మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 18 నుండి అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్న ఝరాసంగం శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి దేవస్థానం మహాశివరాత్రి జాతరలో భక్తులకు ఎలాంటి సమస్యలు లేకుండా ఏర్పాట్లు ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ అన్నారు.

మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 18 నుండి అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్న ఝరాసంగం శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి దేవస్థానం మహాశివరాత్రి జాతరలో భక్తులకు ఎలాంటి సమస్యలు లేకుండా ఏర్పాట్లు ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ అన్నారు.

శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి జాతర నిర్వహణ ఏర్పాట్లపై మంగళవారం జిల్లా కలెక్టర్ శరత్ స్థానిక శాసనసభ్యులు మాణిక్ రావుతో కలిసి ఆయా శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.

జాతరను అన్ని ఏర్పాట్లతో విజయవంతంగా నిర్వహించాలన్నారు.
జిల్లా నలుమూలల నుండే గాక ఇతర జిల్లాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్రల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశముందన్నారు. ఏ ఏ ప్రాంతాల నుండి అధికంగా భక్తులు వస్తారో ఆయా ఏరియాలకు అదనపు బస్సులు నడపాలని ఆర్టీసీ వారికి సూచించారు. దేవాలయం చుట్టూ దేవాలయాన్ని పూలతో డెకరేషన్ చేయాలని,పరిసరాలు ప్లాంటేషన్ చేయాలని, దేవాలయాన్ని,ప్రాంగణాన్ని విద్యుత్ దీపాలతో సుందరీకరించాలని ఆలయ ఈవోకు సూచించారు.

రహదారుల పై జాతరకు సంబంధించి హోర్డింగ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. మహిళా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధిక సంఖ్యలో టాయిలెట్స్, ఏర్పాటు చేయాలని సూచించారు. భక్తులు స్నానమాచరించుటకు ఎక్కువ సంఖ్యలో షవర్లు, మంచినీటి సదుపాయాలు కల్పించాలన్నారు.

పారిశుద్ధ్య నిర్వహణకు ఎక్కువ మంది కార్మికులను ఏర్పాటు చేయాలని, గ్రామం, దేవస్థాన పరిసరాలు జాతర ఆవరణ మొత్తం ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య నిర్వహణ సభ్యంగా జరిగేలా చూడాలని డిపిఓ కు సూచించారు. బ్లీచింగ్ ,క్లోరినేషన్, ఫాగింగ్ వంటివి చేయాలన్నారు. విద్యుత్ లో అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ అధికారులకు, వైద్య ఆరోగ్యశాఖ జాతరలో ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు.108 వాహనంఅందుబాటులో ఉంచాలన్నారు. అగ్నిమాపక వాహనాలు అందుబాటులో ఉండాలని తెలిపారు. బందోబస్తు విషయంలో పోలీసులు గుడి లోపల , బయట గుడి ఆవరణలో పటిష్టమైన బందోబస్తు భద్రత ఏర్పాటు చేయాలన్నారు. పార్కింగ్ స్థలాల వద్ద భద్రత ఏర్పాట్లు ఉండాలన్నారు.
గత సంవత్సరం అనుభవాలను దృష్టిలో పెట్టుకొని భక్తులకు ఎలాంటి లోటుపాట్లు జరగకుండా అధికారులందరూ సమిష్టి గా పని చేయాలని సూచించారు. జాతరలో మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యం, షవర్లు, ఆలయ ప్రవేశ ద్వారం తదితర వాటిని భక్తులు గుర్తించే విధంగా మ్యాప్ లు, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.

దర్శనం క్యూ లైన్, ప్రసాదం, కొబ్బరి కాయల దగ్గర ఇబ్బందులు కలుగకుండా చూడాలని, ట్రాఫిక్ కు అంతరాయం కలుగకుండా చూడాలని, భక్తుల కాలక్షేపానికి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని, విధులు నిర్వహించే వారికి భోజన సౌకర్యం ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. సి.సి. కెమెరాలు కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేసి పర్యవేక్షించాలని అన్నారు.

ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఆయా శాఖలు స్టాల్స్ ఏర్పాటు చేయాలని, ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

రోడ్స్, డ్రెయిన్లకు తాత్కాలిక మరమ్మత్తులు ఎవేని ఉంటే చేయించాలని, గుంతలను పూడ్చాలని అదేవిధంగా రోడ్డు ప్యాచ్ వర్క్ పూర్తి చేయాలని పంచాయతీరాజ్ ,ఆర్ అండ్ బి అధికారులకు సూచించారు. త్రాగునీటి సరఫరా విషయమై ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు సూచించారు. ఎక్కడ ప్రజలు ఉంటే అక్కడ ట్యాంకర్స్ ఏర్పాటు చేయాలన్నారు. మొబైల్ టాయిలెట్స్ కాకుండా టెంపరరీ టాయిలెట్స్ ను ఏర్పాటు చేయాలని సూచించారు. అదేవిధంగా బస్టాండ్ లో కూడా డ్రింకింగ్ వాటర్ తాత్కాలిక టాయిలెట్స్ పెట్టాలని తెలిపారు. ఆయా పనులన్నింటినీ ఈనెల 16 లోగా ఆయా శాఖల అధికారులు పూర్తి చేసుకోవాలన్నారు.

ప్రతి షాప్ లో చెత్త డబ్బా ఉండాలని ఎట్టి పరిస్థితిలోనూ షాపుల వారు ఎక్కడపడితే అక్కడ చెత్త బయట వేయరాదన్నారు.

జాతరలో ఏర్పాటు చేసే ఫుడ్ షాప్ లలో నాణ్యత గల ఫుడ్ ఐటమ్స్ ఉండాలని ,వాటి ధరలను డిస్ ప్లే చేయాలని, ఆయా ఆహార పదార్థాల అమ్మకాలపై సరైన పర్యవేక్షణ ఉండాలని ఫుడ్ సేఫ్టీ అధికారికి సూచించారు.

జాతర ఘనంగా నిర్వహించడానికి 10 లక్షల ప్రత్యేక ఫండ్ ను ఇవ్వాలని డిసిఎంఎస్ చైర్మన్ జిల్లా కలెక్టర్ ను కోరగా, కలెక్టర్ 10 లక్షల రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చారు.

జహీరాబాద్ శాసనసభ్యులు మాణిక్ రావు మాట్లాడుతూ ఈనెల 18 నుండి 20 వరకు మూడు రోజులపాటు నిర్వహించు మహాశివరాత్రి జాతరకు సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు పనిచేయాలని కోరారు. పారిశుద్ధ్య నిర్వహణ బాగుండాలని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆయా శాఖల అధికారులు కోఆర్డినేషన్తో పని చేయాలన్నారు. అందరి సమన్వయంతో జాతర విజయవంతంగా నిర్వహించాలన్నారు.

ఈ కార్యక్రమంలో డి సి ఎం ఎస్ చైర్మన్ శివకుమార్,
సి డి సి చైర్మన్ ఊమా కాంత్ పాటిల్, ఆలయ చైర్మన్ వెంకటేశం, ఈ .ఓ. , ఆర్డిఓ రమేష్ బాబు, జిల్లా అధికారులు,మున్సిపల్ కమిషనర్,ఎం.పి.పి,గ్రామ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post