మహానీయుల ఆశయాలు, త్యాగాల స్పూర్తితో ప్రతి ఒక్కరూ విధులను భాద్యతగా నిర్వహించడమే దేశ సేవని, ఆత్మసాక్షిని ప్రశ్నించుకుంటే అదే పెద్ద సంతృప్తి అని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు

. బుధవారం కలెక్టరేట్ నందు నిర్వహించిన 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని నిరాడంబరంగా వేడుకలు నిర్వహించినట్లు చెప్పారు. జిల్లాను అన్ని రంగాల్లో ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ఎన్నో అడుగులు వేసినట్లు చెప్పారు. మనందరం ఒక టీముగా కష్టాలను అధిగమించి కృషి చేస్తే ప్రగతి సాధ్యమేనని స్పష్టం చేశారు. పరాయిపాలనలో ఉన్న మన దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తదుపరి మనల్ని మనం పరిపాలించుకునేందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన రాజ్యాంగ రచనా కమిటిని ఏర్పాటు చేసుకున్నామని, అట్టి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26ను దేశమంతా పండుగ వాతావరణంలో రంగరంగ వైభవంగా జరుపుకుంటున్నట్లు చెప్పారు. మనకు స్వాతంత్య్రం వచ్చిన తదుపరి ఇంత పెద్ద దేశం ఎక్కువ కాలం సమైఖ్యంగా ఉండదని, కొన్ని సంవత్సరాల్లోనే విచ్ఛిన్నం అవుతుందని అన్నారని, నేడు ఒక దేశంగా కొనసాగుతున్నామని, అంత గొప్ప రాజ్యాంగాన్ని మహానీయులు మనకు అందించారని చెప్పారు. రెండు భాషలు, రెండు మతాలు మాత్రమే ఉన్న కొన్ని దేశాలు సమైఖ్యంగా ఉండలేక విడిపోయాయని చెప్పారు. మన రాజ్యాంగం ప్రతి ఒక్కరి హక్కులను కాపాడే విధంగా ఉందని, అన్ని వర్గాల ప్రజలు స్వేచ్ఛా, సమానత్వంతో జీవించే విధంగా రూపకల్పన చేశారని చెప్పారు. దేశ ప్రజలు సమైఖ్యతతో, సోదరభావంతో జీవిస్తూ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచామని చెప్పారు. మన జిల్లాను అభివృద్ధిలో ఆదర్శ జిల్లాగా తయారు చేయుటకు క్రింది స్థాయి నుండి అధికారి వరకు ఎవరికి కేటాయించిన విధులు వారు అంకితభావంతో చేస్తే అదే మనం దేశానికి చేసే నిజమైన సేవ అవుతుందని చెప్పారు. అంతరించి పోతున్న గిరిజన కళను బ్రతికించడానికి రామచంద్రయ్య 30 సంవత్సరాల నుండి చేస్తున్న అవిరళ కృషికి భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కళను మక్కువతో కాపాడటం ఆచప గొప్పతమని చెప్పారు. కరోనా వ్యాధి అంతానికి వ్యాక్సిన్ అందించి ఎన్నో కోట్ల ప్రజల ప్రాణాలను కాపాడిన క్రిష్ణ ఎల్లా దంపతులకు భారత ప్రభుత్వం పద్మభూషణ్ గౌరవించిందని చెప్పారు. ఇటువంటి కార్యక్రమాలన్ని దేశ సేవకు సంబంధించినవేనని, ఎవరి విధులను వారు సక్రమంగా నిర్వహిస్తే అన్ని సమస్యలను అధిగమించి అభివృద్ధిలో మేటి కాగలమని చెప్పారు. మనకు స్వాతంత్య్రం సిద్ధించిన నాటి నుండి నేటి వరకు ఎన్నో మార్పులు జరిగాయని ఆనాటి పరిస్థితులు నేడు లేవని చెప్పారు. గ్రామీణ ప్రజలు అధికంగా నివసిస్తున్న ఈ ప్రాంతంలో మైదాన ప్రాంతాల కంటే ఏ మాత్రం తక్కువ కాకుండా ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని చెప్పారు. మన జిల్లా ప్రజలకు విద్యా, వైద్యంతో సంక్షేమ కార్యక్రమాలు చేరవేసి పేదల అభ్యున్నతికి కృషి చేయాల్సిన అవసరం ఉన్నట్లు చెప్పారు. పేదల అభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చేరవేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పారు. జిల్లాకు నర్సింగ్, వైద్య, నూతన కలెక్టరేట్, సీతారామ ఎత్తిపోతల పథకం, సీతమ్మ సాగర్ మణిహారం కానున్నాయని చెప్పారు. పల్లె, పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేందుకు పకృతి వనాలను ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. ఇంటింటి నుండి సేకరించిన వ్యర్థాలతో గ్రామ పంచాయతీలు, మున్సిపార్టీలు వర్మీ తయారీతో వ్యర్థాల నుండి ఆదాయం సముపార్జించే విధంగా కృషి చేస్తున్నాయని, తద్వారా స్వచ్ఛతను సాధించే స్థాయికి చేరుకున్నాయని చెప్పారు. ఇదే స్ఫూర్తితో ప్రజల సంక్షేమానికి చేరువ అవుతామని, జిల్లాను అభివృద్ధి పథంలో నిలపుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డిఆర్ అశోక చక్రవర్తి, ఏఓ గన్యా కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post