మనసుపెట్టి మండల అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు అంకితభావంతో పనిచేయాలి — జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య.

* ప్రచురణార్థం *
జయశంకర్ భూపాలపల్లి జూలై 29 (గురువారం).

మనసుపెట్టి మండల అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు అంకితభావంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ టేకుమట్ల మండల కేంద్రంలోని రైతువేదికలో ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశం నిర్వహించి మండలంలో చేపట్టిన పల్లెప్రగతి పనులు మరియు ఇతర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు పై సమీక్షించారు. ఈ సందర్భంగా మండల వ్యాప్తంగా వివిధ గ్రామాల్లో పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా సాధించిన ప్రగతిని మరియు ఆయా గ్రామాల్లో పెండింగ్లో ఉన్న వివిధ సమస్యల గురించి సర్పంచులు మరియు ఎంపీపీ,జడ్పిటిసి కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా పల్లెలు అద్భుతమైన ప్రగతిని సాధించాయని ఈ కార్యక్రమం ద్వారా నిర్మించిన వైకుంఠధామాలు, చెత్త డంపింగ్ యార్డులు, షెగ్రిగేషన్ షెడ్లు, రైతువేదికలు, పల్లెప్రకృతి వనాలు తదితర వాటిని గ్రామాల ఆస్తులుగా భావించి వాటిని గ్రామాల అభివృద్ధికి సద్వినియోగం చేసుకోవాలని అదే విధంగా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పెండింగ్లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేసుకోవాలన్నారు. మారుమూల ప్రాంతంలో ఉన్న ఈ మండలంలో పేద ప్రజలకు మెరుగైన ప్రభుత్వ వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో వైద్య అధికారిని నియమించడం జరిగిందని అన్నారు. 500 కన్నా తక్కువ జనాభా ఉన్న కొత్త గ్రామపంచాయతీలలో ట్రాక్టర్లు, ట్రాలీల కొనుగోలుకు జిల్లా కలెక్టర్ ద్వారా అందించిన నిధులలో 60 శాతం మాత్రమే వాపస్ తీసుకుంటామని హామీ ఇచ్చారు. అంతకన్నా చిన్న గ్రామాలలో నిధులు తక్కువ ఉంటాయి కాబట్టి ఆయా గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని అన్నారు. టేకుమట్ల రైతువేదికకు రోడ్డును నిర్మించుటకు 5 లక్షల రూపాయలను మంజూరు చేస్తానని, రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లాల అభివృద్ధిలో వాడుకొనుటకు కలెక్టర్లకు మంజూరు చేసిన నిధుల నుంచి మండలానికి 10 లక్షల రూపాయల నిధులను మండల ప్రత్యేక అధికారి ద్వారా అందిస్తానని, జిల్లా ఆస్పిరేషనల్ జిల్లాల జాబితాలో ఉన్నందున నీతిఅయోగ్ మరియు వివిధ స్వచ్ఛంద సంస్థల ద్వారా అందించే నిధుల నుంచి మండల అభివృద్ధికి చర్యలు చేపడతానని అన్నారు.
ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ పురుషోత్తం, ఎంపీపీ మల్లారెడ్డి, జడ్పిటిసి పులి తిరుపతిరెడ్డి, ఎంపీడీవో చండీరాణి, తాసిల్దార్ షరీఫ్, ఏపీఓ మాధవి, ఎంపిఎం రాంప్రసాద్, విద్యుత్ శాఖ ఎఇ, అన్ని గ్రామాల సర్పంచులు, పంచాయితీ కార్యదర్శులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

అనంతరం వెలిశాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి ఆస్పత్రిలో ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలపై వైద్యాధికారి డాక్టర్ కే. రాజు తో సమీక్షించి వర్షాకాలం వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ముందస్తుగా గ్రామాలలో ప్రజలకు పారిశుధ్యంపై అవగాహన కల్పించాలని అదేవిధంగా అత్యవసరమైన అన్ని రకాల మందులను ఆస్పత్రిలో సిద్ధంగా ఉంచుకోవాలని, ఆసుపత్రి సిబ్బంది నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి అవసరమైన అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి మెరుగైన వైద్యం అందించాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చూడాలని ఆదేశించారు.

——————————————————————————————

డిపిఆర్ఓ జయశంకర్ భూపాలపల్లి జిల్లా గారిచే జారీ చేయడమైనది.

Share This Post