“మన ఊరు -మన బడి” కార్యక్రమం పనుల పురోగతిపై వీడియో కాన్ఫరెన్స్ : రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి టి. హరీష్ రావు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వాన్

పత్రికా ప్రకటన.       తేది:02.05.2022, వనపర్తి.

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన “మన ఊరు – మన బడి” కార్యక్రమం ద్వారా ఎంపిక చేసిన పాఠశాలల పనులను జాప్యం లేకుండా పూర్తి చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి టి. హరీష్ రావు, జిల్లా కలెక్టర్లకు, సంబంధిత శాఖల అధికారులకు ఆదేశించారు.
సోమవారం హైదరాబాదు నుండి “మన ఊరు -మన బడి” కార్యక్రమం పనుల పురోగతిపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  సోమేష్ కుమార్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ”మన ఊరు- మన బడి” కార్యక్రమం కింద చేపట్టిన పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని, పరిపాలన అనుమతులను వేగవంతంగా చేయాలని, పనుల అంచనాలకు సంబంధించి ప్రత్యక్షంగా చూసిన తర్వాతనే మంజూరి ఇవ్వాలని ఆయన అన్నారు. పాఠశాలలు పునః ప్రారంభం అయ్యేనాటికి జాప్యం లేకుండా పనులు పూర్తి చేయాలని, తప్పుడు నివేదికలు అందించరాదని, అలాంటి చర్యలకు పాల్పడితే అధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు ఆయన సూచించారు.
“మన ఊరు – మన బడి” కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీ పెద్దలను, విద్యార్థుల తల్లిదండ్రులను పూర్తిగా భాగస్వాములను చేయాలని, ప్రభుత్వం కార్పొరేట్ విద్యను అందించే విధంగా చర్యలు చేపడుతున్నదని ఆయన సూచించారు. పనులు పూర్తయిన పాఠశాలల వివరాలను ఫేస్ బుక్, ట్విట్టర్, సోషల్ మీడియా, పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రచారం చేయాలని ఆయన అన్నారు. రూ.30 లక్షల లోపు  పనులను స్థానిక ఎస్.ఎం.సి. ద్వారా చేపట్టాలని, రూ. లక్షలకు పైగా చేయాల్సిన పనులకు మే నెల చివరి నాటికి అన్ని టెండర్స్ పూర్తి చేయాలని ఆయన తెలిపారు. మంజూరి కోసం పంపిన వాటికి వెంటనే గ్రౌండింగ్ చేయాలని ఆయన సూచించారు. ప్రతి పాఠశాలను జిల్లా కలెక్టర్ సందర్శించి సంతృప్తి చెందితేనే, మంజూరు ఇవ్వాలని, డబ్బు ఎట్టిపరిస్థితిలోనూ వృధా చేయవద్దని ఆయన సూచించారు. పాఠశాలలను తీర్చిదిద్దేందుకు చేపట్టిన పనుల వివరాలను, ప్రణాళికలను క్షుణ్నంగా పరిశీలించాలని జిల్లా కలెక్టర్లకు తెలిపారు.
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ రూ.30 లక్షల లోపు వున్న పనులనన్నింటికీ ఈ నెల 10వ. తేదిలోగా పరిపాలన అనుమతులు పూర్తి చేయాలని ఆమె సూచించారు. ప్రతి నియోజకవర్గంలో 2 పాఠశాలలను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని, నిధులకు ఎలాంటి ఇబ్బంది లేదని ఆమె తెలిపారు. వడగాలులు ఎక్కువగా ఉన్నందున, 10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలపై విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆమె జిల్లా కలెక్టర్లకు సూచించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వాన్, డి ఈ ఓ రవీందర్, పంచాయతీ రాజ్ ఈ ఈ మల్లయ్య, ఆర్ అండ్ బి ఈ ఈ డేశ్యా నాయక్, డీఎంహెచ్వో రవిశంకర్, సూపరింటెండెంట్ రాజ్ కుమార్, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ లు, అదనపు డి ఆర్ డి ఓ కృష్ణయ్య, డాక్టర్ ఇస్మాయిల్, ఎం. ఈ. ఓ.లు, డాక్టర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
…….
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post