మన ఊరు-మన బడి పనులను వేగవంతం చేయాలి నాణ్యత విషయంలో రాజీ పడరాదు వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పాఠశాలలను సకల సౌకర్యాలతో సిద్ధం చేయాలి 30 లక్షల అంచనాలు గల పాఠశాలల పనులను వెంటనే ప్రారంభించాలి…… అదనపు కలెక్టర్ రాజర్షి షా

మన ఊరు-మన బడి పనులను
వేగవంతం చేయాలి

నాణ్యత విషయంలో రాజీ పడరాదు

వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పాఠశాలలను సకల సౌకర్యాలతో సిద్ధం చేయాలి

30 లక్షల అంచనాలు గల పాఠశాలల పనులను వెంటనే ప్రారంభించాలి…… అదనపు కలెక్టర్ రాజర్షి షా

మన ఊరు- మన బడి కార్యక్రమం కింద ఇప్పటికే అనుమతి పొందిన పాఠశాలల పనులను తక్షణమే ప్రారంభించాలని అదనపు కలెక్టర్ రాజర్షి షా సంబంధిత అధికారులను ఆదేశించారు.

శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో పాఠశాల యాజమాన్య కమిటీ అధ్యక్షులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆయా ఇంజనీరింగ్ శాఖల ఈ ఈ లు, డీఈలు,ఏఈ లు,విద్యాశాఖ అధికారులతో మన ఊరు మన బడి కార్యక్రమం పై జిల్లాస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా రాజర్షి మాట్లాడుతూ, మన ఊరు మన బడి కింద జిల్లాలో 441 పాఠశాలలను మొదటి విడతలో ఎంపిక చేసామన్నారు. ఇప్పటికే 275 పాఠశాలలకు పరిపాలనాపరమైన అనుమతులను ఇవ్వడం జరిగిందని, అందులో 30 లక్షల లోపు అంచనా గల 249 పాఠశాలలు ఉన్నాయని,60 పాఠశాల గ్రౌండింగ్ పూర్తయిందని పేర్కొన్నారు. గ్రౌండ్ అయిన పాఠశాలలకు 9 శాతం నిధులను పాఠశాల నిర్వహణ కమిటీల ఖాతాలకు బదలాయించామన్నారు.
సంబంధిత పాఠశాలల్లో పనులు వేగవంతం అయ్యేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

మన ఊరు మన బడి పనులకు నిధుల సమస్య ఎంతమాత్రం లేదని, జిల్లాకు నిధులు మంజూరై కలెక్టర్ వద్ద సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల్లో గల పాఠశాలలో ఐదు కాంపోనెంట్స్ లో పనులు చేపట్టాల్సి ఉంటుంద న్నారు. మేజర్, మైనర్ మరమ్మతులు, శిధిలమైన తరగతి గదుల స్థానంలో కొత్తవి నిర్మించడం,విద్యుత్ పనులు, డైనింగ్ హాల్, త్రాగు నీటి వసతి చేపట్టాల్సి ఉందన్నారు. అదేవిధంగా పట్టణ ప్రాంతంలోని పాఠశాలల్లో ఈ ఐదు కాంపోనెంట్ లతో పాటు కొత్త కిచెన్ షెడ్,కొత్త ప్రహారీ నిర్మాణం, మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు. కొత్త కిచెన్ షెడ్లు, ప్రహరి, మరుగుదొడ్ల నిర్మాణాలను ఈజీఎస్ లో టై ఆప్ చేయాల్సి ఉంటుందని తెలిపారు.

అనుమతి తెలిపిన బడులలో నూతనంగా టాయిలెట్స్, కిచెన్ షెడ్స్, ప్రహరీ గోడల నిర్మాణాలు వంటి పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఆయా అధికారులను ఆదేశించారు. పనులు పెండింగ్లో ఉండకుండా వేగవంతంగా పూర్తిచేయాలని సూచించారు. పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడరాదని స్పష్టం చేశారు.

ఈనెల 15లోగా
ప్రతి నియోజకవర్గంలో రెండు పాఠశాలలను అన్ని హంగులతో సిద్ధం చేసి మోడల్ పాఠశాలలు గా తయారుచేసి ఇవ్వాలని ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీలకు ఆదేశించారు.

అప్పుడు ఇప్పుడు అన్నట్లుగా మరమ్మతులు చేయకముందు, మరమ్మతులు పూర్తి అయ్యాక పాఠశాలల ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియా, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా లో పెద్ద ఎత్తున ప్రచారం చేయాలన్నారు.

30 లక్షల లోపు అంచనా గల పాఠశాలల పనులు వేగవంతంగా ఒక నెల లోపు పూర్తి చేయాలన్నారు. పాఠశాలలకు వేసవి సెలవులు ఉన్నందున పనులు వేగవంతంగా పూర్తి చేసి వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి అన్ని హంగులతో పాఠశాలలను సిద్ధం చేయాలని చెప్పారు.

30 లక్షల లోపు పనులు నాణ్యతగా వేగవంతంగా పూర్తి చేయాల్సిన బాధ్యత పాఠశాల నిర్వహణ కమిటీ అధ్యక్షులు, ప్రధానోపాధ్యాయులదని పేర్కొన్నారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే అన్ని పాఠశాలల పనులు పూర్తి కావాలని ఆయన స్పష్టం చేశారు. పరిపాలన అనుమతులు మంజూరు చేసిన పాఠశాలల
ఎంఓయూ లు, రిజల్యూషన్స్ రేపటిలోగా పూర్తిచేయాలని సూచించారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మన బడి కార్యక్రమాన్ని ప్రణాళికాబద్ధంగా అమలు చేసి విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలపాలని కోరారు. పోటీ తత్వంతో పనులు కొనసాగాలని సూచించారు. ఎం ఈ ఓ లు రెగ్యులర్గా ఆయా పాఠశాలలను సందర్శించి పనుల పురోగతిని నాణ్యతను పరిశీలించాలని తెలిపారు.

అనంతరం పాఠశాల వారిగా ఎస్ఎంసి కమిటీ అధ్యక్షులు, ప్రధానోపాధ్యాయులు, ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ లతో ఆయా పాఠశాలలో చేపట్టిన పనులు, పురోగతిపై సమీక్షించారు.

ఈ సమీక్షలో జిల్లా విద్యాశాఖ అధికారి నాంపల్లి రాజేష్, పంచాయతీ రాజ్, ఇరిగేషన్ ఆర్ఆర్బి తదితర శాఖల ఈ ఈ లు,డి ఈ లు, ఏ ఈ లు, ఎం ఈ ఓ లు, ఎస్ఎంసి చైర్మన్లు, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post