స్థానిక సంస్థల, శాసన మండలి ఎన్నికల నిర్వహణలో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని మంచిర్యాల జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డా॥ శశాంక్ గోయల్ తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి, జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్, రామగుండం కమీషనర్ ఆఫ్ పోలీస్ ఎస్. చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉదయం 8 గం॥లకు ప్రారంభించడం జరిగిందని, కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటుతో పాటు నిర్వహణకు అవసరమైన అధికారులు, సిబ్బందిని నియమించడం జరిగిందని తెలిపారు. ఓటు హక్కు గల ప్రతి ఒక్కరు తమ ఓటును వినియోగించుకోవాలని, ఎన్నికలకు సంబంధించి ప్రతి విషయంపై అప్రమత్తంగా ఉండాలని, పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 4 గం॥లకు ముగిసిన తరువాత బ్యాలెట్ బ్యాక్స్‌లను సీల్ చేసి స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రం నుండి వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేయడం జరిగిందని, గుర్తింపు కార్జ్డు ఉన్న వారిని మాత్రమే పోలింగ్ కేంద్రంలోనికి అనుమతించేలా సిబ్బందికి ముందస్తుగా సూచించడం జరిగిందని తెలిపారు. పోలింగ్ కేంద్రం ఆవరణలో ఓటర్లకు కొవిడ్ నిబంధనల మేరకు చేతి తొడుగులు, మాస్క్‌లు, శానిటైజర్ ఏర్పాట్లను పరిశీలనతో పాటు పోలింగ్ కేంద్రంలో ఓటరు స్లిప్‌లు, ఓటింగ్ శాతం, వెబ్ కాస్టింగ్ నిర్వహణను పరిశీలించి అధికారులు, సిబ్బందికి తగు సూచనలు చేశారు. అనంతరం బెల్లంపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి, జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్‌తో కలిసి సందర్శించి ఎన్నికల నిర్వహణ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా మంచిర్యాల జిల్లాలో మంచిర్యాల, బెల్లంపల్లి కేంద్రాలుగా పోలింగ్ నిర్వహించడం జరిగిందని, మంచిర్యాల పోలింగ్ కేంద్రంలో 208 మంది ఓటర్లు ఉండగా 171 మంది ఓటు హక్కు వినియోగించుకొని 82.21 పోలింగ్ జరుగగా, బెల్లంపల్లిలో 88 మంది ఓటర్లు ఉండగా 76 మంది ఓటు హక్కు వినియోగించుకోగా 86. 36 శాతం ఓటర్లు పోలయ్యాయని తెలిపారు. పోలింగ్ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్స్‌లను ఏజెంట్ల సమక్షంలో సీల్ చేసి స్ట్రాంగ్ రూముకు తరలించినట్లు తెలిపారు.
మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.