మంచినీటి చేపల ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రానికి ఉత్తమ అవార్డ్ లభించింది.

మంచినీటి చేపల ఉత్పత్తిలో తెలంగాణ కు ఉత్తమ అవార్డ్

ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా అవార్డ్ ను అందజేసిన కేంద్రమంత్రి

ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ తోనే మత్స్య రంగం అభివృద్ధి సాధ్యమైంది… మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

మంచినీటి చేపల ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రానికి ఉత్తమ అవార్డ్ లభించింది. ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా ఆదివారం భువనేశ్వర్ లో NFDB ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో  కేంద్రమంత్రి పురుషోత్తం రూపాలా చేతుల మీదుగా రాష్ట్ర పశుసంవర్ధక కార్యదర్శి అనిత రాజేంద్ర, మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా లు అవార్డ్ ను అందుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రత్యేక చొరవతో లక్షలాది మంది ఉపాధి పొందుతున్న మత్స్య రంగ అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా దేశంలో ఎక్కడా లేని విధంగా అన్ని నీటి వనరులలో ఉచితంగా చేప పిల్లలను విడుదల చేయడం జరుగుతుంది. 2014-15 సంవత్సరంలో రాష్ట్రంలో 2.27 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి ఉండగా, ప్రస్తుతం 3.37 లక్షల టన్నులకు చేపల ఉత్పత్తి పెరిగింది. 7 సంవత్సరాలలో సుమారు 1.50 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి అధికంగా పెరిగింది. రాష్ట్రంలో నూతన ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టడం వలన నీటి వనరులు కూడా విస్తారంగా పెరిగాయి. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ని అన్ని నీటి వనరులలో ఉచితంగా చేప పిల్లలను విడుదల చేయడం వల్లనే మత్స్య సంపద భారీగా పెరిగింది. అంతేకాకుండా దేశంలోనే ఉచితంగా రొయ్య పిల్లలను విడుదల చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. వినియోగదారులకు చేపలను అందుబాటులోకి తీసుకొచ్చే లక్ష్యంతో 150 రిటైల్ మొబైల్ ఫిష్ ఔట్ లెట్ లను ప్రారంభించుకున్న ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంకే దక్కుతుంది. రాష్ట్రంలోని నీటి నిల్వలను సమీక్షించేందుకు గాను 30 వేల నీటి వనరులకు జియో ట్యాగింగ్ చేసిన మొట్ట మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. అత్యధిక చేపల పేపకం దారుల సొసైటీలు తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయి. రాష్ట్రంలో అనువుగా ఉన్న నీటి వనరులలో 300 కోట్ల వ్యయంతో అంతర్జాతీయ సంస్థ సహకారంతో 500 కేజ్ కల్చర్ విధానంలో చేపల పెంపకం చేపట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

మత్స్యకారుల అభివృద్దే లక్ష్యం… తలసాని

మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలనే ముఖ్యమంత్రి KCR సంకల్పంతో నే రాష్ట్ర ప్రభుత్వం మత్స్య రంగం అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాష్ట్రంలో ని అన్ని నీటి వనరుల లో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు చేప పిల్లలను విడుదల చేస్తున్నట్లు చెప్పారు. సహజ నీటి వనరులలో పెరుగుతున్న తెలంగాణ చేపలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎంతో డిమాండ్ ఉంది. మత్స్య రంగం అభివృద్ధి కి అన్ని విధాలుగా సహకరించి ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ శాఖలోని అన్ని స్థాయిలలోని అధికారులు, సిబ్బంది కృషి వల్లనే ఈ అవార్డ్ లభించిందని మంత్రి అభినందించారు.

Share This Post