మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని ఒక యజ్ఞం వలె చేపట్టి పాఠశాలలు పునఃప్రారంభం అయ్యే నాటికి సకల సౌకర్యాలతో సిద్ధం అయ్యే విధంగా పనులు చేపట్టాలని రాష్ట్ర విద్య శాఖ మంత్రి సబితా రెడ్డి రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు కలెక్టర్లకు సూచించారు.

మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని ఒక యజ్ఞం వలె చేపట్టి పాఠశాలలు పునఃప్రారంభం అయ్యే నాటికి సకల సౌకర్యాలతో సిద్ధం అయ్యే విధంగా పనులు చేపట్టాలని రాష్ట్ర విద్య శాఖ మంత్రి సబితా రెడ్డి రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు కలెక్టర్లకు సూచించారు.

సోమవారం జిల్లా కలెక్టర్లతో మన ఊరు-మన బడి కార్యక్రమం పై రాష్ట్ర విద్య శాఖ మంత్రి సబితా రెడ్డి రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మన బడి కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులును భాగస్వాములను చేసి ఒక యజ్ఞం లాగ, ఒక పండగ లాగ చేపట్టి పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి పూర్తి చేయాలన్నారు. చేపడుతున్న పనులను జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ప్రత్యేక అధికారులు స్వయంగా పర్యవేక్షించి పనులు వేగవంతంగా పూర్తి చేయించాలన్నారు.
నాడు నేడు అన్నట్లుగా మరమ్మతులు చేయక ముందు మరమ్మతులు పూర్తి అయ్యాక పాఠశాల ఫోటోలు, వీడియోలు తీయించి సోషల్ మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచారం నిర్వహించాల్సిందిగా సూచించారు. నిధులకు ఎలాంటి కొరత లేదని పని అయ్యేకొద్ది నిధులు విడుదల చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికే కలెక్టర్లకు అడ్వాన్స్ మంజూరు చేయడం జరిగిందన్నారు. డైనింగ్ హాల్ ఎక్కువ ఆర్భాటంగా కాకుండా కవర్డ్ షెడ్ ఏర్పాటు చేయాలని సూచించారు. అదేవిధంగా అనవసరంగా కూలగొట్టి కొత్తగా కట్టాల్సిన అవసరంలేదని, అవసరమైన మేరకు మాత్రమే మరమ్మతులు, నిర్మాణం చేయించాలన్నారు. అవసరమైన చోట అద్దే భవనాల్లో ఉన్న అంగన్వాడీ కేంద్రాలను పాఠశాల భవనాలకు మార్చాలని సూచించారు.
విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతలో 9123 పాఠశాలలను ఆధునీకరించి మౌళిక సదుపాయాలు కల్పించేందుకు నిర్ణయించడం జరిగిందని తెలిపారు. వాటన్నింటికి త్వరగా అంచనాలు సిద్ధం చేసి పనులు ప్రారంభించాలన్నారు. పాఠశాలలు ప్రస్తుతం సెలవు ఉన్నందున త్వరగా పనులు చేపట్టి పాఠశాలలు పునఃప్రారంభం అయ్యేనాటికి సిద్జం చేయాలని ఆదేశించారు. చేపడుతున్న పనులకు అంచనాలు వేయించి పరిపాలన అనుమతులు మంజూరు చేయాలన్నారు. 30 లక్షల అంచనా వరకు ఉన్న వాటిని వెంటనే పనులు ప్రారంభించాలని, అంతకుమించి అంచనాలు ఉంటే వారం లోపల టెండర్లు పిలిచి పనులు అప్పగించాలన్నారు. ఫర్నిచర్ ఇతర సదుపాయాల కొరకు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే నమూనాతో తయారు చేయించి పంపడం జరుగుతుందన్నారు. అదేవిధంగా మండుటెండల్లో ఇంటర్, పదవ తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నందున తగిన జాగ్రత్తలు తీసుకొని పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు.
ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మాట్లాడుతూ మరమ్మత్తులు చేయించాల్సిన పాఠశాలలల్లో ఇప్పటి వరకు పరిపాలన అనుమతులు ఇవ్వడంలో జిల్లాలు వెనుకబడి ఉన్నాయని, ఈ నెల 10వ తేదీ వరకు వంద శాతం పరిపాలన అనుమతులు పూర్తి చేయాల్సిందిగా కలెక్టర్లను ఆదేశించారు. పనులు త్వరగా ప్రారంభించి పూర్తి చేయించాలని, నాణ్యతలో లోటు లేకుండా పర్యవేక్షణ చేయాల్సిందిగా సూచించారు. ప్రతి మండలానికి ప్రత్యేక అధికారిని నియమించి పనులు సజావుగా జరిగే విధంగా చూడాలన్నారు.
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆమోయ్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో మొదటి విడతలో గుర్తించిన 464 పాఠశాలకు పరిపాలన అనుమతులు ఇచ్చి పనులు సకాలంలో పూర్తి చేసేవిధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం ద్వారా ఇచ్చిన సూచనలు అన్ని పాటించి పాఠశాలలో పునఃప్రారంభం అయ్యేలోగా పూర్తి చేస్తామని తెలియజేసారు.
ఈ వీడియో కాన్ఫెరెన్స్ లో ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానీయ, రంగారెడ్డి జిల్లా నుండి అదనపు కలెక్టర్ ప్రతిక్ జైన్, . జిల్లా విద్యా శాఖధికారి సూసిందర్ రావు, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి స్వరాజ్య లక్ష్మి ఇంజనీరింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post