మద్యం దుకాణాల టెండర్ ప్రక్రియ తుది గడువు దగ్గర పడటంతో దరఖాస్తుల ప్రక్రియ ఊపందుకుందని నాగర్ కర్నూల్ జిల్లా ఎక్సైజ్ సూపరిండెంట్ దత్తురాజ్ గౌడ్ అన్నారు. సోమవారం టెండర్ల స్వీకరణ సందర్బంగా ఆయన మాట్లాడారు. నాగర్ కర్నూల్ జిల్లాలోని మొత్తం 67 షాపులకు గాను ఈ ఒక్క రోజే 131 దరఖాస్తులు వచ్చాయని అంతకు ముందు 27 దరఖాస్తులు వచ్చాయన్నారు. వెరసి మొత్తం 158 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. ఎస్సి ఎస్టీలకు కేటాయించిన షాపులకు దరఖాస్తు చేసుకోడానికి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత జారీ చేసిన కుల ధ్రువీకరణ పత్రము మాత్రమే ఇవ్వాలని నిబంధన ఉండగా నేడు అట్టి నిబంధనను సడలించినట్లు తెలిపారు. ప్రస్తుతం దరఖాస్తు చేసుకునేందుకు మా వద్ద ఉన్న అండర్ టేకింగ్ ప్రొఫార్మతో ఫారఖాస్తు చేసుకోవచ్చని, నవంబర్, 29 లోగా కుల ధ్రువీకరణ పత్రం అందజేసే అవకాశం కల్పించడం జరిగిందన్నారు. అదే విధంగా ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ షాపులకు దరఖాస్తు చేసుకోవచ్చని, లాటరీలో ఎన్ని షాపులకు వస్తే అన్ని షాపులు ఒక్కరికే కేటాయించడం జరుగుతుందని తెలిపారు. ఈ నెల 18 తో టెండర్ ప్రక్రియ ముగుస్తున్నందున మరిన్ని టెండర్లు వచ్చే అవకాశం ఉందని తెలియజేసారు. ఆసక్తి ఉన్న వారు గదువులోపల దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొన్నారు.