మండల ప్రత్యేక అధికారులు ప్రతి శుక్రవారం మండల పర్యటనల్లో గుర్తించిన సమస్యలు, పరిష్కారంపై నివేదికలు అందచేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు.

సోమవారం కలెక్టరేట్ సమావేశపు హాలులో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని వివిధ మండలాల నుండి వచ్చిన ప్రజల నుండి సమస్యల యొక్క దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి శుక్రవారం మండల ప్రత్యేక అధికారులు వారికి కేటాయించిన మండలాల్లో క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహించి, నోట్క్యామ్ యాప్ ద్వారా తీసిన ఫోటోలను పంపాలని చెప్పారు. అధికారుల పర్యటనలకు సంబంధించిన హాజరు వివరాలను అందచేయాలని డిపిఓకు సూచించారు. గైర్హాజదైన అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండలంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు పర్యవేక్షణ చేసేందుకు ప్రత్యేక అధికారులుగా జిల్లా అధికారులను నియమించడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. సమస్య పరిష్కరించాలని ప్రజలు అందచేసిన వినతులు కొన్ని: కొత్తగూడెం మండలం, గాజురాజం బస్తీ, విశ్వనాధకాలనీకి చెందిన యం సురేష్ బాబుతో పాటు మరికొందరు విశ్వనాధ కాలనీలో మురుగునీరు పోవుటకు కాలువలు లేక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నామని, సమస్యను పరిష్కరించాలని చేసిన ధరఖాస్తును తగు చర్యలు నిమిత్తం కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్‌కు ఎండార్స్ చేశారు. చర్ల మండలం, రైస్‌పేట గ్రామస్థులు జనావాసాల మద్య ప్రభుత్వ అనుమతి లేకుండా మద్యం దుకాణాన్ని నిర్వహిస్తున్నారని, ఈ మద్యం దుకాణం నిర్వహణ వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నామని దుకాణాన్ని తొలగించాలని చేసిన దరఖాస్తును ఎక్సైజ్ సూపరింటెండెంట్‌కు తగు చర్యలు నిమిత్తం ఎండార్స్ చేశారు. భద్రాచలం పట్టణానికి చెందిన మడకం రాజమ్మ తన భర్త మరణించి 10 సంవత్సరాలు అయ్యిందని, కావున తనకు చితంతు పింఛను మంజూరు చేయాలని చేసిన దరఖాస్తును తగు చర్యలు నిమిత్తం డిఆర్డిఓకు ఎండార్స్ చేశారు. జూలూరుపాడు గ్రామం, కొమ్ముగూడెం గ్రామానికి చెందిన భూక్యా అమ్మి సర్వే నెం. 122/ఇ పేరున ఉన్న భూమిని ఇతరుల పేరున పట్టాదారు పాసుపుస్తకం జారీ చేశారని, విచారణ నిర్వహించి ఇతరుల పేరున జారీ చేసిన పట్టా పుస్తకాన్ని రద్దు చేసి తనకు పట్టా ఇప్పించాలని దరఖాస్తు చేయగా తగు చర్యల నిమిత్తం కలెక్టరేట్ సెక్షన్ సిబ్బందికి ఎండార్స్ చేశారు. బూర్గంపాడు మండలం, ముసలిమడుగు గ్రామానికి చెందిన మహమ్మద్ సాధిక్ తన ఇల్లు కూలిపోయిందని, తనకు పరిహారంతో పాటు నూతన ఇల్లు మంజూరు చేయాల్సిందిగా చేసిన దరఖాస్తును పరిశీలించిన జిల్లా కలెక్టర్ సాధిక్‌కు పరిహారం ఇప్పించు విధంగా చర్యలు తీసుకోవాలని డిఆర్ కు సూచించారు. సుజాతనగర్ మండలం, గరీబుపేట గ్రామానికి చెందిన లావుడ్యా విజయలక్ష్మి కిరాణషాపు ఏర్పాటు చేసుకునేందుకు 2 లక్షల రూపాయలు రుణం మంజూరుచేయాలని దరకాస్తు చేసుకున్నానని. తనకు రుణం మంజూరు చేయాలని చేసిన దరఖాస్తును ఐటిడిఏ ద్వారా రుణం మంజూరు చేయాలని ఐటిడిఏ ఎస్ఓకు సిఫారసు చేశారు. పినపాక మండలం, సాంబాయిగూడెం గ్రామానికి చెందిన ఎస్కే యాకూబ్ బీ సర్వే నెం. 1109లో గల భూమిని బిటిపిఎస్ నిర్మాణంలో కోల్పోయానని, తనకు ఉద్యోగ అవకాశం కానీ, పరిహారం కానీ ఇంతవరకు చెల్లించలేదని, ఇట్టి భూమిని తాను ఎస్కే భాషుమియా వద్ద 2012 సంవత్సరంలో కొనుగోలు చేశానని, పరిహారపు చెక్కు అతని పేరున జారీ చేసి యున్నారని, ఎంజాయ్మెంట్ సర్వేలో తన యాకూబ్ బీ పేరు నమోదై ఉన్నందున విచారణ నిర్వహించి పరిహారపు చెక్కును తనకు అందచేయాలని దరఖాస్తు చేశారు.. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డిఆర్డిఓ అశోకచక్రవర్తి, డిఆర్డిఓ మధుసూదన్ రాజు సీఈఓ విద్యాలత, డిపిఓ రమాకాంత్, ర.భ. ఈఈ భీంమ్లా, డిఎస్ చంద్రప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post