మహిళలు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేలా ధైర్యంగా, సాధికారికంగా ఉండాలని, తమ హక్కులను కాపాడుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.

ఆజాదీ కా  అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలలో భాగంగా శనివారం నాడు భువనగిరి మున్సిపాలిటీ కార్యాలయం సమావేశ మందిరంలో జాతీయ మహిళా కమిషన్, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో మహిళా సాధికారత, న్యాయ సేవలపై అవగాహన సదస్సు నిర్వహించబడింది.
మహిళా సర్పంచులు, వార్డు మెంబర్లు,  వివిధ కాలేజీల మహిళా ప్రిన్సిపాల్స్,  జిల్లా మహిళా అధికారులు, ఐసిడిఎస్ సూపర్వైజర్లు, మహిళా ఉద్యోగులు హాజరైన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ,
మహిళలు తాము పనిచేస్తున్న రంగాలలో ఏ స్థాయిలో కూడా తమ హక్కులను కోల్పోవద్దని, పరిస్థితులలో అధిగమించేలా ధైర్యంతో, సాధికారికంగా ఉండాలని అన్నారు.  ఆడపిల్లలు, మహిళలపై జరిగే దురాచారాలు, గృహ హింస,  లైంగిక వేధింపులు, అకృత్యాల పట్ల చట్టాలు కఠినంగా ఉన్నాయని, చట్టాల పట్ల మహిళలు పూర్తి స్థాయి అవగాహనతో ఉండాలని అన్నారు.  కుటుంబాలలో మహిళల హక్కులను గౌరవించాలని,  కూతురైనా కోడలైనా సమానంగా చూడాలని,  మగ ఆడ అనే లింగ వివక్ష లేకుండా సమానంగా చూడాలని అన్నారు.  మగవారితో సమానంగా ఆడవారికి ఆస్తి హక్కు సమానంగా ఉందని, మహిళలు ఆర్థిక స్వావలంబనతో ఉండడం చాలా ముఖ్యమని  అన్నారు.  మహిళలు తమ తోటి మహిళల పట్ల ఆదరణ, అండతో ఉండాలని, ఏ స్థాయి మహిళా ఉద్యోగిని అయినా కూడా తమ ఉనికిని కోల్పోవద్దని అన్నారు. మహిళలు విశ్రాంతి లేకుండా ఎన్నో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని, ఇలాంటి మహిళా చట్టాల సదస్సులు, కార్యాచరణ సదస్సులు తరచూ నిర్వహించాల్సిన అవసరం ఉందని అన్నారు.
నల్గొండ జిల్లా అదనపు జిల్లా న్యాయమూర్తి శ్రీమతి  ఎం.భవాని మాట్లాడుతూ,  రాజ్యాంగం దేశంలోని పౌరులందరికీ సమాన హక్కులను కల్పించిందని,  ప్రతి పౌరుడికి పుట్టుకతోనే కొన్ని హక్కులు సంక్రమిస్తాయని, అవే ప్రాథమిక హక్కులని  అన్నారు.  పౌరులందరూ కుల, మత, లింగ, వర్గ, ప్రాంతీయ భేదం లేకుండా చట్టం ముందు అందరూ సమానులే అని వారికి సమాన రక్షణ కల్పించబడుతుందని, ముఖ్యంగా మహిళలకు రక్షణ ఇచ్చే చట్టాలు చాలా ఉన్నాయని,  మహిళలు చట్టాలపై పూర్తి అవగాహన కలిగి తమ తోటి మహిళలకు వివరించాలని  తెలియజేస్తూ మహిళలపై జరుగుతున్న ఘోరాలకు ఫోక్సో చట్టం ఏవిధంగా మహిళలకు రక్షణ కల్పించింది, కుటుంబ చట్టాలు, కార్మిక సంక్షేమ చట్టాలు, పని స్థలాలో లైంగిక వేధింపులు, తదితరుల చట్టాలపై, వివరించారు.
