మండలి ఎన్నికలకు పోలింగ్ కేంద్రాల గుర్తింపు – జిల్లా ఎన్నికల అధికారి హరీష్

మండలి ఎన్నికలకు పోలింగ్ కేంద్రాల గుర్తింపు  – జిల్లా ఎన్నికల అధికారి హరీష్

ఈ నెల 16 న శాసన మండలికి నోటిఫికేషన్ వెలువడే నాటి నుండి ఎన్నికల ప్రక్రియ ముగిసే డిసెంబర్ 16 వరకు ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, సజావుగా, పారదర్శకంగా నిర్వహించుటకు అన్ని రాజకీయ పార్టీలు జిల్లా యంత్రాంగానికి సహకరించవలసినదిగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్.హరీష్ కోరారు. శుక్రవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణా స్థానిక సంస్థలకు సంబంధించి మెదక్ శాసనమండలికి ద్వైవార్షిక ఎన్నికల సందర్భంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో పోలింగ్ కేంద్రాల ఏర్పాటు పై అభిప్రాయాలను తెలుసుకున్నారు. శాసనమండలికి ఉమ్మడి మెదక్ జిల్లాలో జిల్లా ప్రాదేశిక సభ్యులు, మండల ప్రాదేశిక సభ్యులు, మునిసిపల్ కౌన్సిలర్లు ఓటర్లుగా ఉంటారని, కాగా మొత్తం 1,062 ఓటర్లకు గాను 47 ఖాళీలు పోగా 1,015 మంది ఓటర్లు ఉన్నారని అన్నారు. మెదక్ జిల్లాలో 279, సిద్ధిపేట లో 258 మంది కాగా సంగారెడ్డి జిల్లా నుండి 478 మంది ఓటీర్లు ఉన్నారని కలెక్టర్ ప్రజాప్రథినిధులకు వివరించారు. ఓటర్ల జాబితా ను పరిశీలించుటకు అదనపు కలెక్టర్ రమేష్ ను ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారిగా ఎన్నికల కమీషన్ నియమించిందని, వీరు ఓటర్ల ముసాయిదా జాబితాను ఈ నెల 15 న ప్రకటిస్తారని, దీనిపై ఈ నెల 20- వరకు అభ్యంతరాలు ,క్లైమ్స్ స్వీకరించి, 21,22 తేదీలలో స్క్రూటినీ చేసి 23 న తుది జాబిజితా ప్రకటిస్తారని కలెక్టర్ వివరించారు.
మండలి ఎన్నికలకు సంబంధించి ఈ నెల 16 న నోటిఫికేషన్ విడుదల అవుతుందని, 16 నుండి 23 వరకు నామినేషన్లు స్వీకరిస్తారని, 24 న నామినేషన్ల పరిశీలన, 26 లోపు ఉపసంహరణ ఉంటుందని అన్నారు. డిసెంబర్ 10 న పోలింగ్ కు సంగారెడ్డి లో టి.యెన్.జి.ఓ. భవనం, మెదక్ లో ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం, సిద్దిపేట లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనాన్ని పోలింగ్ కేంద్రాలుగా ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. అదేవిధంగా డిసెంబర్ 14 న మెదక్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కౌంటింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. బ్యాలట్ పేపర్ ఆధారంగా ఎన్నికలు జరుగుతాయని అన్నారు.
కరోనా నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు భారత ఎన్నికల కమీషన్ జారీచేసిన మార్గదర్శాకలకు తు.చ.తప్పక పాటించాలని కోరారు. ఉదయం 10 నుండి రాత్రి10 గంటల వరకు ప్రచారం నిర్వహించాలని, అంతర్గత సమావేశాలకు 200 మంది, బహిరంగ ప్రదేశాలకు 500 కంటే అధికంగా ప్రజలు హాజరు కావద్దని, బైక్ ర్యాలీ, కార్ల ర్యాలీలకు అనుమతి లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నామని, సభలు, సమావేశాలకు ఇక్కడి నుండి ముందస్తుగా అనుమతి తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. అభ్యర్థులు ఖర్చులకు సంబంధించి కొత్తగా తీసిన బ్యాంకు ఖాతా నెంబర్ ఇవ్వాలని,అట్టి ఒకే ఖాతా ద్వారా ఎన్నికలకు సంబంధించి ఖర్చులు చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రమేష్, టి.ఆర్.ఎస్.పార్టీ నుండి దేవేందర్ రెడ్డి, బి.జె.పి నుండి ఉదయ్ కిరణ్, సి.పి .ఐ. నుండి జిల్లా కార్యదర్శి ఖాలిక్, బి.ఎస్.పి నుండి నాగరాజు, స్వీప్ నోడల్ అధికారి రాజిరెడ్డి, మైన్స్ సహాయ సంచాలకులు జయరాజ్, డి.ఎస్.ఓ. శ్రీనివాస్, బి.సి. సంక్షేమాధికారి జగదీశ్ , పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ కృష్ణ మూర్తి, ఆర్.డి.ఓ. సాయి రామ్, కలెక్టరేట్ ఏ.ఓ. యూనుస్, తదితరులు పాల్గొన్నారు.

Share This Post