మహాత్ముడు చూపిన బాట అందరికీ ఆచరణీయం
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్
కలెక్టరేట్లో గాంధీ జయంతి వేడుకలు
మహాత్మాగాంధీ చూపిన అహింస, సత్యం వంటివి ప్రతి ఒక్కరు ఆచరించాల్సినవని ఆయన చూపిన బాటలో పయనించాలని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్ అన్నారు.
శనివారం జాతిపిత మహాత్మాగాంధీ 152వ జయంతిని పురస్కరించుకొని జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం గాంధీజీ సత్యం, అహింస వంటి మార్గాలను ఎంచుకొన్నారని ప్రతి ఒక్కరు మహాత్ముని ఆదర్శంగా తీసుకొని పయనించాలన్నారు. ప్రస్తుతం యువకులు జాతిపిత మహాత్మాగాంధీ చూపిన బాటలో పయనించాల్సిందిగా కోరారు. మహాత్ముడు కలలు గన్న గ్రామ స్వరాజ్యం సిద్దించేందుకు ప్రజలు, ప్రజాప్రతినిధులు, యువకులు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, జాన్ శ్యాంసన్, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, కలెక్టరేట్ ఏవో వెంకటేశ్వర్లు, డీఈవో ప్రసాద్, జిల్లా యూత్ వెల్ఫేర్ అధికారి బలరామ్, ఆయా శాఖ అధికారులు, కలెక్టరేట్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.