ఉమ్మడి నల్గొండ జిల్లా న్యాయ సేవ అధికార కార్యదర్శి జి.వేణు మాట్లాడుతూ,  ప్రతి మహిళకు న్యాయ సేవ అందించేందుకు,  చట్టాలపై విపులంగా తెలియ చెప్పడానికే  ఇలాంటి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతున్నాయని తెలిపారు. భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు నిండుతున్న ఈ తరుణంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా జాతీయ మహిళా కమిషన్, జిల్లా న్యాయ సేవ అథారిటీ సంయుక్త ఆధ్వర్యంలో న్యాయ సేవలు, అవగాహనపై  కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నాయని, చట్టం ద్వారా వచ్చిన సాధికారతను మహిళలకు తెలియజేయడమే వీటి ఉద్దేశమని అన్నారు.  మన రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పించిందని, అందరికీ సమాన అవకాశాలు కల్పించినప్పుడే సమాన హక్కులు వస్తాయని,  పరిపూర్ణమైన అవగాహన లేకపోవడం వల్లనే స్వాతంత్ర్య ఫలాలు పూర్తిగా అందుకోలేక పోతున్నామని,  చట్ట సంబంధ వ్యవహారాలు అందరికీ తెలియజెప్పడం వీటి ఉద్దేశమని అంటూ మహిళలపై జరిగే అకృత్యాల పట్ల అందించే మహిళలకు అందే న్యాయ సహాయక చర్యలపై వివరించారు.  మహిళలపై చేసే నేరాలకు శిక్షల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందనే  విషయం తెలిస్తే నేరాల సంఖ్య  తగ్గుతుందని అన్నారు. గర్భస్థ పిండ నిర్దారణ నివారణ చట్టం, మెడికల్ టెర్మినేషన్ చట్టాలు , న్యాయ సేవా అధికార సంస్థ చట్టం, న్యాయ సహాయం వంటి చట్టాలపై వివరించారు.
సీనియర్ సివిల్ జడ్జి ఎస్.రజిని మాట్లాడుతూ,  మహిళ సాధికారత సాధిస్తేనే దేశం ప్రగతి సాధించినట్లని, ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు ఉంటారని అన్నారు.  మహిళలకు చట్టాలపై అవగాహన ఉండాలని,  రాజ్యాంగం తనకు కల్పించిన హక్కులను తెలుసుకోవాలని,  మీలాంటి మహిళల ద్వారా ఇతరులకు తెలియాలని అన్నారు.  మహిళలకు రక్షణ ఇచ్చే చట్టాలు చాలా ఉన్నాయని,  మహిళలు పురుషులు సమానమేనని,  తారతమ్యాలు లేవని,  ఆడ పిల్లలు, మహిళలను కించపరిచినా‌,  అశ్లీలంగా ప్రవర్తించినా  తీవ్రమైన శిక్షలు ఉంటాయని అన్నారు.  వివాహితలు తన భర్త, అతని కుటుంబ సభ్యుల నుండి ఎలాంటి హింసలకు, నష్టాలకు గురైనా న్యాయ సహాయం పొందవచ్చని,  ఆడపిల్లలకు, మహిళలకు ఇష్టంలేని పనులు చేస్తే శిక్షలు పడతాయని తెలిపారు.  న్యాయ సహాయం కింద భరణం, నష్ట పరిహారం ఇప్పించడం జరుగుతుందని తెలిపారు.  మహిళల పట్ల లైంగిక దాడులు,  అకృత్యాలు చేస్తే కఠినమైన చట్టాలు ఉన్నాయని తెలియజేస్తూ వాటిని వివరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధికారులు జిల్లా కో-ఆపరేటివ్ ఆఫీసర్ పరిమళ,  జిల్లా పరిశ్రమల అధికారి శ్రీలక్ష్మి,  జిల్లా మార్కెటింగ్ అధికారి సబిత‌,  జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ,  స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విజయ్ కుమారి,  తదితరులు మహిళా ఉద్యోగినులు ఎదుర్కొంటున్న సమస్యలు,  దానికి వారు అధిగమించాల్సిన  పరిస్థితుల పట్ల మాట్లాడారు.
సీనియర్ న్యాయవాది కె.వి. వెంకట రమణ రావు, మహిళలకు గల రాజ్యాంగ హక్కులు,  పోలీసు కస్టడీలో ఉన్న, లేదంటే కస్టడీకి వెళ్ళే మహిళలకు గల హక్కులు, రిట్ పిటిషన్ ద్వారా లభించే రాజ్యాంగ పరిహారాల చట్టాలపై  అవగాహన కల్పించారు.
భువనగిరి జూనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు,  భువనగిరి న్యాయవాదుల సంఘం అధ్యక్షులు జి. వెంకటేశ్వర్లు, సీనియర్ న్యాయవాది రాజి రెడ్డి, మహిళా చట్టాలపై మాట్లాడారు.
కార్యక్రమంలో జిల్లా ఎక్సైజ్ అధికారి కృష్ణప్రియ,  జిల్లా ఉద్యాన శాఖ అధికారి అన్నపూర్ణ,  జిల్లా పంచాయతీ అధికారి సునంద,  కలెక్టరేట్ సూపరింటెండెంట్ శ్రీమతి వీరాబాయి, మహిళా అధికారులు,  ఉద్యోగినులు పాల్గొన్నారు.
తొలుత అవగాహన సదస్సును జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
మహిళలు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేలా ధైర్యంగా, సాధికారికంగా ఉండాలని, తమ హక్కులను కాపాడుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.

Share This Post