మన ఊరు మన బడి కార్యక్రమాన్ని ఒక యజ్ఞం వలె చేపట్టి పాఠశాలలు పునప్రారంభం అయ్యే నాటికి సకల సౌకర్యాలతో సిద్ధం అయ్యే విధంగా పనులు చేపట్టాలి – రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు

మన ఊరు మన బడి కార్యక్రమాన్ని ఒక యజ్ఞం వలె చేపట్టి పాఠశాలలు పునప్రారంభం అయ్యే నాటికి సకల సౌకర్యాలతో సిద్ధం అయ్యే విధంగా పనులు చేపట్టాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు కలెక్టర్లకు పిలుపునిచ్చారు. సోమవారం సాయంత్రం హైద్రాబాద్ నుండి జిల్లా కలెక్టర్లతో మన ఊరు మన బడి కార్యక్రమం పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులును భాగస్వాములను చేసి ఒక యజ్ఞం లాగ, ఒక పండగ లాగ చేపట్టి పాఠశాలలు ప్రారంభమయ్యేనాటికి పూర్తి చేయాలన్నారు. చేపడుతున్న పనులను జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ప్రత్యేక అధికారులు స్వయంగా పర్యవేక్షించి పనులు వేగవంతంగా పూర్తి చేయించాలన్నారు. నాడు నేడు అన్నట్లుగా మరమ్మతులు చేయక ముందు మరమ్మతులు పూర్తి అయ్యాక పాటశాల ఫోటోలు వీడియోలు తీయించి సోషల్ మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా లో ప్రచారం నిర్వహించాల్సిందిగా సూచించారు. నిధులకు ఎలాంటి కొరత లేదని పని అయ్యేకొద్ది నిధులు విడుదల చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికే కలెక్టర్లకు అడ్వాన్స్ మంజూరు చేయడం జరిగిందన్నారు. డైనింగ్ హాల్ కు ఎక్కువ ఆర్భాటంగా కాకుండా కవర్డ్ షెడ్ ఏర్పాటు చేయాలని సూచించారు. అదేవిధంగా అనవసరంగా కూలగొట్టి కొత్తగా కట్టాల్సిన అవసరం లేదని అవసరమైన మేరకు మాత్రమే మరమ్మతులు, నిర్మాణం చేయించాలన్నారు. అవసరమైన చోట అద్దే భవనాల్లో ఉన్న అంగన్వాడీ కేంద్రాలను పాఠశాల భవనాలకు మార్చాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతలో 9123 పాఠశాలలను ఆధునీకరించి మౌళిక సదుపాయాలు కల్పించేందుకు నిశ్చయించుకొన్నామని తెలిపారు. వాటన్నింటికి త్వరగా అంచనాలు సిద్ధం చేసి పనులు ప్రారంభించాలన్నారు. పాఠశాలలు ప్రస్తుతం సెలవు ఉన్నందున త్వరగా పనులు చేపట్టి పాఠశాలలు పునఃప్రారంభం అయ్యేనాటికి సిద్జం చేయాలని ఆదేశించారు. చేపడుతున్న పనులకు అంచనాలు వేయించి పరిపాలన అనుమతులు మంజూరు చేయాలన్నారు. 30 లక్షల అంచనా వరకు ఉన్న వాటిని వెంటనే పనులు ప్రారంభించాలని అంతకు మించి అంచనాలు ఉంటే వారం లోపల టెండర్లు పిలిచి పనులు అప్పగించాలన్నారు. ఫర్నిచర్ ఇతర సదుపాయాల కొరకు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే నమూనా తో తయారు చేయించి పంపడం జరుగుతుందన్నారు. అదేవిధంగా మండుటెండల్లో ఇంటర్, పదవ తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నందున తగిన జాగ్రత్తలు తీసుకొని పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు.
ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మాట్లాడుతూ మరమ్మత్తులు చేయించాల్సిన పాఠశాలలల్లో ఇప్పటి వరకు పరిపాలన అనుమతులు ఇవ్వడంలో జిల్లాలు వెనుకబడి ఉన్నాయని, ఈ నెల 10వ తేదీ వరకు వంద శాతం పరిపాలన అనుమతులు పూర్తి చేయాల్సిందిగా కలెక్టర్లను ఆదేశించారు. పనులు త్వరగా ప్రారంభించి పూర్తి చేయించాలని, నాణ్యతలో లోటు లేకుండా పర్యవేక్షణ చేయాల్సిందిగా సూచించారు. ప్రతి మండలానికి ప్రత్యేక అధికారిని నియమించి పనులు సజావుగా జరిగే విధంగా చూడాలన్నారు.
జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో మొదటి విడతలో 290 పాఠశాలలు గుర్తించగా 135 పాఠశాలలకు పరిపాలన అనుమతులు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ నెల 10 వ తేదీ లోగా గుర్తించిన అన్ని పాఠశాలకు పరిపాలన అనుమతులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. నియోజక వర్గంలో ఒక పాఠశాలను తీసుకొని మోడల్ పాఠశాలగా ఈ నెల చివరి నాటికి పూర్తి చేయడం జరుగుతుందని అదే విధంగా మండలానికి రెండు చొప్పున మే, చివరి నాటికి పూర్తి చేస్తామన్నారు. పాఠశాలలు పునఃప్రారంభం అయ్యేనాటికి 290 పాఠశాలలు అన్ని పూర్తి స్థాయిలో సిద్ధం చేయడం జరుగుతుందని తెలియజేసారు. అందుకు 30 లక్షల కంటే తక్కువ అంచనాలు కలిగిన పాఠశాల పనులు వెంటనే ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం ద్వారా ఇచ్చిన సూచనలు అన్ని పాటించి పాఠశాలలో పునఃప్రారంభం అయ్యేలోగా పూర్తి చేస్తామని తెలియజేసారు.
ఈ వీడియో కాన్ఫెరెన్స్ లో ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానీయ, పాఠశాల విద్యా శాఖ సంచాలకులు దేవసేన, నాగర్ కర్నూల్ నుండి డీఈవో గోవిందరాజులు, ఈఈ ఆర్ అండ్ బి భాస్కర్,ఈఈ పిఆర్ దామోదరరావు, జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్, డాక్టర్ రఘు, డాక్టర్ శివరాం, విద్యా మరియు వైద్యా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post