మన ఆరోగ్యం మన చేతుల్లోనే :: రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

ప్రచురణార్థం

ఖమ్మం, ఆగస్టు 5:

మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని, సీజనల్ వ్యాధుల నియంత్రణ ప్రతి ఒక్కరి బాధ్యత అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఫ్రైడే- డ్రైడే కార్యక్రమంలో భాగంగా ఖమ్మం కార్పోరేషన్ 20వ డివిజన్ కృష్ణా నగర్ నందు మంత్రి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, నగర మేయర్ పునుకొల్లు నీరజ లతో కలిసి పర్యటించి, పలు ఇళ్ళలోకి వెళ్ళి సీజనల్ వ్యాధుల నియంత్రణపై అవగాహన కల్పించారు. ఆయా గృహల్లోని కుండీలు, గాబులు, డ్రమ్ములు, నీటి తొట్టి, మేడ మీద ఉన్న కూరగాయల పాదులను పరిశీలించి, ప్లాస్టిక్ సామగ్రిని తనిఖీ చేసి నీరు నిల్వ ఉండకూడదని, నిల్వ నీటితో డెంగ్యూ దోమలు వృద్ధి చెందుతాయని అవగాహన కల్పించారు. గృహ యజమానులతో కలిసి పలు కుండీలలో నీరు తొలగించి శుభ్రం చేశారు. ఇళ్ళ మధ్య గల ఖాళీ స్థలాల్లో మురుగు నీరు, వర్షం నీరు చేరడంతో ఆయా స్థల యజమానులకు సమాచారం ఇచ్చి ఆయా స్థలం బాగు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులకు సూచనలు చేశారు. అనంతరం మురుగు కాల్వలు, ఖాళీ స్థలాల్లో నీరు నిల్వ ఉన్న ప్రాంతాలలో ఆయిల్ బాల్స్ వదిలారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈ కాలంలో విష జ్వరాలు వేగంగా వ్యాప్తి చెందుతుందని, ముఖ్యంగా ముందు దోమల బెడద లేకుండా చూసుకోవాలని ప్రజలను కోరారు. ఇళ్ళలో నుండి ఉత్పన్నమయ్యే చెత్తతోనే దోమలు వస్తాయని, నీరు నిల్వ ఉండడం వల్ల దోమలను మనమే పెంచి పోషించి విష జ్వరాలకు కారణమవుతామని వివరించారు. ఇళ్లల్లో ఎవరికైనా జ్వరం వస్తే తేలికగా తీసుకోవొద్దని వెంటనే వైద్యులను సంప్రదించాలని ఆయన అన్నారు. విష జ్వరాలు ఆగస్ట్ నెలలో అత్యంత వేగంగా ప్రబలే ప్రమాదం ఉందని, వైద్య సిబ్బంది, జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా వుంటూ, మండల, గ్రామ స్థాయిలలో ప్రజలకు అవగాహన కల్పించాలని మంత్రి పువ్వాడ అధికారులను ఆదేశించారు. ప్రతి శుక్రవారం ఫ్రైడే ను డ్రై డే గా పాటించాలని, విష జ్వరాలు ప్రబలకుండా చర్యలు చేపట్టాలన్నారు. గ్రామాల్లో మురుగునీటి కాలువల్లో పూడిక ఉంటే తక్షణమే తొలగించాలని, తాగునీటి ట్యాంకుల పైప్ లైన్లు లీకేజీలు ఉంటే తక్షణమే నియంత్రించాలన్నారు. ముఖ్యంగా నగరాల్లో, పట్టణాల్లోని హోటల్స్, ఫంక్షన్ హాల్స్, హాస్పిటల్స్, సినిమా హాల్స్, కిరాణా, కాఫీ షాప్స్, ఇతర దుకాణాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఏ విధమైన దుకాణాలు, యజమన్యాలు పరిశుభ్రత చర్యలు పాటించకపోతే యజమానులకు జరిమానా విధించాలని ఆయన తెలిపారు. సీజనల్ వ్యాధులు రాకుండా అంగన్వాడి, ఆశ, ఆరోగ్య కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారు, ఆరు నెలలు దాటినట్లయితే, బూస్టర్ డోస్ తీసుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహార, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, కార్పొరేటర్లు కమర్తపు మురళి, ప్రశాంతి లక్ష్మి, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ మల్లేశ్వరి, జిల్లా వైద్య, ఆరోగ్యాధికారిని డా. మాలతీ, జిల్లా మలేరియా అధికారిణి డా. సంధ్య, వైద్యాధికారి డా. సౌమ్య తదితరులు పాల్గొన్నారు.

Share This Post