభ్యులతో పాటు ఇతర సభ్యులు ఎం.పి.పిలు తమ మండల పరిధిలో గల విద్యారంగం సమస్యలు అదేవిధంగా రహదారుల సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చి సత్వర పరిష్కారానికై కోరారు.

డి.సి.ఎం.ఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి అప్పారావు, జిల్లా విద్యాశాఖాధికారి యాదయ్య, పంచాయితీరాజ్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు చంద్రమౌళి, రోడ్లు భవనాల శాఖ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు శ్యాంప్రసాద్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా॥మాలతీ, జిల్లా బి.సి సంక్షేమ శాఖాధికారి జ్యోతి, మిషన్ భగీరథ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు డి. పుష్పలత, జడ్పీ, టి.సిలు, ఎం.పి.పిలు, సంబంధిత శాఖల జిల్లా అధికారులు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

Share This Post