మహాత్మాగాంధీ జీవన విధానం ప్రతి ఒక్కరికి ఆదర్శం:: రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు

జనగామ, అక్టోబర్ 2: జాతిపిత మహాత్మాగాంధీ జీవన విధానం ప్రతి ఒక్కరికి ఆదర్శమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు అన్నారు. జాతిపిత మహాత్మాగాంధి 152వ జయంతిని పురస్కరించుకుని మంత్రి, శనివారం గాంధి చౌక్ లోని మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. మహాత్మా గాంధీ సత్యం, అహింస లనే ఆయుధాలతో జీవితంలో అనేక విజయాలు సాధించారని ఆయన అన్నారు. భారతదేశ స్వాతంత్ర్య సాధన గాంధీతోనే సాధ్యమైందని ఆయన తెలిపారు. ఆయన పోరాటం, స్ఫూర్తి తోనే స్వాతంత్ర్యం వచ్చిందని మంత్రి అన్నారు. మహాత్మాగాంధీ స్పూర్తితోనే గ్రామ స్వరాజ్యానికి బాటలు వేసుకున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ స్వచ్చ భారత్ కార్యక్రమం జనగామ పట్టణ మునిసిపాలిటిలో చక్కగా జరుగుతుందన్నారు. కరోనా కష్టకాలంలో మునిసిపల్ కార్మికులు ఎంతో కష్టపడ్డారని, కుటుంబ సభ్యులే దహన సంస్కారాలకు రాకుంటే, మునిసిపల్ కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా ముందుండి చేసారని గుర్తుచేశారు. భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి ఈరోజునే నని, శాస్త్రి మహోన్నత వ్యక్తని ఆయనకు నివాలులర్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. రైతు సంక్షేమానికి శాస్త్రి ఎంతో కృషి చేశారన్నారు. ఈ సందర్భంగా మునిసిపల్ కార్మికుల సేవలను గుర్తించి, వారిని మంత్రి సన్మానించి, ప్రశంసాపత్రాలు అందజేశారు. అనంతరం స్వచ్చతా హి సేవా స్వఛ్ఛభారత్ ప్రచార రధాన్ని మంత్రి పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి, స్వచ్ఛ సర్వేక్షణ్-2021 అనే ఆప్ ద్వారా స్వఛ్ఛత పట్ల ప్రజల అవగాహణ అభిప్రాయాన్ని ప్రతీ ఒక్కరు తెలియజేయాలన్నారు. ప్రతి ఇంటికొక ఇంకుడు గుంత నిర్మించాలని, తడి పొడి చెత్తని ఇంటి నుండే వేరు చేసివ్వాలని, స్వచ్ఛ పల్లె ప్రగతికి ప్రతి ఒక్కరు భాద్యతగా తోడ్పడాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య, జిల్లా పరిషత్ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, డిసిపి బి. శ్రీనివాస రెడ్డి, రైతు బంధు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు ఇర్రి రమణారెడ్డి, జనగామ మునిసిపల్ చైర్ పర్సన్ పోకల జమున, అదనపు కలెక్టర్లు ఏ. భాస్కర్ రావు, అబ్దుల్ హమీద్, డిఆర్డివో జి. రాంరెడ్డి, డిపివో కె. రంగాచారి, జెడ్పి సిఇవో ఎల్. విజయలక్ష్మి, జనగామ మార్కెట్ కమిటి చైర్ పర్సన్ బాల్దే విజయ, పిఎసిఎస్ చైర్మన్ నిమ్మతి మహేందర్ రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి, జనగామచే జారిచేయనైనది.

Share This Post